కలెక్టరేట్‌ ప్రారంభం ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-10-20T05:33:12+05:30 IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) నిర్మాణ పనులు చిన్న చిన్న పనులు మినహా దాదాపు పూర్తయినా ఆరంభానికి నోచుకోవడం లేదు.

కలెక్టరేట్‌ ప్రారంభం ఎప్పుడో?
పూర్తయిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం

- నిర్మాణం పూర్తయినా ఆరంభానికి నోచుకోని వైనం

- ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) నిర్మాణ పనులు చిన్న చిన్న పనులు మినహా దాదాపు పూర్తయినా ఆరంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఇరుకిరుకు భవనాల్లో కార్యాలయాలను నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల నుంచి ఈ భవన సముదాయాన్ని ఆరంభిస్తామంటూ ఊరిస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 11వ తేదీనే ఆరంభిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారోననే విషయమై ఇంకా ఎటూ తేల్చడం లేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. అందులో భాగంగా పెద్దపల్లి కేంద్రంగా 14 మండలాలతో ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో 2016 అక్టోబరు 11 నుంచి పాలన అమల్లోకి వచ్చింది. జిల్లా కార్యాలయాలను ఐటీఐ, సాంఘిక సంక్షేమ శాఖ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌, విద్యా వనరుల కేంద్రం, స్త్రీశక్తి భవనం, తదితర భవనాల్లో ఏర్పాటు చేశారు. కొన్ని శాఖలకు ప్రభుత్వ భవనాలు దొరకకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. జిల్లా ఏర్పాటై ఐదు సంవత్సరాలు పూర్తయినా వివిధ కార్యాలయాలు ఫైళ్లతో పేరుకుపోయాయి. వాటిని భద్రపరిచేందుకు స్టోర్‌ రూములు లేక ఉన్న ఇరుకు గదుల్లో ఉంచుతున్నారు. దీంతో స్థలం లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాలన్నింటికీ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా జిల్లాలో రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో కలెక్టరేట్‌ నిర్మాణాన్ని ఆరంభించారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌ భవనాలను ఒకే డిజైన్‌లో నిర్మించారు. 

- 48 కోట్లతో అంచనా వ్యయంతో..

2017, అక్టోబరు 11న కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఏడాదిలో భవనాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పగా, అది పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. సుమారు 48 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. దాదాపు 32 నుంచి 34 వివిధ శాఖల నిర్వహణ కోసం ఈ భవనాన్ని నిర్మించారు. అలాగే జిల్లా కలెక్టర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయాలతో పాటు, నివాస గృహాలను కూడా నిర్మించారు. మరో 8 మంది జిల్లా అధికారులకు నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రధాన ద్వారం, దాని నుంచి లోపలికి వచ్చేందుకు ప్రధాన రహదారి, గార్డెన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భవనాన్ని ఆరంభించి కార్యాలయాలను నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ భవన సమూదాయాన్ని ఆరంభించడం లేదు. ఈ నెల  11 జిల్లా ఆవిర్భావ దినం కావడంతో అదే రోజున సీఎం కేసీఆర్‌ ఆరంభిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఆరంభం కాలేదు. కార్యాలయాన్ని ఆరంభించకపోవడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన కలెక్టరేట్‌ను ఆరంభించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-20T05:33:12+05:30 IST