బిల్లులు ఇచ్చేది ఎన్నడు..?

ABN , First Publish Date - 2020-09-19T10:17:11+05:30 IST

నాడు నేడు పనులు నిధుల కొరతతో నిలిచిపోతున్నాయి. బడులు తెరిచేలోగా వం

బిల్లులు ఇచ్చేది ఎన్నడు..?

ఆగిన నాడు నేడు పనులు

అప్పులు చేసిన ప్రధానోపాధ్యాయులు


ఆదోని(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 18: నాడు నేడు పనులు నిధుల కొరతతో నిలిచిపోతున్నాయి. బడులు తెరిచేలోగా వందశాతం పనులు పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ తగినన్ని నిధులు ఇవ్వడం లేదు. దీంతో పనులను నిలిపేశామని పలువురు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. ఆదోని నియోజకవర్గంలో 139 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.


మొదటి విడత 67 పాఠశాలలను నాడు నేడు కింద ఎంపిక చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 51, పట్టణంలోని 16 పాఠశాలలు ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చాలా పాఠశాలల్లో 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలల్లో 90 శాతం పూర్తయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్‌, ప్రహరీ, మరమ్మతు పనులు ఇందులో ఉన్నాయి.


కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకూ రూ.7.68 కోట్లు మాత్రమే చెల్లించారు. ఒత్తిడి కారణంగా ప్రధానోపాధ్యాయులు మెటీరియల్‌ కోసం దుకాణాల్లో అప్పు చేశారు. ఇలా రూ.8 కోట్లకు పైగా పనులు జరిగాయి. 25 రోజుల క్రితం బిల్లులు అప్‌లోడ్‌ చేసినా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు కూలీలకు డబ్బు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. 


 ఆదోని పట్టణంలోని కిల్చిన్‌పేట పురపాలక ఉన్నత పాఠశాలకు రూ.21 లక్షలు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.12.90 లక్షలు  బిల్లు మంజూరైంది. ఇక్కడ 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. రూ.5 లక్షల వరకూ బిల్లులు రావాల్సి ఉంది. దీంతో  మిగిలిన పనులను ఆపేశారు.

 

 నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలకు రూ.97 లక్షలు మంజూరైంది. ఇప్పటి వరకు రూ.39 లక్షలు ఖర్చు చేశారు. ఇక్కడ కూడా అదనంగా మరో రూ.5 లక్షల పనులు జరిగాయి. మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ ఉన్నత పాఠశాలలో 70 శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. నియోజకవర్గంలో అన్ని పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది. 


ఆలోగా పూర్తయ్యేనా.. 

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చింది. ఈ నెల 21 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని సూచించింది. అక్టోబరు 5 నుంచి పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీనే పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉన్నింది. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రారంభం కాలేదు. ఇప్పటికీ నాడునేడు పనులు పూర్తి కాలేదు. పాఠశాలలు పునఃప్రారంభం అయితే తరగతి గదుల్లో కూర్చోలేని పరిస్థితి ఉంది.


బిల్లులు మంజూరవుతాయి..- శివరాములు, ఎంఈవో, ఆదోని

నాడు నేడు పనులకు రెండు మూడు రోజుల్లో బిల్లులు మంజూరవుతాయి. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. నిధుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2020-09-19T10:17:11+05:30 IST