Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిల్లు ఎప్పుడిస్తారు..!?

ఆర్భాటంగా జగనన్న కాలనీల నిర్మాణాలకు శ్రీకారం

అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు

బేస్‌మెంట్‌, ఆపై కట్టినవి 8,657

చెల్లించాల్సిన బిల్లులు రూ.38.10 కోట్లు

బిల్లుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు


కడప నగరానికి చెందిన రాజేష్‌ (పేరు మార్చాం) భార్య, పిల్లల పోషణ కోసం ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నాడు. జగనన్న ఇల్లు మంజూరైంది. సొంతింటి కల సాకారమవుతుందని ఇంటి నిర్మాణం కోసం రూ.75 వేలు అప్పు చేశాడు. ఇంటికి సంబంధించిన ఒక్క బిల్లు కూడా ఇవ్వలేదు. అధికారులను అడిగితే ప్రభుత్వానికి పంపాం, బిల్లేమో వస్తుందంటున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కరోనా వల్ల గిరాకీ లేదని, పనికి రావద్దని హోటల్‌ యజమాని చెప్పాడు. ఉన్న ఉపాధి పోయింది. బతకడం భారమైంది. ఇంటి బిల్లు రాలేదు.. అప్పు తీర్చేదెలా..? రాజేష్‌ కన్నీటి వేదన ఇది. ఆయన ఒక్కడే కాదు.. జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రతి ఒక్కరిదీ ఇదే గాఽథ. జగనన్న ఇంటి నిర్మాణాల బిల్లులకు సంబంధించి జిల్లాలో రూ.38.10 కోట్లు చెల్లించాలి.


(కడప-ఆంధ్రజ్యోతి): ‘నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా మూడు విడతల్లో జిల్లాలోని వివిధ గ్రామాల్లో 1,06,828 ఇళ్ల మంజూరు, 697 జగనన్న కాలనీలు నిర్మించాలన్నది ప్రణాళిక. లబ్ధిదారులు ఆసక్తితో 87,198 ఇళ్లకు పునాదులు తీశారని అధికారులు పేర్కొన్నారు. 21,584 మంది అబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడం వల్ల పునాదులు కూడా తీయలేదు. నిర్మాణాలు మొదలైన వాటిలో బేస్‌మెంట్‌ ఆపైన వివిధ దశల్లో 8,657 ఇళ్లు ఉన్నాయి. పూర్తిగా నిర్మించిన ఇళ్లు 124 మాత్రమే. అయితే నెలలు గడిచినా బిల్లులు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


రూ.38.10 కోట్లు బకాయి 

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు మొదట్లో ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. 1. లబ్ధిదారులే ఇల్లు కట్టుకుంటే దశల వారీగా బిల్లు చెల్లింపు, 2. ప్రభుత్వం నిర్మాణ మెటీరియల్‌ సరఫరా చేస్తే.. లబ్ధిదారులే ఇల్లు కట్టుకుంటే మిగిలిన అమౌంట్‌ దశల వారీగా చెల్లింపు, 3. ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వడం. అందరు కూడా మూడో ఆప్షన ఎంచుకోవడం వల్ల ప్రభుత్వం ఆ ఆప్షనను తొలగించింది. దీంతో రెండో ఆప్షనకు వెళ్లారు. గృహ నిర్మాణ అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. ఇల్లు కట్టుకోకపోతే పట్టా రద్దు అవుతుందని అధికారులు భయపెట్టడంతో ఇష్టం లేకపోయినా పలువురు లబ్ధిదారులు అప్పు చేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం కొందరికి సిమెంట్‌ సరఫరా చేసింది. శుక్రవారం వరకు అధికారిక లెక్కల ప్రకారం 87,584 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం (గ్రౌండింగ్‌) చుడితే.. బేస్‌మెంట్‌ లెవల్‌లో 6,239, రూఫ్‌ లెవల్‌లో 1,095, రూఫ్‌ కంప్లీట్‌ (స్లాబ్‌ పూర్తైనవి) 1,199, పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసినవి 124 ఇళ్లు. వీటి కోసం లబ్ధిదారులకు రూ.53.09 కోట్లు చెల్లించాలని గృహ నిర్మాణ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు కేవలం రూ.14.99 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.38.10 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నెలలు గడిచినా బిల్లులు అందక.. చేసిన అప్పులు తీర్చలేక.. మిగిలిన నిర్మాణాలకు అప్పులు పుట్టక అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


హైకోర్టు జోక్యంతో..:

సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తూ.. దీనిపై లోతైన విచారణ అవసరం, అప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయవద్దంటూ ఈనెల 8న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. అయితే ఇప్పటికే అప్పుచేసి ఇంటి నిర్మాణాలు చేపట్టిన తమకు బిల్లులు చెల్లించి ఆదుకోవాలని పేదలు కోరుతున్నారు. 


ప్రభుత్వానికి పంపించాం 

- ఎం.కృష్ణయ్య, ఇనచార్జి పీడీ, గృహ నిర్మాణ శాఖ, కడప

జిల్లాలో ‘నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్లు పథకం’ కింద మూడు విడతల్లో 1,06,828 ఇళ్లు మంజూరు అయితే 87,198 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. బేస్‌మట్టంపైన వివిధ దశల్లో 8,567 ఇళ్లు ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.53.09 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఇప్పటి వరకు రూ.14.99 కోట్లు చెల్లించారు. రూ.38.10 కోట్లు చెల్లించాల్సి ఉంది.


జగనన్న కాలనీల ఇళ్ల పురోగతి, చెల్లించాల్సిన బిల్లులు రూ.కోట్లల్లో.. 

------------------------------------------------------------------------------

నియోజకవర్గం మంజూరు గ్రౌండింగ్‌ బేస్‌మట్టం చెల్లించాల్సిన 

చేసినవి ఆపైన బిల్లులు

-------------------------------------------------------------------------------

కమలాపురం 5,233 4,844 950 3.48

రాయచోటి 9,589 8,830 1,404 6.65

కడప 26,392 19,671 1,352 6.43

ప్రొద్దుటూరు 21,341 16,183 429 1.82

మైదుకూరు 8,246 7,236 1,038 3.57

పులివెందుల 6,351 5,176 160 0.65

జమ్మలమడుగు 8,964 7,208 1,006 4.80

రాజంపేట 7,633 6,439 850 3.76

రైల్వేకోడూరు 5,747 5,172 862 3.98

బద్వేలు 7,332 6,439 606 2.96

--------------------------------------------------------------------------------

మొత్తం 1,06,828 87,198 8,657 38.10

---------------------------------------------------------------------------------

Advertisement
Advertisement