మా లెక్క ఎప్పుడిస్తారు..?

ABN , First Publish Date - 2021-06-20T05:44:51+05:30 IST

రైతులు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో జొన్న పంట విక్రయించి రెండు నెలలు దాటినా పలువురికి డబ్బులు అందక..

మా లెక్క ఎప్పుడిస్తారు..?

జొన్నలు కొనుగోలు చేసి రెండునెలలు..

ఇప్పటికీ పలువురు రైతులకు అందని లెక్క

జిల్లాలో బకాయి రూ.1.27 కోట్లు

అప్పులపై పెరుగుత్ను వడ్డీలు

ఖరీఫ్‌ పెట్టుబడికి పుట్టని అప్పులు

(కడప-ఆంధ్రజ్యోతి): రైతులు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో జొన్న పంట విక్రయించి రెండు నెలలు దాటినా పలువురికి డబ్బులు అందక.. ఖరీఫ్‌ పెట్టుబడికి లెక్క పుట్టక ఆందోళన చెందుతున్నారు. కడప, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట  ప్రాంతాల రైతులు 2020-21 ఖరీఫ్‌, రబీలో 11,250 ఎకరాలలో జొన్న సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో జొన్న ధరలు నాణ్యతను బట్టి క్వింటా రూ.1,300 - రూ.1,600లకు పడిపోయాయి. ఈ పరిస్థితుత్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా మనిషి ఆహారంగా ఉపయోగించే మహేంద్ర, రాయచూరు రకాలకు చెందిన జొన్నలు క్వింటా రూ.2,620, పశువుల దాణా, కార్మాగారాలకు వాడే శ్రీనిధి మొదలైన హైబ్రీడ్‌ రకం క్వింటా రూ.1,850 మద్దతు ధర నిర్ణయించారు. జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 కేంద్రాల్లో రెండో కరం జొన్న మాత్రమే కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆహారంగా వాడే మేలుకరం జొన్నలు కూడా మార్క్‌ఫెడ్‌కు రూ.1,850లకే విక్రయించారు. 783 మంది రైతుల నుంచి 2,303 టన్నులు కొనుగోలు చేశారు. రూ.4.26 కోట్లు రైతులకు చెల్లించాలి. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి 609 మంది రైతులకు రూ.2.99 కోట్లు చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా 174 మంది రైతులకు రూ.1.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2 నెలలు గడుస్తున్నా జొన్న అమ్మిన డబ్బులు కారపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా మార్క్‌ఫెడ్‌ కేంద్రాల్లో పంట అమ్మిన వారం పది రోజుల్లో ఆనలైన్లో లెక్క (డబ్బు) వేస్తారని రైతులు ఆశించారు. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌ కాపీలను అందజేశారు. రోజులు.. నెలలు గడుస్తున్నా అకౌంట్లో డబ్బు పడలేదు. ఎప్పుడిస్తారో..? స్పష్టత ఇవ్వడం లేదు. సకాలంలో ఇస్తే పెట్టుబడి కోసం చేసిన అప్పుల వడ్డీ భారం తగ్గుతుందని, ఈ ఖరీఫ్‌ పెట్టుబడి అప్పు సకాలంలో పుడుతుందని రైతులు అంటున్నారు.


వడ్డీలు పెరుగుతున్నాయి

- చిటికెల మునెమ్మ, టంగుటూరు గ్రామం, రాజుపాలెం మండలం 

నాలుగు ఎకరాల్లో జొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు సాగు ఖర్చు వచ్చింది. ఏపీ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో 40 క్వింటాళ్లు అమ్మాను. రూ.74 వేలు లెక్క రావాలి. నెలన్నర కావొస్తున్నా బ్యాంకులో లెక్క వేయలేదు. పెట్టుబడికి చేసిన అప్పుల వడ్డీలు పెరుగుతున్నాయి. వెంటనే ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది.


త్వరలోనే బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది

- పరిమళజ్యోతి, జిల్లా మేనేజరు, ఏపీ మార్క్‌ఫెడ్‌, కడప

జిల్లాలో 783 మంది రైతుల నుంచి 2,303 మెట్రిక్‌ టన్నుల జొన్నలు కొనుగోలు చేశాం. రూ.4.26 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే 609 మంది రైతులకు రూ.2.99 కోట్లు బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యింది. 174 మందికి రైతలకు రూ.1.27 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వానికి బిల్లులు పంపాం. త్వరలోనే రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుంది. 

Updated Date - 2021-06-20T05:44:51+05:30 IST