ఎప్పటికి పూర్తవుతుందో...?

ABN , First Publish Date - 2022-05-29T04:37:20+05:30 IST

ఆ రోడ్డు నిర్మాణ పనులు నత్తను మరిపిస్తున్నాయి.

ఎప్పటికి పూర్తవుతుందో...?
గుంజనేరు వద్ద అసంపూర్తిగా ఉన్న కల్వర్టు నిర్మాణం

నత్తనడకన రోడ్డు నిర్మాణ పనులు 

పనులు ప్రారంభించి మూడేళ్లు 

గతుకుల రోడ్డుపై వాహనదారుల ఇబ్బందులు


పెనగలూరు, మే 28 : ఆ రోడ్డు నిర్మాణ పనులు నత్తను మరిపిస్తున్నాయి. పనులు ప్రారంభించి మూడేళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సింగనమల-ఈటిమాపురం రోడ్డు దుస్థితి ఇది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అప్పటి రాజంపేట ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ సహకారంతో రూ.2.30 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులతో పెనగలూరు-రాజంపేట ఆర్‌అండ్‌బీ రోడ్డును సింగనమల క్రాస్‌ నుంచి ఈటిమాపురం వరకు తారురోడ్డు మధ్యలో గుంజనేరుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించారు. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు 18 ఏళ్లు కావస్తున్నా ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను కూడా పూడ్చిన నాథుడే లేడు. ఈ రోడ్డు దుస్థితి గురించి ప్రజల విన్నపాల మీద, విన్నపాలు అధికారులకు, నాయకులకు తెలపడంతో ఎట్టకేలకు మూడేళ్ల కిందట పీఎంజీఎ్‌సవై ద్వారా రూ.4.20 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో సింగనమల-ఈటిమాపురం రహదారి పునర్‌ నిర్మాణంతో పాటు గుంజనేరు నుంచి పొందలూరు వరకు కొత్త రోడ్డు నిర్మించాల్సి ఉంది. రాజంపేటకు చెందిన ఓ సంస్థ కాంట్రాక్ట్‌ పనులు చేయాల్సి ఉండగా మండలంలోని నలుగురు ద్వితీయ శ్రేణి నాయకులకు ఆ పనులను సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఆ నలుగురు సబ్‌ కాంట్రాక్టర్లు మూడేళ్ల నుంచి గుంజనేరు వద్ద ఒకటి, పొందలూరు దారిలో మరో రెండు కల్వర్టులు నిర్మించి తర్వాత పనులు చేయలేదు. ఈ మూడేళ్ల కాలంగా పనులు చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నారు కానీ రోడ్డు నిర్మాణ పనుల్లో ఏమాత్రం కదలికలు లేవు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో 9.430 కిలోమీటర్లు తారురోడ్డు, 0.735 కిలోమీటర్ల సిమెంటు రోడ్డు నిర్మించాల్సి ఉంది. పనులు ప్రారంభించిన మూడేళ్ల కాలంలో రోడ్లపై ఏర్పడిన గుంతలపైనా మట్టి కూడా పోసిన పాపానపోలేదు. గుంతల మిట్టల రహదారిపై ప్రయాణించాలంటే నరకం అనుభవిస్తున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక నెల రోజులే గడువు ఉంది. పనులు జరుగుతున్న తీరు చూస్తే ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 


జాప్యం జరుగుతోంది..

- శ్రీనివాసులు, పీఆర్‌ ఏఈ

గత రెండేళ్లలో కరోనా ప్రభావంతో కూలీలు దొరకకపోవడం ఒక కారణం. రెండుసార్లు భారీ వర్షాలు కురవడంతో వరదల వల్ల కూడా కొంత జాప్యం జరిగింది. దళితవాడ వద్ద భూసేకరణ వల్ల కూడా జాప్యం జరిగింది. రైతులకు, కాంట్రాక్టర్లకు జరిగిన చర్చలలో ఒకసారి విఫలం కావడం, చర్చలు సఫలవంతమైన తరువాత అప్పటికే ఆ భూసేకరణ భూముల్లో పంటలు ఉండటం కూడా జాప్యానికి కారణమవుతోంది. 


రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది

- కె.శంకరయ్య, ఈటిమాపురం.

మండల కేంద్రానికి నిత్యం రెండు మూడుసార్లు అయినా పోయి వస్తుంటాను. నాకున్న మోపెడ్‌ వాహనంలో ప్రయాణించేటప్పుడు గుంతల మిట్టల రోడ్డుపైన ప్రయాణించకుండా ఉన్నా బాగుండుననిపిస్తుంది. తప్పనిసరిగా అవసర నిమిత్తం వెళ్లాల్సి వచ్చినప్పుడు పది నిమిషాల్లో ప్రయాణించాల్సి ఉండగా అరగంట సమయం పడుతోంది.


పొలాలకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది

- చాగల రమణయ్య, సింగనమల

సింగనమల నుంచి గుంజనేరు వంతెన వరకు కిలోమీటరు దూరం లేకపోయినప్పటికీ ఆ కొంతదూరం నడిచి వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది. ఈ రోడ్డు త్వరగా నిర్మిస్తే బాగుంటుందని ఊరి వారంతా అనుకుంటున్నారు. అయినప్పటికీ అధికారులతో, కాంట్రాక్టర్లతో ఎప్పుడు నిర్మిస్తారని అడిగితే ఏమవుతుందోనని భయం అందరినీ వెంటాడుతోంది. మనకెందుకులే ఎప్పుడు నిర్మిస్తే ఏం.. కాకపోతే ఏమిలే.. అన్నట్లుగా నిట్టూరుస్తూ ఆ రోడ్డుపైనే పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. 



Updated Date - 2022-05-29T04:37:20+05:30 IST