దుద్దెడ బస్టాండ్‌ వాడుకలోకి వచ్చేదెప్పుడో?

ABN , First Publish Date - 2022-08-15T05:18:27+05:30 IST

లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాలను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

దుద్దెడ బస్టాండ్‌ వాడుకలోకి వచ్చేదెప్పుడో?
నిరుపయోగంగా ఉన్న దుద్దెడ బస్టాండ్‌

రెండు దశాబ్దాలుగా నిరుపయోగమే

వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికుల వేడుకోలు

కొండపాక, ఆగస్టు 14: లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాలను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. కొండపాక మండలం దుద్దెడలో నిర్మించిన బస్టాండే ఇందుకు ఉదాహారణ. ఎంపీ నిధులు సుమారు రూ.12 లక్షలతో దుద్దెడలో బస్టాండ్‌ నిర్మించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2002 ఏప్రిల్‌ 3న అప్పటి రవాణాశాఖ మంత్రి బీవీ.మోహన్‌రెడ్డి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభించిన నాటి నుంచి ఒక్కరోజు కూడా బస్టాండ్‌లోకి బస్సు వచ్చింది లేదు. దీంతో 20 ఏళ్ల నుంచి బస్టాండ్‌ నిరుపయోగంగానే ఉంటుంది. రాజీవ్‌ రహదారిపై ఉన్న దుద్దెడ గ్రామం సుమారు ఐదారు గ్రామాలకు కూడలిగా ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు దుద్దెడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులంతా బస్సుల కోసం రోడ్డు పక్కన నిల్చుని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. బస్టాండ్‌ నిరుపయోగంగా ఉండడంతో సంచార జాతులు అందులో తలదాచుకుంటున్నారు. 

తిరిగి బాగుచేసినా..

 ఇటీవల దుద్దెడ బస్టాండ్‌ను తిరిగి ప్రారంభించడానికి గ్రామపంచాయతీ పాలకవర్గం సుమారు మూడున్నర లక్షలను వెచ్చించి మరమ్మతులు చేయించారు. కానీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రారంభించుకోలేకపోయామని వాపోతున్నారు. వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మధ్యలో ఎక్కడ కూడా టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో దుద్దెడ లాంటి బస్టాండ్‌ వద్ద కనీసం బస్సులను నిలిపితే అవసరాలు తీరుతాయని వాపోతున్నారు.

పూర్తి సహకారం అందిస్తాం

సుమారు అర ఎకరం స్థలంలో రాజీవ్‌ రహదారి పక్కన లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ నిరుపయోగంగా ఉంది. వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి. ఇటీవలనే దుద్దెడ పంచాయతీ నిధుల నుంచి మూడున్నర లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టాం. అయినప్పటికీ ప్రారంభించడం లేదు.

- ఆరేపల్లి మహదేవ్‌, దుద్దెడ సర్పంచ్‌

Updated Date - 2022-08-15T05:18:27+05:30 IST