ఈ పండు ఎప్పుడు తినాలంటే..!

ABN , First Publish Date - 2022-08-16T16:46:34+05:30 IST

అరటిపండు ఆరోగ్యకరం. అయితే తినే సమయం, పండిన తీవ్రతలను బట్టి పండులోని పోషకాలతో

ఈ పండు ఎప్పుడు తినాలంటే..!

రటిపండు ఆరోగ్యకరం. అయితే తినే సమయం, పండిన తీవ్రతలను బట్టి పండులోని పోషకాలతో పాటు శరీరానికి అందే పోషకాలలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కాబట్టి పోషకాల అవసరాన్ని బట్టి అరటిపండును తినడం ఆరోగ్యకరం!


పక్వానికి వచ్చిన అరటిపండు కంటే బాగా మగ్గిన అరటిపండు తీపి ఎక్కువ. ఇందుకు కారణం దోరగా పండిన అరటిపండులో స్టార్చ్‌ పూర్తి సింపుల్‌ షుగర్స్‌గా విడిపోవు. అదే బాగా మగ్గిన పండులో స్టార్చ్‌ షుగర్స్‌గా విడిపోయి ఉంటుంది. కాబట్టి బాగా మగ్గిన అరటిపండు ఎక్కువ తియ్యగా ఉంటుంది. 


మగ్గిన పండు ఎప్పుడు: తోలు మీద నల్ల మచ్చలు ఏర్పడితే ఆ అరటిపండు బాగా మగ్గిందని అర్ధం. ఈ పండు తేలికగా జీర్ణం అవుతుంది. వ్యాయామానికి ముందు లేదా తర్వాత తక్షణ శక్తి పొందాలంటే ఇలా మగ్గిన అరటిపండు తినాలి.


నిద్ర కోసం: అరటిపండులో మన శరీరంలో స్వతహాగా తయారుకాని ట్రిప్టోఫాన్‌ అనే అమీనో యాసిడ్‌ ఉంటుంది. ఈ అమీనో యాసిడ్‌ నిద్రను క్రమబద్ధీకరించే సెరటోనిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ మెదడులో ఉత్పత్తయ్యే అత్యంత ముఖ్యమైన రసాయనం. ఇది ఒత్తిడి, కుంగుబాటులను తగ్గించి నిద్రలేమిని పోగొడుతుంది.


పరగడుపున వద్దు: ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు ఉన్నా, పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. దీన్లో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా, అంతే వేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే అలసటకూ గురిచేస్తాయి. ఆమ్లతత్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే, ఆ పళ్లను ఇతర పదార్థాలతో కలిపి తినాలి.

Updated Date - 2022-08-16T16:46:34+05:30 IST