ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పిలుపు ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-05-26T04:18:55+05:30 IST

పునర్నియామక పిలుపు కోసం ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించి రెండు నెలలు గడిచిపోయినా ఇంత వరకు వారికి గ్రామీణాభివృద్ధి శాఖ అఽధికారుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో వారు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పిలుపు ఎప్పుడో?

విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం

ఇంత వరకు వెలువడని ఆదేశాలు

తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

పునర్నియామక పిలుపు కోసం ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించి రెండు నెలలు గడిచిపోయినా ఇంత వరకు వారికి గ్రామీణాభివృద్ధి శాఖ అఽధికారుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో వారు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు.

వికారాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  ఉపాఽధి హామీ పనుల్లో ప్రధాన పాత్ర పోషించాల్సిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం రెండేళ్ల కిందట తొలగించింది. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలంటూ వివిధ రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చే స్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చాయి. చివరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు కూడా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలంటూ వచ్చిన విజ్ఞప్తులకు ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని గత మార్చి 15న అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు.  అసెంబ్లీలో ప్రకటించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసి రెండు నెలలు గడిచినా ఇంత వరకు వారిని విధుల్లోకి తీసుకోలేదు.

పంచాయతీ కార్యదర్శులకు అదనపు భారం

ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వర్తించాల్సిన బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. పంచాయతీ విధులతో సతమతమవుతున్న కార్యదర్శులకు అదనంగా తమకు ప్రభుత్వం అప్పగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల బాధ్యతలతో అదనపు పని భారం పడింది. పంచాయతీ విధులతో పాటు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడం వారికి భారంగా మారింది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేక ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి పనులు చాలా వరకు మే నెలలో ఎక్కువగా కొనసాగుతాయి. వర్షాలు కురిస్తే ఉపాధి హామీ పనులు నిలిచిపోతాయి. వ్యవసాయ పనులు ప్రారంభమైతే ఉపాధి పనులకు వచ్చే వారంతా ఆ పనులు మానేసి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఉపాధి పనులు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉండే మే నెలలోనే ఆ పనులు కొనసాగించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉపాధిని కోరుకునే కూలీలందరికీ పనులు కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలో 341 మంది ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేసేవారు. జిల్లాలో ఇంతకు ముందు 366 గ్రామ పంచాయతీలు ఉండగా, కొత్త పంచాయతీలు ఏర్పాటైన తరువాత జిల్లాలో పంచాయతీల సంఖ్య 566కు పెరిగింది. పంచాయతీలు పెరిగినా జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఖ్య పెరగలేదు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని గ్రామాల్లో సీనియర్‌ మేట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్ల బాధ్యతలు నిర్వహించేవారు. రెండున్నరేళ్ల కిందట తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు  నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఈ విషయాన్ని సీనియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే విధుల్లో చేరాలని వారికి సూచించింది. అయితే తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే విధుల్లో చేరతామని ఫీల్డ్‌ అసిస్టెంట్లు స్పష్టం చేశారు. దీంతో ఉపాధి పనులకు విఘాతం కలుగుతోందంటూ 2020, మార్చి నెలలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లో నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్ల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులే అదనంగా నిర్వర్తిస్తున్నారు. 

ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఏమి చేసేవారంటే..

ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లది ముఖ్యపాత్ర. ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రకాల పనుల బాధ్యత ఫీల్డ్‌ అసిస్టెంట్లపైనే ఉంటుంది. జాబ్‌కార్డు లేని వారిని గుర్తించి జాబ్‌ కార్డులు అందజేయడం, వేసవిలో కూలీలకు పనులు కల్పించడం, మస్టర్‌లో కూలీల వివరాలు నమోదు చేయడం, సంతకాల సేకరణ, చేసిన పనిని టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహకారంతో పని లెక్కించడం, ప్లే స్లిప్‌ అందజేయడం తదితర పనులు ఫీల్ట్‌ అసిస్టెంట్లు నిర్వర్తించేవారు.  

విధుల్లోకి తీసుకోవాలి:సుభాష్‌గౌడ్‌,  ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు, బంట్వారం

ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించి రెండు నెలలు గడిచిపోయింది. గత రెండేళ్లుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధులకు దూరమై దుర్భరమైన జీవితాలు కొనసాగిస్తున్నారు. తమనువిధుల్లోకి తీసుకోవాలంటూ వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఎట్టకేలకు మాపై కరుణ చూపిన సీఎం కేసీఆర్‌ తమను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించినా ఇంత వరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేవని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాఽధికారులు వెంటనే స్పందించి తమను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2022-05-26T04:18:55+05:30 IST