Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎండల మల్లన్నా.. పనులు పూర్తయ్యేనా?

- నత్తనడకన ఆలయ అభివృద్ధి

- కార్తీకమాసంలో శీర్షాభిషేకం లేనట్లే

- భక్తుల సౌకర్యాలు ప్రశ్నార్థకం

(టెక్కలి/టెక్కలి రూరల్‌)

ఉత్కలాంధ్రుల ఆరాఽధ్య దైవం.. రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధి పనులకు బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. మూడేళ్ల కిందట రూ.75లక్షలతో చేపట్టిన ప్రాకార మండపం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా రూ.60లక్షలతో చేపట్టిన శీర్షాభిషేక మండప పున:నిర్మాణం, నవగ్రహ మండపం, భోగశాల, ఉపాలయాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఓవైపు కార్తీక మాసం సమీపిస్తున్నా.. పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఏటా కార్తీక సోమవారాల్లో జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఎండల మల్లన్నను దర్శించుకుంటారు. పనుల్లో జాప్యం కారణంగా ఈ ఏడాదీ భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఆలయంలో అభివృద్ధి పనుల దృష్ట్యా ఇప్పటికే రోజువారీ దర్శనాలకు, సేవలకు కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అసౌకర్యాల నడుమ కార్తీకమాసం ఉత్సవాలు నిర్వహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిర్మాణ సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆలయం లోపలి భాగంలో ఫ్లోరింగ్‌ పనులు పూర్తికాలేదు. దీంతో భక్తులు నడిచేందుకు సైతం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. కార్తీకమాసంలో ఇబ్బందులు లేకుండా  పనులు వేగవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, ఈ ఏడాది కార్తీక సోమవారాల్లో ప్రత్యేక దర్శనాలకు మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపారు. శీర్షాభిషేకం దర్శనాలకు అనుమతి లేదన్నారు. ప్రాకార మండపం, శీర్షాభిషేకం మండప పునః నిర్మాణం పనుల వేగవంతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 

Advertisement
Advertisement