నువ్వు చనిపోయినట్టు రికార్డుల్లో ఉందన్న అధికారుల మాటలతో నివ్వెరపోయిన మహిళ.. ఎవరి పనో తెలిసి..

ABN , First Publish Date - 2022-04-27T18:37:23+05:30 IST

ఒక మహిళ తను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది..

నువ్వు చనిపోయినట్టు రికార్డుల్లో ఉందన్న అధికారుల మాటలతో నివ్వెరపోయిన మహిళ.. ఎవరి పనో తెలిసి..

ఒక మహిళ తను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.. ఎదురుగా కనిపించి.. `నేను బతికే ఉన్నాను మహాప్రభో` అని చెబుతున్నా సరే ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకపోవడంతో విస్తుపోతోంది.. తన పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని కాజేసేందుకు బంధువు తన ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడని తెలుసుకుని షాకైంది.. చివరకు ఏం చేయాలో తెలియక జిల్లా ఎస్పీ ఆఫీస్‌ను ఆశ్రయించింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని దేవార్‌కు చెందిన 55 ఏళ్ల భూరీ బాయి భర్త నాలుగేళ్ల క్రితం మరణించాడు. అంతకు ముందు అతను తన పేరు మీద 1200 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. భర్త చనిపోగానే అత్తింటి వారు భూరీ బాయిని, ఆమె కొడుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో ఆమె అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. ఆ ఇంటి స్థలాన్ని కొట్టెయ్యడానికి భూరీ బాయి భర్త సోదరుడు స్కెచ్ వేశాడు. తన సోదరుడి భార్య చనిపోయిందని ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ భూమిని తన పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. 


ఇటీవల భూరీ బాయి ఆ స్థలం పని మీద మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడ అధికారులు ఆమెను `నువ్వు చనిపోయావు కదా` అని ప్రశ్నించారు. దీంతో ఆమె షాకైంది. ఎంత చెప్పినా మున్సిపల్ అధికారులు ఆమె మాట వినలేదు. దీంతో ఆమె తన బావగారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-27T18:37:23+05:30 IST