కోలాహలంగా పెళ్లి వేడుక జరుగుతోంది.. చెవులు చిల్లులు పడే డీజేను ఎంజాయ్ చేస్తూ బంధువులు, స్నేహితులు సంతోషంగా వివాహంలో పాల్గొంటున్నారు.. ఆ డీజే కారణంగా స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.. సౌండ్ తగ్గించాలని అడగడానికి పెళ్లి వేడుక వద్దకు వెళ్లారు.. రాళ్లు, కర్రలతో వధువు తండ్రిపై దాడికి తెగబడ్డారు.. మహిళలని కూడా చూడకుండా బంధువులను చితక్కొట్టారు.. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు సమీపంలోని బయానాకు చెందిన సంజయ్ కాహర్ అనే వ్యక్తి తన కూతురు లక్ష్మి వివాహానికి భారీ ఏర్పాట్లు చేశాడు. వివాహ వేడుకలో డీజే ఏర్పాటు చేశాడు. పెద్ద పెద్ద బాక్సుల నుంచి భారీగా సౌండ్ రావడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పెళ్లి వేదిక వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌పై రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. సంజయ్‌ను కాపాడేందుకు అతని భార్య, సోదరి ప్రయత్నించారు.
మహిళలని కూడా చూడకుండా వారిని కూడా స్థానికులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురినీ బంధువులు హాస్పిటల్‌కు తరలించారు. దాడికి తెగబడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.