Abn logo
Sep 25 2021 @ 01:05AM

లక్ష్యం గొప్పదైనప్పుడు... మన ప్రయత్నం బలంగా ఉండాలి

సివిల్స్‌ మెయిన్స్‌ 127వ ర్యాంకర్‌ ఎం.లక్ష్మీసౌజన్య, సివిల్స్‌ 273 ర్యాంకర్‌ కె.ధీరజ్‌ కుమార్‌

సివిల్స్‌ 127వ ర్యాంకర్‌ ఎం.లక్ష్మీసౌజన్య

మామయ్య సలహాతో సివిల్స్‌ వైపు అడుగులు..మూడో ప్రయత్నంలో విజయం

రోజుకు 12-14 గంటలపాటు ప్రిపరేషన్‌ 

నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యం


విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి)

‘‘లక్ష్యం గొప్పదైనప్పుడు...మన ప్రయత్నం కూడా బలంగా ఉండాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది. విజయం సాధించే క్రమంలో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు వెనక్కి లాగుతుంటాయి. అవన్నీ, తట్టుకుని నిలబడి, ముందుకువెళ్లినప్పుడే గెలుపు సాధ్యమవుతుంది.’’

-సివిల్స్‌ మెయిన్స్‌ 127వ ర్యాంకర్‌ ఎం.లక్ష్మీసౌజన్యయూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌-2020 మెయిన్స్‌లో నగరానికి చెందిన లక్ష్మీసౌజన్య 127వ ర్యాంకు సాధించారు. సివిల్స్‌ సాధనలో తన ప్రయాణాన్ని ఆమె ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...


విశాఖలో విద్యాభ్యాసం

నాన్న ఎం.వెంకటరావు స్టీల్‌ప్లాంట్‌లో సీనియర్‌ మేనేజర్‌. అమ్మ పద్మావతి గృహిణి. అన్నయ్య బైజూస్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రాథమిక విద్య స్టీల్‌ టౌన్‌షిప్‌లోని డీఏవీ స్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ కైజన్‌ కాలేజీలో పూర్తిచేశా. ఆ తరువాత వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ చేశా. అనంతరం మూడేళ్లపాటు ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశా. ఉద్యోగం చేస్తున్న సమయంలో మా మామయ్య రఘుబాబు...నీకున్న సామాజిక సేవా ఆలోచనకు కలెక్టర్‌ అయితే బాగుంటుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉటుందన్నారు. కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేసే మామయ్య చెప్పిన మాటలు నాలో ఆలోచనను కలిగించాయి. ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుని ఇంట్లో చెప్పా. ఇంట్లో వాళ్లు ఓకే చెప్పారు. నాన్నకు చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ను చేయాలన్న కోరిక ఉండేదని అప్పటివరకు నాకు తెలియదు. సివిల్స్‌ వైపు వెళతానని చెప్పగానే నాన్న ఎంతో సంతోషించారు.  


మూడో ప్రయత్నంలో విజయం.. 

2016లో ఉద్యోగానికి స్వస్తి చెప్పి సివిల్స్‌ శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. ఢిల్లీలో కొన్నాళ్లు ప్రిపేర్‌ అయ్యా. ఆ తరువాత బెంగళూరుకు షిఫ్ట్‌ అయి అక్కడ ప్రిపరేషన్‌ కొనసాగించా. ఇప్పటివరకు మూడుసార్లు సివిల్స్‌ అటెంప్ట్‌ చేశా. 2018లో 560 ర్యాంకు వచ్చింది. అయితే, సర్వీస్‌ అలెకేషన్‌ కాలేదు. తాజా ఫలితాల్లో 127 ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌ వస్తుందనుకుంటున్నా. శిక్షణలో భాగంగా రోజుకు 12-14 గంటలపాటు చదువుకు కేటాయించేదాన్ని. ప్రతి రెండు గంటలకు 10-15 నిమిషాలు చొప్పున విరామం తీసుకునేదాన్ని. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచి.. గంటపాటు యోగా, వ్యాయామం చేసిన తరువాత చదవడం ప్రారంభించే దాన్ని. 


సీనియర్ల సలహాలతో మేలు.. 

రెండో ప్రయత్నంలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను సీనియర్ల సలహాలతో అధిగమించడం ద్వారా మూడో ప్రయత్నంలో విజయం సాధ్యమైంది. ముఖ్యంగా సీనియర్ల వీడియోలు ఎక్కువగా చూసేదాన్ని. గతంలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరుగా సమయం కేటాయించి ప్రిపేర్‌ అయ్యా. దానివల్ల ఇబ్బందులుండడంతో సీనియర్లు సలహా మేరకు రెండింటికీ కలిపే ప్రిపేర్‌ అయ్యా. రెండో ప్రయత్నంలో విజయం సాధించిన సీనియర్లు మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎలా మాట్లాడాలో చెప్పారు.  


అండగా కుటుంబం..

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న తరుణంలో అనేకసార్లు.. నేను సాధించగలనా..? అన్న ప్రశ్న తలెత్తింది. అటువంటి సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడితే వారు ఎంతో ప్రోత్సహించేవారు. కలెక్టర్‌ కాగల సత్తా నీలో ఉందని, నువ్వు దిగులుపడకుండా ప్రయత్నించమని చెప్పేవారు. మోరల్‌గా, ఫైనాన్సియల్‌గా ఎంతగానో సహకారాన్ని అందించారు. వారివల్లే ఈ విజయం సాధ్యమైంది. 


సేవ చేయడమే లక్ష్యం.. 

నిరుపేదలకు మెరుగైన సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతా. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తాము ఏర్పాటుచేసుకున్న లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్లాలి. 


లక్ష్యంపై స్పష్టత అవసరం

ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధి సివిల్స్‌తోనే సాధ్యం

సివిల్స్‌ 273 ర్యాంకర్‌ కె.ధీరజ్‌ కుమార్‌


విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘లక్ష్యంపై స్పష్టత...దానికి తగ్గట్టుగా ప్రయత్నముంటే విజయం సాధించవచ్చు. ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధి సివిల్‌ సర్వీస్‌తోనే సాధ్యమన్న ఉద్దేశం, ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో ఐపీఎస్‌ శిక్షణలో వున్నప్పటికీ మళ్లీ పరీక్ష రాశా. మంచి ర్యాంకు రావడంతో లక్ష్యం ఫలిస్తుందనుకుంటున్నా’ అన్నారు సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో 273వ ర్యాంకు సాధించిన నగర యువకుడు కె.ధీరజ్‌. ఇంకా ఆయన ఏమన్నారంటే... 


లక్ష్యం నెరవేరినట్టైంది.. 

నాన్న కేవీ రమణ డీఎస్పీగా చేస్తున్నారు. అమ్మ పార్వతి గృహిణి. సివిల్స్‌ సర్వీసెస్‌తో ప్రజలకు సేవ చేయడానికి అవకాశముంటుందన్నది చిన్నప్పటి నుంచి నా భావన. మద్రాస్‌ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసిన తరువాత విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివితే బాగా సెటిల్‌ కావచ్చు. వచ్చే ఆదాయంతో ప్రజలకు పరోక్షంగా సేవ చేయవచ్చు. కానీ, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయడంతోపాటు సంక్షేమం, సమాజాభివృద్ధికి మన ఆలోచనలను జోడించాలంటే సివిల్‌ సర్వీస్‌లోనే మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఉన్నత చదువు ఆలోచనలను మాని సివిల్స్‌ వైపు అడుగులు వేశాను. 2019 సివిల్స్‌ ఫలితాల్లో 320 ర్యాంకు సాధించడం ద్వారా ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నా. ఈ ఏడాది వెల్లడించిన సివిల్స్‌ ఫలితాల్లో 273 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. సివిల్స్‌కు ఎవరైనా సన్నద్ధం కావచ్చు. కాకపోతే, ఎందుకు ఎంపిక చేసుకుంటున్నామన్న దానిపై స్పష్టత ఉండాలి.


ప్రణాళిక ముఖ్యం.. 

సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్‌ సాగించాలి. జనరల్‌ స్టడీస్‌ కోసం స్టాండర్డ్‌ పుస్తకాలను ఫాలో కావాలి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం మంత్లీ మ్యాగజైన్లు చదవాలి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు సన్నద్ధమైనప్పుడు వీలైనన్ని టెక్ట్స్‌ సిరీస్‌లు పూర్తిచేయాలి. తెలుగు మీడియం బ్యాక్‌ గ్రౌండ్‌ అయితే సివిల్స్‌కు ఎంపిక కాలేమనే భావన చాలామందిలో ఉంది. కానీ, ఇంగ్లీష్‌పై పట్టు ఉండి, ఇంటర్నెట్‌లో వివిధ అంశాలను ఫాలో కాగలిగే సామర్థ్యముంటే సివిల్స్‌ సాధించడం సులభమే. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకునే వారికి నేను చెప్పేదొకటే...లక్ష్యంపై స్పష్టత, సాధించాలన్న తపన, బలమైన ఆకాంక్ష ఉంటే...విజయం సాధించడం తథ్యం.