హుండీ దొంగల గుట్టు ఛేదించేదెప్పుడో..?

ABN , First Publish Date - 2022-05-27T04:57:06+05:30 IST

మండలంలోని తవళం అటవీ ప్రాంతం రుషి భూమిలో వెలసిన నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన రెండు హుండీ చోరీల గుట్టు చేధించేదెప్పుడని ప్రజలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు.

హుండీ దొంగల గుట్టు ఛేదించేదెప్పుడో..?
నేలమల్లేశ్వర స్వామి ఆలయం

నిమ్మనపల్లె, మే 26: మండలంలోని తవళం అటవీ ప్రాంతం రుషి భూమిలో వెలసిన నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన రెండు హుండీ చోరీల గుట్టు చేధించేదెప్పుడని ప్రజలు, భక్తులు  ప్రశ్నిస్తున్నారు. మండలంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో  ఈ నెల 13వ తేదీ రాత్రి కొందరు  దొంగలు పడి 3హుండీలను దోచుకెళ్లి అందులోని రూ.3లక్షలను చోరి చేసినట్లు తెలుస్తోంది. అయితే 14వ తేదీ పోలీసులు క్లూస్‌టీం పిలిపించి అనుమానితుల నుంచి వేలి ముద్రలు సేకరించి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేకపోయారు. 6నెలల కాల వ్యవధిలో రెండు సార్లు ఈ గుడిలో హుండీ లు చోరీకి గురయ్యాయి. కాగా గతంలో జరిగిన చోరీ కారణంగా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే దొంగతనం జరిగిన రోజు సీసీ కెమెరాలు పని చేయకపోవడం, ఆలయానికి తాళాలు లేకపోవడంతో స్థానికుల పైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఈవో మునిరాజ హుండీలు దొంగలించారిని కేవలం రూ.30వేలు మాత్రమే పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలువురు దాతలు లక్షల రూపాయలను వెచ్చించి కళ్యాణ మండపంతో పాటు ఆలయం ముందర రేకుల షెడ్డును నిర్మించారు. నేలమల్లేశ్వర స్వామి తిరునాళ్ల జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు హుండీలను లెక్కించలేదు. దీన్ని బట్టి చూస్తే హుండీల్లో ఎంత డబ్బు ఉండేదో అర్థమవుతుంది. ఆలయానికి చైర్మన్‌ లేకపోవడంతో అధికార వైసీపీ నాయకులు ఒక కమిటీని ఏర్పాటు చేయగా వారే ఆలయ బాద్యతలను చూసుకుంటున్నారు. అయినప్పటికి హుండీలను ఎత్తుకెళ్లడంతో అందరి పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆలయానికి తాళాలను ఎం దుకు వేయలేదని సీసీ కెమెరాలు 15రోజులుగా పని చేయకపోవడంతో వాటిని ఎందుకు రిపేరు చేయించలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు నిర్వాహకులను ఎందుకు ప్రశించడం లేదని కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు. హుండీ చోరీల  దొంగలను పట్టుకోవడంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ఇక దేవు డే దొంగల పని చూసుకుంటాడంటూ ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2022-05-27T04:57:06+05:30 IST