బడిగంటలు మోగిన వేళ..!

ABN , First Publish Date - 2022-06-13T05:30:00+05:30 IST

బడి గదులు తెరుచుకున్నాయి.

బడిగంటలు మోగిన వేళ..!
బొంరాస్‌పేట్‌ మండలం పూర్యనాయక్‌ తండా పాఠశాల ఎదుట విద్యార్థుల సంబురాలు


  • ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం 
  • సమస్యలతోనే సర్కారు బడుల స్వాగతం 
  • పుస్తకాలు, దుస్తులు లేవు... పారిశుధ్య కార్మికులు లేరు 
  • మొదటిరోజు తెరుచుకోని మైల్వార్‌ తండా స్కూల్‌ 
  • కుల్కచర్ల బాలికల ఉన్నత పాఠశాల ‘ఏడు’లో ఒకే ఒక్కరు హాజరు 
  • మొదటిరోజు బడి గడప తొక్కింది తక్కువమందే.. 

బడి గదులు తెరుచుకున్నాయి. జూన్‌ 13వ తేదీన పాఠశాలలు తెరుచుకోవడం మూడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మొదటి రోజు పాఠశాలలు తెరుచుకున్నా హాజరు శాతం మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా 30శాతానికి మించి హాజరు కాలేదు. యథావిధిగా కొత్త విద్యా సంవత్సరం పాత సమ స్యలతోనే ప్రారంభమైంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి, జూన్‌ 13 : వేసవి సెల వులు ముగిశాయి. పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంది. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల బాలికల ఉన్నత పాఠశాల 7వ తరగతిలో 28 మంది బాలికలకు గాను ఒకే ఒక్క విద్యార్థిని హాజర య్యారు. తాండూరు మండలం మల్కాపూర్‌ ప్రాథమిక పాఠశాల వద్ద ఉపాధ్యాయులు పాఠశాల మెయిన్‌ గేట్‌ వద్ద తోరణాలు కట్టి స్వాగతం పలికారు. పూడూరు మండలం చన్‌గోముల్‌ జిల్లా పరిషత్‌ పాఠ శాలలో 169మంది విద్యార్థులకు 10మందే హాజరయ్యారు. నవాబుపేట మండలం మైతాప్‌ఖాన్‌గూడ ప్రాథ మిక పాఠశాలలో 20మందికి ఆరు గురు హాజరయ్యారు. మేడ్చల్‌ జిల్లా నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో మునిసిపాలిటీ చైర్మన్‌ తమ సిబ్బందితో శుభ్రం చేయించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో 2411 మంది విద్యార్థులకు గాను 726మంది బడికి వెళ్లారు. విద్యార్థు లందరూ మాస్క్‌లు ధరించి కొవిడ్‌ నిబంధనలను పాటించారు. కొందుర్గు మండలంలో 2740 మంది విద్యా ర్థులకు గాను 844 మంది హాజరయ్యారు. 

సమస్యల స్వాగతం

కొత్త విద్యా సంవత్సరంలో పాత సమస్యలే స్వాగతం పలికాయి. అరకొర వసతులే దర్శనమిచ్చాయి. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో ఎంపిక చేసిన బడుల్లో పనులు పూర్తి కాలేవు. పాఠశాల పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, డ్రెస్‌ పంపిణీ చేయాల్సి ఉన్నా ఎక్కడా వాటిని పంపిణీ చేయలేదు. రెండేళ్ల నుంచి పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం పాఠశాలల్లో నియమించలేదు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికులు వారి పరిధిలోని పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఉత్వర్వులు జారీ చేసింది. అయితే వారు పాఠశాల ప్రారంభ సమయంల్లోనే పాఠశాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం పీసీఎం తండాలో పాఠశాలలను ఉపాధ్యాయుడే శుభ్రం చేసుకున్నారు. పాఠశాలలు తెరుచుకున్న రోజే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించారు. 

తెరుచుకోని మైల్వార్‌తండా స్కూల్‌

పాఠశాలల ప్రారంభం రోజేమండలంలోని మైల్వార్‌తండా ప్రాథమిక పాఠశాల తెరుచుకోలేదు. మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పాఠశాల గదికి తాళం కన్పించింది. ఇక్కడి పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చిన కొందరు విద్యార్థులు తాళం కనిపించడంతో కొంతసేపు అక్కడే ఉండి వెనుదిరిగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తండాలో అక్కడక్కడా విద్యార్థులు ఆటలాడుతూ ‘ఆంధ్రజ్యోతి’కి కనిపించారు. ఈ విషయమై విద్యాధికారి సుధాకర్‌రెడ్డిని వివరాలు అడుగగా మైల్వార్‌ జడ్పీ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం విష్ణుమూర్తికి అక్కడి పాఠశాల ఉపాధ్యాయుడి విషయం తెలుసునని అన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు మెటర్నటీ సెలవులో ఉందని, వేరొక ఉపాధ్యాయుడిని పంపిస్తున్నట్లు చెప్పారు.

హాజరు శాతం ఇలా 

(జిల్లాల వారీగా)

జిల్లా           హాజరు

రంగారెడ్డి     30 

వికారాబాద్‌        25

మేడ్చల్‌     28

Updated Date - 2022-06-13T05:30:00+05:30 IST