ఎప్పుడిస్తారు..?

ABN , First Publish Date - 2022-04-08T06:17:03+05:30 IST

రేషన్‌ సరుకుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడిస్తారు..?

  1. ఏప్రిల్‌ నెల రేషన్‌ సరఫరాలో జాప్యం
  2. వారం రోజులవుతున్నా అందని సరుకులు
  3. కార్డుదారుల ఎదురుచూపులు
  4. జిల్లా విభజనతో ఇబ్బందులు

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: రేషన్‌ సరుకుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. వారం రోజులవుతున్నా ఏప్రిల్‌కు సంబంధించిన రేషన్‌ పంపిణీ ఇప్పటి వరకు అసలు ప్రారంభమే కాలేదు. దీంతో పేదలు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 55 మండలాలు ఉండగా జిల్లాల పునర్విభజన అనంతరం కర్నూలు జిల్లాకు 26 మండలాలు, నంద్యాల జిల్లాకు 29 మండలాలను కేటాయించారు. ఈ కారణంగానే ఈ సారి రేషన్‌ పంపిణీకి ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో 26 మండలాలకు సంబంధించి 7 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ షాపులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 1,232 రేషన్‌ షాపుల్లో 6,57,780 కార్డులు ఉన్నాయి. జిల్లాలో 40 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్‌ పంపిణీ ఆలస్యమైతే ఈనెల 15వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం గరీబ్‌ కళ్యాణ్‌ పథకంలో అందిస్తున్న ఉచిత బియ్యం ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి.


పండగలున్నా ఆలస్యం

 కర్నూలు జిల్లాలో 6.57 లక్షల కార్డుదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులు కూడా ఉన్నారు. వీరందరికీ రేషన్‌ అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉగాది పండగ అయిపోగా గుడ్‌ఫ్రైడే, శ్రీరామనవమి పండగలకు కూడా రేషన్‌ అందే పరిస్థితి కనిపించడం లేదు


పండగ పూట పస్తులు ఉండాల్సి వస్తోంది

శ్రీరామనవమి పండగ ఉండడంతో బియ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ఎందుకు బియ్యం ఇవ్వడం లేదని ఎండీయూ వాహనదారులను అడిగితే మొదట 4వ తేదీ నుంచి ఇస్తామని చెప్పారు. మళ్లీ వెళ్లి అడిగితే వస్తే ఇస్తామని సమాధానం చెబుతున్నారు. బియ్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఈనెలలో ఇంత వరకు రేషన్‌ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. 

- నాగజ్యోతి, పెంచికలపాడు గ్రామం


బియ్యం కూడా పంపిణీ చేయలేరా? 

 ప్రభుత్వం బియ్యం కూడా పంపిణీ చేయలేదా.. ఈ బియ్యంపైనే మ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. నేటికి 7 రోజులు అవుతుంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నాం. నాకు భార్య, నలుగురు పిల్లలు కలరు. కూలీ పోతేగాని పూటగడవదు. ఈక్రమంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం కోసం నా భార్య ఇంటి దగ్గరే ఉంటుంది. 

-హనుమంతు, కూలీ, కపటి గ్రామం, ఆదోని మండలం

Updated Date - 2022-04-08T06:17:03+05:30 IST