Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకెప్పుడు?

ప్రారంభం కాని ధాన్యం కొనుగోళ్లు

నేటికీ పూర్తి చేయని బ్యాంకు గ్యారెంటీ ప్రక్రియ

పంట వస్తున్నా మిల్లర్లు వెనుకంజ 


జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరి కోతలు ఊపందుకున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో నేడో రేపో మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాల్సి ఉండగా... ఇంకా బ్యాంకు గ్యారంటీల సంగతే తేలలేదు. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. నెల రోజులుగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఓవైపు ‘ప్రారంభించేస్తున్నాం’ అని అధికారులు చెబుతున్నా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైతుల నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్‌ కోసం మిల్లర్లకు అందిస్తుంది. వారు క్వింటా వద్ద 67 కిలోల బియ్యం తిరిగి పౌర సరఫరాల శాఖకు అందివ్వాలి. ఇలా మిల్లర్లకు ధాన్యాన్ని మిల్లింగ్‌కు ఇవ్వాలంటే బ్యాంక్‌ గ్యారెంటీ చూపాలి. లక్షలు విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అందిస్తున్నపుడు వారు బ్యాంక్‌ గ్యారంటీ రూపంలో హామీ చూపాల్సిందే. ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉంది. మిల్లర్ల నుంచి సుమారు రూ.100 కోట్ల వరకు బ్యాంక్‌ గ్యారెంటీ చూపాలి. 1:1 నిష్పత్తిలో బ్యాంక్‌ గ్యారెంటీకి అనుగుణంగా ధాన్యాన్ని అందిస్తుంటారు. ఈ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంటుంది. ఈ ఏడాది 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటిసారి మిల్లింగ్‌కు అందించే ధాన్యానికి అనుగుణంగా బ్యాంక్‌ గ్యారెంటీ చూపాలి. మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని అందించిన తరువాత మళ్లీ అదే మొత్తంలో ధాన్యం అందిస్తారు. ఇలా బ్యాంక్‌ గ్యారెంటీకి సమానంగా ధాన్యం అందిస్తుంటారు. తరువాత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెట్టింపు నిల్వలు అందిస్తుంటారు. ఇప్పటి వరకు కొద్దిమంది మిల్లుల యజమానులు మాత్రమే రూ.కోటి వరకు బ్యాంక్‌ గ్యారెంటీ చూపారు. 

షార్టెక్స్‌లోనూ వెనుకంజ

జిల్లా వ్యాప్తంగా 178 ధాన్యం మిల్లులు ఉన్నాయి. ఇందులో షార్టెక్స్‌ మిషనరీతో ఉన్నవి 46 కాగా మిగిలినవి సాధారణ మిల్లింగ్‌ యూనిట్లు. మిల్లర్లంతా షార్టెక్స్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది.  భారీ పెట్టుబడి కావటంతో కొద్ది మంది మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ ప్రక్రియ జిల్లాలో పూర్తిస్థాయిలో జరగలేదు. దీని వల్లనే పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన బియ్యం అందించేందుకు ఇతర జిల్లాలపై ఆధార పడాల్సి వస్తోంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఫోర్టిఫైడ్‌, షార్టెక్స్‌ బియ్యం వస్తున్నాయి. మన జిల్లాలోనే షార్టెక్స్‌ చేస్తే మనం పండించిన ధాన్యం ఇక్కడ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గత ఏడాది జిల్లాలోని షార్టెక్స్‌ మిల్లులు 45 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందించాయి. మిగిలిన 1.15 లక్షల మెట్రిక్‌ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాయి. 

ఎందుకింత జాప్యం?

 ధాన్యం కొనుగోలుకు సంబంధించి నెల రోజులుగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తూ ఉంది. ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువెళ్లేందుకు కొన్నిచోట్ల సిద్ధమయ్యారు. ముఖ్యంగా పార్వతీపురం డివిజన్‌లో ముందుగా వరి నాట్లు వేశారు.  అక్కడ పంట చేతికి వచ్చేసింది. రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోనే కోత, నూర్పిడి పూర్తి చేసేశారు. కొనుగోలుపై మాత్రం అధికారులు అదిగో ఇదిగో అంటూ వస్తున్నారు. ఈ ఏడాది నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మిల్లర్లు నాణ్యతా ప్రమాణాలను ఆచి తూచి పరిశీలించే పరిస్థితి ఏటా ఉంటోంది. నాణ్యత లేని ధాన్యాన్ని అంటగట్టి క్వింటా వద్ద 67కిలోల బియ్యం ఇవ్వాలంటే కష్టమని ఇటీవల అధికారుల వద్ద స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 664 రైతు భరోసా కేంద్రాలను కొనుగోలుకు కేటాయించారు. మరి ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ఏవిధంగా ముందుకు సాగుతాయో చూడాలి 

కొనుగోలుకు సిద్ధం

ధాన్యం దిగుబడులు వస్తున్నాయని, కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ డి.నాయక్‌ తెలిపారు. రైతు భరోసా కేందాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇంత వరకు మిల్లర్లు రూ.కోటి బ్యాంక్‌ గ్యారెంటీ చూపారని వెల్లడించారు. మిగిలిన మిల్లులకు బ్యాంక్‌ గ్యారెంటీలను త్వరగా చూపాలని కోరామన్నారు. 


Advertisement
Advertisement