HYD : MMTS పై చిత్తశుద్ధి లేని సర్కారు.. రెండో దశ తిరిగేదెన్నడో..!

ABN , First Publish Date - 2021-11-28T14:41:42+05:30 IST

జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలను...

HYD : MMTS పై చిత్తశుద్ధి లేని సర్కారు.. రెండో దశ తిరిగేదెన్నడో..!

  • మొత్తం వ్యయం రూ.816.66 కోట్లు.. 
  • రాష్ట్ర వాటా రూ.544.66 కోట్లు
  • ఇప్పటివరకు చెల్లించింది రూ.129.02 కోట్లే..
  • పలు మార్గాల్లో పనులు పూర్తి  
  • హైకోర్టు నోటీసులతో మరోసారి తెరపైకి రెండో దశ అంశం

జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రెండో దశ పనులు దాదాపు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడంతో రైళ్లు పట్టాలెక్కడం లేదు.


హైదరాబాద్‌ సిటీ : జంట నగరాల పరిధిలో సబర్బన్‌ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2003 ఆగస్టులో మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) ప్రాజెక్టును చేపట్టాయి. మొదటి కారిడార్‌ కింద ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌-లింగంపల్లి, రెండో కారిడార్‌ కింద లింగంపల్లి-నాంపల్లి, మూడో కారిడార్‌ కింద నాంపల్లి-సికింద్రాబాద్‌ మార్గాల్లో రూ.340కోట్లతో మొత్తం 14 కి.మీ. పనులు చేపట్టారు. 2005లో పనులు పూర్తి కావడంతో రైళ్లను ప్రారంభిచారు. మొత్తం 125 సర్వీసుల్లో రోజుకు సగటున 1.68లక్షల మంది ప్రయాణించారు. కొవిడ్‌ తర్వాత ప్రస్తుతం 56 ట్రిప్పుల్లో సుమారు 35వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.


రాష్ట్రం కేటాయించింది రూ.129.02 కోట్లే..

రూ.816.66 కోట్లతో చేపట్టిన రెండోదశ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. మొత్తం రూ.544.66 కోట్లలో ఇప్పటివరకు రూ.129 కోట్లను మాత్రమే చెల్లించింది. ఇందులో 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50 కోట్లు విడుదల చేసింది. కేంద్ర తన వాటా రూ.272 కోట్లను నాలుగేళ్ల క్రితమే పూర్తిగా చెల్లించింది.  పనులను సకాలంలో పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో కేంద్రం తన వాటాను మించి అదనంగా నిధులు విడుదల చేసింది. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం 2020 నవంబర్‌ 19 వరకు కేంద్రం రూ.678 కోట్లు చెల్లించింది. రాష్ట్రం ఇంకా రూ.415 కోట్లను చెల్లించకపోవడంతో వందశాతం పనులు పూర్తికాలేదు. కనీసం రూ.200 కోట్లు విడుదల చేసినా రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లను కొనుగోలు చేసి పనులు పూర్తయిన మార్గాల్లో నడిపించే అవకాశముందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. 2018-19 బడ్జెట్‌లో రూ.50 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత 2019-20, 2020-21 బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ ఊసెత్తకపోవడం గమనార్హం.


2012లో రెండో దశ పనులకు శ్రీకారం..

ఎంఎంటీఎస్‌ మొదటి దశ ప్రాజెక్టు విజయవంతం కావడంతో అధికారులు రెండోదశ పనులకు శ్రీకారం చుట్టారు. 2012లో రూ.816.66 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. ఇందులో 2/3 వంతున నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. కేంద్రం తన వాటా కింద రూ. 272 కోట్లు, రాష్ట్ర వాటా రూ.544.66 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫలక్‌నుమా-ఉందానగర్‌, తెల్లాపూర్‌- పటాన్‌చెరు, సికింద్రాబాద్‌-బొల్లారం-మేడ్చల్‌, సనత్‌నగర్‌- మౌలాలి, మౌలాలి-మల్కాజిగిరి-సీతాఫల్‌మండి, మౌలాలి-ఘట్‌కేసర్‌ రూట్లలో పనులు చేపట్టాలని భావించాయి. ఆయాచోట్ల డబ్లింగ్‌, విద్యుద్ధీకరణ, స్టేషన్ల నిర్మాణం పనులు పూర్తి చేసి, శివారు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సులభతరమైన రవాణాను అందించాలనుకున్నాయి. మొత్తంగా రెండో దశలో 72.95 కిలోమీటర్ల పనులు చేపట్టేందుకు అడుగులు పడ్డాయి.


62 కి.మీ. పనులు పూర్తి..

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్‌ రెండో దశకు సంబంధించి జరుగుతున్న ఆలస్యంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంఎంటీఎస్‌ ఆలస్యంపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టడం ప్రస్తుతం తెలంగాణ సర్కారు, రైల్వేశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, మొ త్తం 72.95 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటివవరకు 62 కిలోమీటర్ల పనులు పూర్తయి రైళ్లు నడిపించేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నవంబర్‌ 14న మేడ్చల్‌-సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మార్గంలో మాత్రం పలు రైళ్లు ప్రారంభించడం గమనార్హం.


ప్రజారవాణాపై నిర్లక్ష్యం 

జంట నగరాలు, శివారు ప్రాంతాలను కలిపే ప్రజారవాణా వ్యవస్థ ఎంఎంటీఎస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకుండా, రెండోదశపై కేంద్రం తగిన నిర్ణయాలు తీసుకోకుండా అలసత్వం వహిస్తుండడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోకు సాయం అందించేందుకు ఆసక్తి చూపుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఎంటీఎస్‌ను పట్టించుకుంటే లక్షలాది మందికి రైలు సౌకర్యం అందుతుంది. -శ్రీనివాస్‌, సీపీఎం నగర కార్యదర్శి.

Updated Date - 2021-11-28T14:41:42+05:30 IST