పోలమాంబ జాతరకు వేళాయే

ABN , First Publish Date - 2021-01-25T04:18:49+05:30 IST

ఉత్తరాంఽద్రుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి కరోనా ఆంక్షల నడుమ పండగ జరుగనుంది. సోమవారం తొలేళ్లకు సర్వం సిద్ధమైంది. సాధారణంగా జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా చత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

పోలమాంబ జాతరకు వేళాయే
పోలమాంబ అమ్మవారు

పూర్తయిన ఏర్పాట్లు

కరోనా ఆంక్షల నడుమ పండగ

నేడు తొలేళ్ల ఉత్సవం

మక్కువ, జనవరి 24 : ఉత్తరాంఽద్రుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి కరోనా ఆంక్షల నడుమ పండగ జరుగనుంది. సోమవారం తొలేళ్లకు సర్వం సిద్ధమైంది. సాధారణంగా జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా చత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు అధికారులు ఆంక్షలు విధించడం వల్ల భక్తుల రాక ఈసారి తగ్గనుంది. బస్సులు, ఆటోలు నిషేధించటంతో శంబర జాతరకు రావటానికి ద్విచక్ర వాహనాలే ఆధారం. చదురుగుడి, వనంగుడి ఆవరణల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకొనేలా క్యూలైన్లు ఏర్పాటు చేసి చలువ పందిళ్లపై పంకాలను అమర్చారు. భక్తుల రాకతో శంబర గ్రామం కళకళలాడుతోంది. మరోవైపు భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని విక్రయించేందుకు 20 వేల లడ్డూలను తయారు చేశారు. పులిహోర ప్రసాదం సోమవారం నుంచి విక్రయించనున్నారు. అమ్మవారి జాతరలో సిరిమానోత్సవాన్ని నిలిపి ఉంచేందుకు శాశ్వత నాటుబండిని సప్తవర్ణాలతో దేవదాయశాఖ అధికారులు తీర్చిదిద్దారు. తొలేళ్ల ఉత్సవంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమ్మవారి ఘటాలను అన్ని వీధుల్లో ఊరేగిస్తారు. 

జాతరకు పటిష్ట బందోబస్తు

పోలమాంబ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్వతీపురం ఓఎస్‌డీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఆరుగురు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 38 మంది ఎస్‌ఐలు, 78 మంది ఏఎస్‌ఐలతో కలిపి 530 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శంబర గ్రామానికి చేరుకునే ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జాతరలో డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. అమ్మవారిని పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం చదురుగుడిలో ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. క్యూలైన్లలో ఉచిత, రూ.10లు, రూ.50లు టిక్కెట్లను కేటాయించారు. చదురుగుడి, వనంగుడిని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ వీలైనంత త్వరగా అమ్మవారిని దర్శించుకునేలా సిబ్బంది చర్యలు చేపట్టారు.

కొవిడ్‌ నిబందనలతో ఏర్పాట్లు

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూడళ్లలో కొవిడ్‌ నిబంధనలు తెలిపే విధంగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. మాస్కుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. 


Updated Date - 2021-01-25T04:18:49+05:30 IST