రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటెప్పుడు?

ABN , First Publish Date - 2021-06-17T05:32:58+05:30 IST

మరింతగా సేవలు అందించడానికి మరిన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ప్రతిపా దించింది.

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటెప్పుడు?
ఆత్మకూరు పట్టణం ఏరియల్‌ వ్యూ

  1. నాలుగేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం  
  2. పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు 
  3. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ కోసం ఎదురుచూపు


ఆత్మకూరు, జూన్‌ 16: మరింతగా సేవలు అందించడానికి మరిన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ప్రతిపా దించింది. ఇందులో భాగంగా జిల్లాలో అదనంగా రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఇప్పటికే ఉన్న కర్నూలు, నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్లతోపాటు అదనంగా ఆత్మకూరు, పత్తికొండ రెవెన్యూ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. తొలుత డోన్‌, ఆత్మకూరు కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత డోన్‌ ప్రతిపాదనను రద్దు చేస్తూ.. పత్తికొండ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావించారు. ఆత్మకూరు, నందికొట్కూరు సబ్‌ డివిజన్లను కలిపి ఆత్మకూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎన్నో ఏళ్ల  నుంచే ఉంది. అదే జరిగితే  రెవెన్యూ సేవలు అందుబాటు లోకి వస్తాయని స్థానికులు భావించారు.  


కాగితాలకే పరిమితం: శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, శ్రీశైలం మండలాలతో పాటు నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు, మిడ్తూరు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, పగిడ్యాల మండలాలను కలిపి ఆత్మకూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ  ప్రకటన వచ్చి సుమారు నాలుగేళ్లు దాటినా ఇంతవరకు పురోగతి లేనట్లు తెలుస్తోంది.  రెవెన్యూ డివిజన్‌ ఏర్పడితే  ఆపద్బంధు పథకం, దీర్ఘకాలిక జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూ సమస్యల పరిష్కారం, భూసేకరణ, కుటుంబ ప్రయోజన పథకం, ఇళ్లస్థలాల పంపిణీ తదితర సేవలు పొందడానికి స్థానికులకు అవకాశం కలుగుతుంది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో శ్రీశైలం, వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, జూపాడుబంగ్లా, మిడ్తూరు, నందికొట్కూరు, పగిడ్యాల మండలాలతో పాటు నంద్యాల డివిజన్‌ పరిధిలో వున్న గడివేముల మండలాన్ని కర్నూలు రెవెన్యూ డివిజన్‌కు బదులు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో కలపాలని నిర్ణయించుకుని మహానంది, బండిఆత్మకూరులను నంద్యాల డివిజన్‌లోకి చేర్చడం వల్ల ఆయా మండలాలకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేరువయ్యే అవకాశం ఉంది.  




Updated Date - 2021-06-17T05:32:58+05:30 IST