జిల్లా సమీక్షా సమావేశం ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-05-18T05:23:49+05:30 IST

జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఇతర అంశాల గురించి సమీక్షించేందుకు ప్రతీ మూడు, ఆరు మాసాలకోసారైనా నిర్వహించాల్సిన జిల్లా సమీక్షా సమావేశాలకు దిక్కు లేకుండా పోయింది.

జిల్లా సమీక్షా సమావేశం ఎప్పుడో?
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల (ఫైల్‌)

- ఏడాది గడుస్తున్నా నిర్వహించని వైనం

- పలు సమస్యలతో ప్రజలు సతమతం

- పూర్తి కానీ అభివృద్ధి పనులు

- పట్టించుకోని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, అధికారులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఇతర అంశాల గురించి సమీక్షించేందుకు ప్రతీ మూడు, ఆరు మాసాలకోసారైనా నిర్వహించాల్సిన జిల్లా సమీక్షా సమావేశాలకు దిక్కు లేకుండా పోయింది. చివరగా సమీక్షా సమావేశం నిర్వహించి ఏడాది గడుస్తున్నా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, అధికారులు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారాయి. ఎడెనిమిదేళ్లుగా జిల్లాలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాల పునర్విభజన జరగక ముందు పాత జిల్లా కేంద్రాల్లో జిల్లా సమీక్షా సమావేశాలను ప్రతీ మూడు మాసాలకోసారి గానీ, ఆరు మాసాలకోసారి నిర్వహించే వారు. ఈ సమావేశంలో అన్ని శాఖల తీరు తెన్నుల గురించి చర్చించే వారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు గురించి కూలంకశంగా చర్చించేవారు. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత జిల్లా సమీక్షా సమావేశాలు నిర్ణీత వ్యవధిలో నిర్వహించ లేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, అధికారులకు గుర్తుకు వచ్చినప్పుడే నామమాత్రంగా సమావేశాలు నిర్వహించారు. 

- చివరగా గత ఏడాది ఏప్రిల్‌ 10న..

జిల్లాలో చివరగా గత ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త పెరగడంతో మధ్యలో సమావేశాలు నిర్వహించ లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం వరకు కరోనా వేవ్‌ కొనసాగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కరోనా తగ్గుముఖం పట్టింది. అన్ని పనులు, కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయినా కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. జిల్లాలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, కలెక్టరేట్‌ నిర్మాణం, మెడికల్‌ కళాశాల నిర్మాణం, గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు, ఎంపీ, ఎమ్మెల్యేల కోటా నిధులు, జడ్పీ, మండల పరిషత్‌ నిధులు, డీఎంఎఫ్‌టీ నిధులు, తదితర అంశాల గురించి సమీక్షించాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఏం చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకునిపోయి నిధులు మంజూరు చేయించడం ఎలా, తదితర సమస్యల గురించి ప్రస్తావించేందుకు జిల్లా సమీక్షా సమావేశాలు ఒక వేదికలా ఉంటాయి. వివిధ శాఖల అధికారుల పని తీరు కూడా బయట పడుతుంది. సమావేశానికి జిల్లా అధికారులే కాకుండా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారు. వారు కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుంది. అధికారులు కూడా వారు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల గురించి సమావేశంలో వెల్లడించే అవకాశాలుంటాయి. వాటన్నింటిపై చర్చించి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమీక్షా సమావేశాలు ఉపయోగపడతాయి. 

- పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలు..

ప్రధానంగా జిల్లాలో పలు సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2017లో చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం మధ్యలోనే నిలిచి పోవడం వల్ల రామగుండం ప్రాంతంలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తామన్న లిఫ్ట్‌కు దిక్కులేదు. గోదావరి అవతలి ఒడ్డున గల చెన్నూరు ప్రాంతానికి గత నెలలో లిఫ్ట్‌ను మంజూరు చేశారు. మానేరుపై ఇసుక క్వారీలను రద్దు చేయాలని, వాటి వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఆయకట్టు చివరి భూములకు సాగునీటిని అందించేందుకు చేపట్టిన లింకు కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కుందనపల్లి వాసులు నిరాహార దీక్ష చేస్తున్నా వారి సమస్య పరిష్కారం కావడం లేదు. ఏడేళ్లు గడుస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి కూడా డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చిన సందర్భం లేదు. మంథనిలో పూర్తయినా కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం సమావేశాల ద్వారానే సాధ్యం అవుతుందని తెలిసి కూడా జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమావేశాన్ని నిర్వహించి జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-18T05:23:49+05:30 IST