పరిహారం ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2021-07-28T06:37:36+05:30 IST

నెల్లూరు, చిత్తూరు జిల్లాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి గత ప్రభుత్వం సోమశిల-స్వర్ణముఖి లింకు కాలువ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ కాలువ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆరేళ్లవుతున్నా పరిహారం అందలేదు. దీంతో న్యాయం చేయాలంటూ నిత్యం బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పరిహారం ఇంకెప్పుడు?
ఏర్పేడు మండలం నాగంపల్లె వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ కెనాల్‌ లింక్‌ కాలువ

ఎస్‌ఎస్‌ కెనాల్‌కు భూములిచ్చి ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న రైతులు 


ఏర్పేడు, జూలై 27: నెల్లూరు, చిత్తూరు జిల్లాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి గత ప్రభుత్వం సోమశిల-స్వర్ణముఖి లింకు కాలువ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ కాలువ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆరేళ్లవుతున్నా పరిహారం అందలేదు. దీంతో న్యాయం చేయాలంటూ నిత్యం బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

నెల్లూరు జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు వద్ద సోమశిల-స్వర్ణముఖి(ఎ్‌సఎస్‌) లింకు కెనాల్‌ ప్రధాన రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొదలయ్యే ఎస్‌ఎ్‌సకెనాల్‌ శ్రీకాళహస్తి మండలం మీదుగా ఏర్పేడు మండలంలోకి ప్రవేశిస్తుంది. ఈ మండలంలో పల్లంపేట వద్ద మొదలై మేర్లపాక చెరువు వరకు కాలువ కొనసాగుతుంది. నీటి నిల్వకు సంబంధించి మండలంలోని పంగూరు, మేర్లపాక చెరువులను మినీ ట్యాంకులుగా మార్చాలని నిర్ణయించారు. కాగా, ఎస్‌ఎస్‌ కెనాల్‌ కాలువ పనులకుగాను 2015లో ఏర్పేడు మండలం కృష్ణంపల్లె రెవెన్యూ పరిధిలో 38మంది రైతుల నుంచి 31.04 ఎకరాలను, పంగూరు రెవెన్యూ పరిధిలో 36మంది రైతుల నుంచి 23.73 ఎకరాల సాగు భూములను సేకరించారు. ఇందుకుగాను బాధితులకు ఎకరాకు రూ.33 లక్షల వంతున నష్ట పరిహారం చెల్లిస్తామని అప్పట్లో అధికారులు హామీఇచ్చారు. 


ఆరేళ్లుగా తిరుగుతున్నాం.. 


ఎస్‌ఎస్‌ కాలువ పనుల కోసం రెండెకాల పొలాన్ని ఇచ్చా. అప్పటి నుంచి పరిహారం కోసం నెల్లూరు, చిత్తూరు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మా గోడు ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మాలాంటి పేద రైతుల సమస్యను ప్రభుత్వం గుర్తించాలి. తొందరగా పరిహారం మంజూరు చేయాల్సి ఉంది. 

- మునిశేఖర్‌, కృష్ణంపల్లె రైతు 


బాధితుల గోడు వినే వారేరీ? 


రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఆరేళ్ల కిందట పల్లంపేట నుంచి మేర్లపాక వరకు మొత్తం 12 కి.మీ. మేర ఎస్‌ఎస్‌ కాలువ పనులు చేపట్టారు. ఆ మేరకు 70 శాతం పనులనూ పూర్తి చేశారు. మిగిలిన పనులకు ఏర్పేడు-వెంకటగిరి హైవే నిర్మాణ పనులు అడ్డంకిగా మారాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో, రాజుపాళ్యం నుంచి నాగంపల్లె వరకు జరగాల్సిన కాలువ పనులకు బ్రేక్‌పడింది. ఇక పంగూరు మినీ ట్యాంక్‌ నిర్మాణం పూర్తవగా, మేర్లపాక ట్యాంక్‌ పనులు 50శాతం చేయాల్సి ఉంది. మొత్తం మీద ఈ పనులు దాదాపు పూర్తి కావస్తున్నా ఎస్‌ఎస్‌ కెనాల్‌కు భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. దీంతో న్యాయం చేయాలంటూ బాధిత రైతులు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సోమశిల-స్వర్ణముఖి కార్యాలయం, చిత్తూరు కలెక్టరేట్‌కు ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. భూములు పోగొట్టుకుని, పరిహారం అందక పస్తులతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పరిహారం ఇవ్వకుంటే ఎస్‌ఎస్‌ కెనాల్‌ వద్దే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 


కూలి పనులు చేస్తున్నాం.. .


ఎస్‌ఎస్‌ కెనాల్‌ కాలువ పనులకు భూములిచ్చి ఆరేళ్లవుతోంది. పరిహారం కోసం కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పనులు మొదలు పెట్టిన నెలరోజులకే డబ్బులిస్తామన్న అధికారులు మాయమయ్యారు. భూములు పోగొట్టుకుని కూలి పనులతో జీవనం సాగిస్తున్నాం. 

- రామచంద్రారెడ్డి, నాగంపల్లె రైతు 

Updated Date - 2021-07-28T06:37:36+05:30 IST