నష్ట పరిహారం అందేదెప్పుడో?

ABN , First Publish Date - 2021-04-14T05:13:19+05:30 IST

తారకరామ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ అమలు ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వాయర్‌ ముంపు గ్రామాల్లోని రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా, చట్టబద్ధంగా వారికి అందాల్సిన ప్యాకేజీ, ఇతర సంక్షేమ పథకాల అమలు కావడం లేదు.

నష్ట పరిహారం అందేదెప్పుడో?
తారక రామ రిజర్వాయర్‌

తారక రామ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల ప్రజల ఎదురుచూపు 

ప్యాకేజీ అమలు ప్రశ్నార్థకం 

తేలని నిర్వాసిత స్థల సమస్య

ఏటీ అగ్రహారంలో కదలని పనులు

(నెల్లిమర్ల)

తారకరామ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ అమలు ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వాయర్‌ ముంపు గ్రామాల్లోని రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా, చట్టబద్ధంగా వారికి అందాల్సిన ప్యాకేజీ, ఇతర సంక్షేమ పథకాల అమలు కావడం లేదు. తారకరామ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే ముంపు గ్రామంగా ప్రకటించిన ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి సంబంధించి భూములు తీసుకుని వారికి సొమ్ము చెల్లించింది. అయితే గ్రామంలోని ఇళ్లకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సెటిల్‌మెంటుకు ముందుకు రాలేదు. ప్రధానంగా గ్రామాన్ని ఖాళీ చేసే ముందు ఇలాంటి ముంపు గ్రామాల వారికి వేరే చోట నిర్వాసిత గ్రామాన్ని నిర్మించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. రిజర్వాయర్‌ ముంపు గ్రామాల్లో ఒకటైన కోరాడపేటకు ఇప్పటికే నెల్లిమర్ల శివారుల్లో స్థలాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం ఏటీ అగ్రహారం గ్రామస్థులకు గత ఎనిమిదేళ్లుగా స్థలాన్ని కూడా ఎంపిక చేయలేకపోయింది. గత ప్రభుత్వంలో  మొదలైనా ఆ ప్రయత్నాలకు ఇంతవరకు ఫుల్‌స్టాప్‌ పడలేదు. ఇప్పటికే ఏటీ అగ్రహారం గ్రామస్థుల కోసం ఆ గ్రామ పెద్దలతో కలిసి జిల్లాలోని రెవెన్యూ, భూసేకరణ అధికారులు ఐదు చోట్ల ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఇందులో ఏ ఒక్క దానిపైనా గ్రామపెద్దలకు, అఽదికారులకు ఏకాభిప్రాయం కుదరలేదు. ఏటీ అగ్రహారం నిర్వాసిత గ్రామ నిర్మాణం కోసం నెల్లిమర్లలోని పూడమ్మవనం సమీపంలో సర్వే నెం.316లో ఉన్న భూమిని, కొండవెలగాడ పరిధిలో ఉన్న భూమిని, సారిపల్లి పారిశ్రామిక వాడలోని స్థలాన్ని, జమ్ము నారాయణపురం డంపింగ్‌యార్డు సమీపంలోని భూమిని గతంలో పరిశీలించారు. ఈ మేరకు గ్రామ పెద్దలు సూచించిన స్థలాలను అధికారులు ఆమోదించలేదు. అధికారులు ఆమోదించిన స్థలాలను పెద్దలు అంగీకరించలేదు. దీంతో స్థల ఎంపిక సమస్య అసలు సమస్యగా మిగిలిపోయింది. ఏటీ అగ్రహారం గ్రామానికి సమీపంలోని పూసపాటిరేగ మండల పరిధిలోని కుమిలి గ్రామ పరిధిలో ఉన్న కొండ ప్రాంతాన్ని గ్రామస్థులు ఇష్టపడినప్పటికీ ఆ స్థలాన్ని అధికారికంగా కేటాయింపు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో పాలకులకే ఎరుక.

పట్టించుకోని భూసేకరణ అధికారులు

ఏటి అగ్రహారం గ్రామంలో 300 ఎకరాల భూమిని రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి పల్లం ఎకరాకు రూ.1.70 లక్షలుగా, మెట్టు ఎకరా రూ.1.60 లక్షలుగా నిర్ణయించి ఆ మేరకు సొమ్ము చెల్లించింది. ఇంకా గ్రామాన్ని ఖాళీ చేయాలంటే గ్రామంలోని ఇళ్లు, చెట్లను కూడా గ్రామస్థులు వదిలి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు సర్వే పూర్తి చేసి కనీసం మూడు సంవత్సరాలయ్యింది. కానీ గ్రామంలో ఉన్న సుమారు 400 ఇళ్లకు సంబంధించి సెటిల్‌మెంటు చేసేందుకు భూసేకరణ అధికారులు ముందుకు రాలేదు. అధికారుల ఉదాసీనత వల్లా లేదంటే నిధుల లేమి వల్లా ఇలా కాలయాపన జరుగుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది. తమకు ఇష్టమైన స్థలంలో నిర్వాసిత గ్రామం నిర్మిస్తేనే తాము గ్రామాన్ని ఖాళీ చేస్తామని లేదంటే ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వారు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలా ముందడుగు వేస్తారో చూడాలి మరి. 

Updated Date - 2021-04-14T05:13:19+05:30 IST