‘ఎల్‌ఆర్‌ఎస్‌’కు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2022-05-13T05:02:29+05:30 IST

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కారానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.

‘ఎల్‌ఆర్‌ఎస్‌’కు మోక్షమెప్పుడో?

జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో 54వేల దరఖాస్తులు 

ప్రభుత్వ మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపులు

పరిష్కారానికి అడ్డంకిగా కోర్టు కేసులు 


గజ్వేల్‌, మే 12: లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కారానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. 2020 సెప్టెంబరు, అక్టోబరులో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్విడంతో పాటు ఇదే చివరి అవకాశం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేయడంతో సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 54వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తు ప్రకియ పూర్తయి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ ఒక్క అడుగు ముం దుకు పడలేదు. గతేడాది అక్టోబరులో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావించి ఆయా మున్సిపాలిటీల్లో క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో మరోసారి కోర్టు కేసు పడడంతో మోక్షం లభించడం లేదు. ఫలితంగా సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఫ్లాట్లను అమ్ముకోలేక, అలాగే ఉంచుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2020 జూన్‌ను కటా్‌ఫగా పెట్టిన ప్రభుత్వం అటు తర్వాత ఏర్పాటైన అక్రమ వెంచర్లలో కొత్త ప్లాట్ల రిజిస్ర్టేషన్లను నిలిపివేసింది. కేవలం హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అప్రూవల్‌తో పాటు గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తయిన ప్లాట్లను మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేస్తున్నది. 

ఐదు మున్సిపాలిటీల్లో దరఖాస్తులు

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 54వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేటలో 32వేల దరఖాస్తులు, దుబ్బాకలో 2,900, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో 9 వేలు, చేర్యాలలో 6,750, హుస్నాబాద్‌ పరిధిలో 3వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను వార్డుల వారీగా విభజించిన అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది క్లసర్లను ఏర్పాటు చేశారు. క్లస్టర్లు ఓ కొలిక్కి వచ్చి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని దరఖాస్తుదారులు అధికారులు భావించారు. అయితే కోర్టులో కేసుల మూలంగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మరోసారి పెండింగ్‌లో పడింది. ఎవరైనా ఇళ్లను నిర్మించుకుంటే మాత్రం ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించిన రుసుమును ఇంటి అనుమతితో పాటే వసూలు చేస్తున్నారు. 

 ఇబ్బందుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు

సిద్దిపేట, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలైన గజ్వేల్‌, హుస్నాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారులు విచ్చలవిడిగా 2016నుంచి 2020 వరకు వెంచర్లను ఏర్పాటు చేశారు. కనీస నిబంధనలు పాటించకుండా లాభార్జనే ధ్యేయంగా అనుమతి లేని వెంచర్లను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించకుండానే విక్రయాలు చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆ ఫ్లాట్లను కోనుగోలు చేసి, ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నారు. స్థిరాస్థి వ్యాపారులు వెంచర్లు, లేఅవుట్‌లు ఏర్పాటు చేసి రూ.లక్షలు గడిస్తే సాధారణ, మధ్యతరగతి ప్రజలు క్రమబద్ధీకరణకు రూ.లక్షల్లో రుసుమును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తయితే తమ ఫ్లాట్లను అవసరాలకు వినియోగించుకుందామనుకునే వారికి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ శాపంగా మారింది. 

 కోర్టు స్టేతో  పరిశీలన ప్రక్రియను ఆపేశాం 

 - దీపిక, టీపీవో, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 2020 సెప్టెంబరు, అక్టోబరులో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు స్వీకరించగా, 9 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. 2015లో తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి ఏమైనా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే క్లియర్‌ చేస్తున్నాం. 2020లో స్వీకరించిన దరఖాస్తుల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే దరఖాస్తులను పరిశీలిస్తాం. 

Read more