మార్పులు, చేర్పులకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2022-01-24T06:12:03+05:30 IST

ఆహార భధ్రత కార్డులు పొందడానికి, మార్పులు, చేర్పుల కోసం లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు మూడేళ్లుగా 10 వేల మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని నిరీక్షించగా గతేడాది జూలైలో మోక్షం లభించింది. వీరిలో జిల్లాలో 2777 మందికి ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు.

మార్పులు, చేర్పులకు మోక్షమెప్పుడో?

- కొత్త రేషన్‌ కార్డులతోనే సరిపెట్టిన ప్రభుత్వం

- పేరు మార్పిడి అదనపు చేర్పుల కోసం 16,314 మంది నిరీక్షణ 

- ప్రభుత్వ పథకాల దరఖాస్తులకు ఇబ్బందులు 

- జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు

- 5,08,173 మంది లబ్ధిదారులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆహార భధ్రత కార్డులు పొందడానికి, మార్పులు,  చేర్పుల కోసం లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు మూడేళ్లుగా 10 వేల మంది కొత్త కార్డుల కోసం  దరఖాస్తు చేసుకొని నిరీక్షించగా గతేడాది జూలైలో మోక్షం లభించింది. వీరిలో జిల్లాలో 2777 మందికి ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఇంకా అనేక మంది అర్హులు మీసేవలో దరఖాస్తు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు మూడేళ్లకు పైగా రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయాలని 16,314 మంది దరఖాస్తు చేసుకోగా అందులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వద్ద 5042 దరఖాస్తులు,  తహసీల్దార్‌ వద్ద 1396 దరఖాస్తులు, డీఎస్‌వో వద్ద 9876 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రేషన్‌ కార్డులు జత చేయాల్సి వస్తుంది.  పేర్లు తప్పుగా ఉండడం, పేర్లు లేకపోవడం, దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం వంటివాటితో  పథకాలకు నోచుకోవడం లేదు. చేర్పులు మార్పులు చేయాలని లబ్ధిదారులు తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. 

జిల్లాలో 5,08,173 మందికి లబ్ధి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు ఉండగా 1,75,498 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 5,08,173 మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ బియ్యం లబ్ధి చేకూరుస్తోంది. జిల్లాలో ఆహార భద్రత కార్డులు 1,61,570 ఉండగా 4,72,256 మంది లబ్ధిదారులు, అంత్యోదయ కార్డులు 13,694 ఉండగా 35,680 మంది లబ్ధిదారులు, అన్నపూర్ణ కార్డులు 234 ఉండగా 237 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో బియ్యాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కానీ రేషన్‌ కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు లేకపోవడంతో అనేక మంది బియ్యాన్ని కోల్పోతున్నారు. 


Updated Date - 2022-01-24T06:12:03+05:30 IST