Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 23 Jan 2022 00:06:00 IST

మెట్రో నియో రైలు కూత ఎన్నడో!?

twitter-iconwatsapp-iconfb-icon
మెట్రో నియో రైలు కూత ఎన్నడో!?

ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టు రిపోర్టు
త్రినగరిని కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌
నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ
తాజా కదలికలతో చిగురిస్తున్న ఆశలు
అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు
ప్రాజెక్టు సాకారమైతే ఓరుగల్లుకు మరో మణిహారం


వరంగల్‌ నగరం రోజు రోజుకూ విస్తరిస్తోంది. అయితే ప్రజల అవసరాలకు తగినట్లు నగర రవాణా వ్యవస్థ విస్తరించలేదు. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలతో కూడిన ట్రైసిటీలో ప్రజల రాకపోకలకు అవసరమైన ఆర్టీసీ బస్సులు కూడా ప్రస్తుతం సరిపోవడం లేదు. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, లేదా సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఆటోలు, దిచక్రవాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. నగరం విస్తరించినా ఆ మేరకు రోడ్ల విస్తరణ జరగకపోవడం, చాలా చోట్ల రోడ్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్‌ రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. దీనిని నివారించడానికే వరంగల్‌లో మెట్రో నియో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.

హనుమకొండ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):
మెట్రో నియో రైలు ప్రాజెక్టు అమలైతే ద్వితీయ శ్రేణి నగరమైన వరంగల్‌ ప్రజా రవాణాలో ఒక మైలురాయిగా నిలుస్తుం ది. వరంగల్‌ నగర రూపురేఖలు మారుతాయి. నగర ప్రజల ట్రాఫిక్‌ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమం అవుతుంది. వరంగల్‌నుంచి కరీంనగర్‌, ఖమ్మం, నర్సంపేట శివార్ల వైపు వెళ్లాలంటే ప్రస్తుతం బస్సులు, ఆటోలే శరణ్యం. మామునూరు వైపు వెళ్లాంటే సామాన్యులకు తగినన్ని బస్సులు అందుబాటులో లేవు. ఆటోలను ఆశ్రయిస్తే జేబు గుల్లే. నగర శివార్లలో కొత్తగా పలుకాలనీలు వెలుస్తున్నాయి. అక్కడి నుంచి రావాలంటే సొంతవాహనాలు కలిగినవారికైతే ఇబ్బంది లేదు. లేనివారికి కష్టాలు తప్పడం లేదు.

డీపీఆర్‌ సిద్ధం

రెండేళ్లుగా మెట్రో నియో రైలు ప్రాజెక్టు అమలుకు కసరత్తు జరుగుతోంది. కిందటేడు ఈ ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిగింది. మహరాష్ట్రలోని నాసిక్‌ నియో రైలు ప్రాజెక్టు తరహాలో మహామెట్రో సంస్థ డీపీఆర్‌ను రూపొందించింది. నిధుల మంజూరుకు కిందటేడు దీనిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. కాజీపేట నుంచి వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వరకు భూ, ఆకాశ మార్గంలో ఈ మెట్రో నియో రైలు ప్రయాణించనున్నది. అందుకు తగ్గట్టుగా 15 కి.మీ., 21 స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. తొలి విడతగా అయిదు కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి వాటి సంఖ్యను పెంచుతారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి పెట్రోల్‌పంపు, హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్‌, పోచమ్మమైదాన్‌, కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్‌ మీదుగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు, అక్కడి నుంచి వరంగల్‌ చౌరస్తా, జేపీఎన్‌ రోడ్డు మీదుగా పోచమ్మమైదానం వరకు ప్రధాన మార్గంగా మెట్రో నియో నడుస్తుంది. ఒక్కో కోచ్‌ 25 మీటర్లు ఉంటుంది. 200 నుంచి 250 మంది ప్రయాణించవచ్చు.

తొలి విడత 15 కి.మీ.
మెట్రో నియో రైల్‌ ఏర్పాటుకు అర్బన్‌ మాస్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీ లిమిటెడ్‌, మహామెట్రో నాగపూర్‌, హైదరాబాద్‌, పూణే టెక్నికల్‌ కమిటీలు రూపొందించిన డీపీఆర్‌పై అప్పటి వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలకవర్గం, అప్పటి జీడబ్ల్యుఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి లోతుగా చర్చించారు. సాంకేతిక కమిటీలు వివిధ శాఖల నుంచి సూచనలు, సలహాలను తీసుకొని కొ న్నిమార్పులు చేర్పులతో తుది డీపీఆర్‌ ఖరారు చేశా రు. మొదట 15 కి.మీ. మెట్రో మార్గాన్ని హైదరాబాద్‌ తరహాలో ఆకాశమార్గంలో నిర్మించాలని అనుకున్నప్పటికీ నగరంలో ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితి, రవాణా వ్యవస్థ, నగర విస్తృతిని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మార్పులతో డీపీఆర్‌ను తయారు చేశారు.  దీని ప్రకారం మొత్తం 15 కి.మీ. మెట్రోమార్గంలో 8 కి.మీ. ఆకాశమార్గం, 7 కి.మీ. రోడ్డుమార్గంగా నిర్మిస్తారు. కొత్త విధానంలో నిర్మాణ వ్యయంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గనున్నట్టు తెలుస్తోంది. కొత్త డీపీఆర్‌ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రాష్ట్ర ప్రభుత్వానికి కిందటేడు మార్చిలో సమర్పించింది.

రూ.వెయ్యికోట్లతో..
వరంగల్‌ మెట్రో నియో ప్రాజెక్టుకు సుమారు రూ.1000 కోట్లు ఖర్చుకాగలదని అంచనా వేశారు. సాధారణ విధానంలో అయితే కి.మీ నిర్మాణానికి రూ.180 కోట్లు ఖర్చవుతుండగా, తాజా డీపీఆర్‌ ప్ర కారం కి.మీ.కు రూ.60కోట్లు వ్యయమవుతుంది. ప్ర స్తుతం నగర జనాభా 10లక్షలు. 2041 నాటికి జనాభా  20 లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు.

భవిష్యత్‌ విస్తరణ

మెట్రో నియో సాంకేతికతలో ఎలక్ట్రికల్‌ బస్సులను ఉపయోగిస్తారు. రబ్బర్‌ టైర్లపై నడవడం దీని ప్రత్యేకత. ఆటోమేటిక్‌ టికెట్‌ విధానంతో నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణ విధానంలో అయితే మె ట్రో నిర్వహణకు కి.మీ.కు 35 మంది సిబ్బంది అవస రం. మెట్రో నియోకు 15 మంది సరిపోతారు. మొద టి దశలో కాజీపేట నుంచి వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వర కు, రెండో దశలో మడికొండ నుంచి ఖమ్మం హైవే మామునూరు వరకు, హనుమకొండ ఎన్‌టీఆర్‌ జంక్షన్‌ నుంచి కరీంనగర్‌ వైపు, నర్సంపేట మార్గంలో ధర్మారం వరకు విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే వరంగల్‌ రూపురేఖలు మారిపోతాయి.

కేంద్రానికి కేటీఆర్‌ లేఖ

వరంగల్‌లో మెట్రో నియో ప్రాజెక్టు పూర్తికి నిధులివ్వాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత కేంద్రమంత్రిత్వ శాఖకు ఇదివరకే సర్పించినట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ప్రధానంగా కోరడంతో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ ప్రాజెక్టు అమలుకు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమైంది.  ప్రాజెక్టు వ్యయంలో 20శాతం (రూ.84) కోట్ల నిధులు మంజూరు చేయాలని కేటీఆర్‌ కోరారు. మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తుందా? కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నగర ప్రజలు అదృష్టవంతులే. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పాలసీకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో నియోకోచ్‌ల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా ఎలక్ర్టిక్‌తో నడిచే ఈ కోచ్‌లకు భవిష్యత్తులో ఎంతో డిమాండ్‌ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును వరంగల్‌లో ముఖ్యంగా కాజీపేట శివార్లలో నెలకొల్పే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.