జనవికాస్‌మెప్పుడు?

ABN , First Publish Date - 2022-05-05T05:53:54+05:30 IST

ముస్లిం మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతికి 2018లో ప్రధానమంత్రి జన వికాస్‌ కార్యక్రమ్‌ ద్వారా కేంద్రం భవన నిర్మాణానికి పూనుకుంది.

జనవికాస్‌మెప్పుడు?

  1.   ముస్లిం మైనార్టీ సముదాయాల భవనాలకు కలగని మోక్షం
  2.  పీఎంజేవీకే కింద 10 భవనాలు మంజూరు 
  3.   నంద్యాలకు 6, వెలుగోడుకు 4 కేటాయింపు 
  4.   మొదటి విడతలో రూ.7.93 కోట్లు విడుదల 
  5.   స్థల సేకరణలో జాప్యంపై మండిపడుతున్న ముస్లిం సంఘాలు 


నంద్యాల (నూనెపల్లె),: ముస్లిం మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతికి  2018లో  ప్రధానమంత్రి జన వికాస్‌ కార్యక్రమ్‌ ద్వారా కేంద్రం భవన నిర్మాణానికి పూనుకుంది. ఈ లక్ష్యం ఆచరణలో నెరవేరలేదు. మొదటి విడత నిధులు కేటాయించినా స్థల సేకరణ జాప్యంతో ఈ పథకం నీరుగారిపోతోంది. ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడం వల్ల ఈ భవనాలకు మోక్షం కలగడం లేదు.

పీఎంజేవీకే కింద 10 భవనాలు 

ముస్లిం మైనార్టీలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలలో ఆ వర్గాల విద్యార్థుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం  ప్రధానమంత్రి జన వికాస్‌ కార్యక్రమ్‌ను తీసుకువచ్చింది. నంద్యాల నియోజకవర్గంలో అధికంగా ముస్లిం మైనార్టీలు ఉండడంతో కింద 2020లో ఆరు భవన సముదాయాలు... వెలుగోడుకు నాలుగు భవనాలు మంజూరయ్యాయి. నంద్యాలలో పదో తరగతి లోపు బాలురు, బాలికలకు వందసీట్ల చొప్పున విడివిడిగా హాస్టల్‌ భవనం మంజూరు చేశారు. ఇంటర్‌ నుంచి పీజీ వరకు యువతీ, యువకులకు విడివిడిగా వందసీట్ల చొప్పున హాస్టల్‌ భవనం, ప్రభుత్వ బాలికల ఉర్దూ జూనియర్‌ కళాశాలతో పాటు హాస్టల్‌ వసతి భవనం, సద్భావన భవనలు మంజూరయ్యాయి. వెలుగోడుకు ఒక సద్భావన భవనం, ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ బాలబాలికలకు వంద పడకలతో కూడిన హాస్టల్‌ భవనాలు, ఉర్దూ జూనియర్‌ కళాశాల హాస్టల్‌ మంజూరయ్యాయి. 

మొదటి విడతలో రూ.7.93 కోట్లు  

పీఎంజేవీకే కింద మంజూరైన ఒక్కో భవనానికి కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం ఖర్చు భరించాలి. నంద్యాలకు కేటాయించిన 6 భవన సముదాయాలకు దాదాపు రూ.12 కోట్లు వెచ్చించాల్సి ఉంది. వెలుగోడుకు కేటాయించిన 4 భవన సముదాయాలకు రూ.7.61 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి విడతలో నంద్యాలకు కేంద్ర నిఽధుల నుంచి రూ.2.88 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.1.92 కోట్లు మంజూరయ్యాయి. వెలుగోడుకు మంజూరైన 4 భవనాలకు మొదటి విడతలో కేంద్రం నుంచి రూ.1.87కోట్లు, రాష్ట్రం నుంచి రూ.1.25కోట్ల నిధులు విడుదల చేశారు. నంద్యాలకు రూ.4.81 కోట్లు, వెలుగోడుకు రూ.3.12కోట్లతో మొత్తం రూ.7.93 కోట్లు మంజూరయ్యాయి. 

 స్థల సేకరణలో జాప్యం  

 ముస్లిం భవన సముదాయాలకు మొదటి విడతగా  రూ.7.9కోట్లు మంజూరయ్యాయి.  భవనాలు నిర్మించేందుకు స్థల సేకరణలో జాప్యం జరుగుతోంది. దీంతో మంజూరైన నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. నంద్యాలకు సంబంధించి మంజూరైన 6 భవనాలకు ఒక్కొక్కదానికి రెండేసి ఎకరాల చొప్పున 12 ఎకరాలు కావలసి ఉంది. స్థల సేకరణ కోసం ఆల్‌మేవా రాష్ట్ర నాయకుడు అబులైస్‌, సంఘ ప్రతినిధుల  పోరాడి   కొద్దిమేరకు సఫలీకృతమయ్యారు. అప్పటి నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి చొరవ చూపడంతో స్థల సేకరణ   వేగవంతమైంది. కలెక్టర్‌ కోటేశ్వరరావు పూర్తిస్థాయి స్థల సేకరణ  చేయాలని  అధికారులను ఆదేశించారు.  రెవెన్యూ, జిల్లా ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు స్థల సేకరణపై దృష్టి సారించారు. నంద్యాల మండలంలోని మూలసాగరం గ్రామంలో సర్వే నెంబర్‌ 325/2లో 36సెంట్లను ఉర్దూ జూనియర్‌ కళాశాలకు కేటాయించారు. సర్వే నెంబర్‌ 259-2లో 4.41ఎకరాలను భవన సముదాయాలకు కేటాయించారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు అమరావతిలోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిసే్ట్రషన శాఖకు ఫైలు పంపించారు.  పోరంబోకు స్థలం కావడం...వెస్ట్‌ల్యాండ్‌ కిందికి వస్తుండడంతో దాన్ని కనవర్షన చేసి అప్రూవల్‌ చేసి పంపించాల్సిన బాధ్యత ల్యాండ్‌ అడ్మినిసే్ట్రషన అధికారులపై ఉంది. ఈ ఫైలు 2021 ఆగస్టు నెల నుంచి అమరావతిలోనే ఉండిపోయింది. అదేవిధంగా వెలుగోడులోని 4 భవనాల నిర్మాణానికి 8ఎకరాల స్థలం కావాలి. దీని కోసం  రిజర్వాయర్‌ సమీపంలో భూమిని పరిశీలించగా.. అక్కడి రైతులు వ్యతిరేకించి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో రెండు చోట్ల పరిశీలించినా.. ఆ స్థలాలు భవన  నిర్మాణానికి  ఉపయోగంగా లేవని తేలింది. 

స్థల సేకరణలో జాప్యం తగదు

నంద్యాలకు కేటాయించిన భవనాలకు 12ఎకరాలు అవసరం   దాదాపు 5ఎకరాలకు సంబంధించిన పైలు అమరావతిలో ఉంది. అప్పటి కర్నూలు   కలెక్టర్‌, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ స్థల సేకరణకు ఎంతో చొరవ చూపించారు.  అమరావతిలో ఉండిపోయిన పైలు కదలిక విషయంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా చొరవ చూపడంతో ఓ కొలిక్కివచ్చింది. రెండు, మూడు వారాల్లో స్థల మంజూరుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. 

 - అబులైస్‌, ఆల్‌మేవా రాష్ట్ర నాయకుడు

స్థలాలను పరిశీలిస్తున్నాం

నంద్యాలకు సంబంధించిన పైలు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిసే్ట్రషన శాఖ దగ్గర ఉంది. త్వరలోనే సమస్య పరిష్కారం కానుంది. దాదాపు 5ఎకరాల వరకు నంద్యాలలోని సముదాయ భవనాల నిర్మాణాలకు కేటాయించారు. వెలుగోడుకు సంబంధించి  స్థలాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఎంపిక పూర్తవుతుంది. 

 - మహబూబ్‌బాషా, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, కర్నూలు :    


Read more