రుణమాఫీ ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-04-25T05:29:44+05:30 IST

రుణమాఫీ ఎప్పుడోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండు సార్లు అసెంబ్లీలో ప్రకటించినా నిధులు మాత్రం కేటాయించకపోవడంతో రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

రుణమాఫీ ఎప్పుడో?

- రుణమాఫీ కోసం రైతులకు తప్పని నిరీక్షణ

- హామీకే పరిమితమైన రుణమాఫీ

- రెండు సార్లు అసెంబ్లీలో ప్రకటించినా నిధులు కేటాయించని ప్రభుత్వం

- రూ.25వేలలోపు వారికే అమలు

- రూ.50వేలు, రూ.లక్షలోపు వారి సంగతేంటి

- రుణమాఫీ చేసినా వడ్డీకే సరిపోయే అవకాశం

- రెండు లక్షల మందికి పైగా రైతుల ఎదురుచూపు

- కనీసం అర్హుల లెక్కలు కూడా లేని వైనం


కామారెడ్డి, ఏప్రిల్‌ 24 : రుణమాఫీ ఎప్పుడోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండు సార్లు అసెంబ్లీలో ప్రకటించినా నిధులు మాత్రం కేటాయించకపోవడంతో రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రూ.25వేల లోపు రుణమాఫీ ఉన్న వారికే పూర్తిస్థాయిలో అమలు చేయని ప్రభుత్వం గతంలో జరిగిన హుజూరాబాద్‌ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ముందు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు రూ.50వేల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే కాకుండా శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించింది. అయినా నిధులు కేటాయించకపోవడంతో రైతులకు నిరాశే ఎదురైంది. రెండుసార్లు ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ప్రకటించిన కేవలం 25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీని ప్రభుత్వం అమలు చేసింది. అందులో కూడా కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 50 వేలలోపు రుణం ఉన్న రైతులతో పాటు రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చినా రైతులకు మాత్రం రుణమాఫీని పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా ఊరడిస్తూ కాలం వెల్లదీస్తోంది. రైతులు మాత్రం తమకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందోనంటూ గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల్లో మాత్రం వడ్డీకి, వడ్డి జమ చేస్తూ రైతులకు రుణభారాన్ని మోపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బ్యాంకర్లు మాత్రం వడ్డీని సంవత్సరానికి వసూలు చేస్తూ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన తర్వాత అసలు డబ్బులను మాఫీ చేస్తామంటూ రైతుల నుంచి వడ్డీని వసూలు చేస్తున్నారు. కేవలం వడ్డీ కడుతూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీని ప్రభుత్వం ఎప్పుడు అమలు పరుస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

శాసనసభ సాక్షిగా రెండు సార్లు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 డిసెంబరు నాటికి రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో, శాసనసభ సాక్షిగా రెండుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో పంట రుణాలు మాఫీ అవుతాయన్న ధీమాతో రైతులు ఉన్నారు. 2018 డిసెంబరు నాటికి రూ.లక్షలోపు ఉన్న రుణాల జాబితాను పంపించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. మూడు విడతలుగా అంటే మొదటి విడతలో రూ.25వేల లోపు ఉన్న రుణాలను, రెండో దశలో రూ.50వేలలోపు రుణాలను, మూడోదశలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా ఇంత వరకు రుణాలు మాఫీ కాకపోవడంపై రైతులు ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ సాక్షిగా రూ.25వేలు, రూ.50 వేలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా ప్రభుత్వం రూ.25వేలు తీసుకున్న రైతులకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. రూ.50వేలు తీసుకున్న రైతులకు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి ఏ ఒక్కరైతుకు కూడా ఇంత వరకు నిధులు కేటాయించకపోవడంతో అమలుకు నోచుకోలేదు.

రుణమాఫీ అర్హుల లెక్కలేవీ

జిల్లా వ్యాప్తంగా రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హులైన వారి జాబితాలను పంపించాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వానికి పంపిన అర్హుల జాబితాకు సంబంధించిన వివరాలు జిల్లా వ్యవసాయశాఖ వద్దగాని లీడ్‌ బ్యాంకు వద్దగాని లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అర్హుల వివరాలు ఇవ్వాలని కోరితే తమ వద్ద లేవంటే తమ వద్ద లేవంటూ చెప్పడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన జాబితా వివరాలను తప్పకుండా ఆయా శాఖల వద్ద ఉండాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అర్హుల జాబితా కావాలంటే ఆయా శాఖల అధికారులు నోళ్లు వెల్లబెట్టాల్సిందే.

పంట రుణాల కోసం తిప్పలు

జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.5వేలు వచ్చినప్పటికీ అవి ఏ మూలకు సరిపోని పరిస్థితి. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా సకాలంలో అందకపోవడంతో దున్నకాలు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు అవసరమైన మొత్తానికి ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు అవసరమైన పంట రుణాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ గతంలో తీసుకున్న పంట రుణాలు చెల్లించకపోవడాన్ని కారణంగా చూపుతూ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నాలుగేళ్లుగా రుణమాఫీ కోసం చూస్తున్నాం

- నల్లవెల్లి సాయిరెడ్డి, దేమెకలాన్‌.

నాలుగేళ్లుగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నాను. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ధీమాతో పంట రుణం చెల్లించలేదు. వడ్డీ ఎక్కువైతుందని బ్యాంకు వాళ్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాఫీ చేయనంటే అప్పు కట్టుకునేవాళ్లం కదా. తిరిగి పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితి. వెంటనే పంట రుణాన్ని మాఫీచేసి ఆదుకోవాలి.


వడ్డీ చెల్లింపులపై బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు

- సంతోష్‌రెడ్డి, గొట్టిముక్కుల, దోమకొండ

రుణమాఫీ కాక బ్యాంకుల్లో వడ్డీలు పెరుగుతున్నాయి. బ్యాంకర్లు వడ్డీలు చెల్లించమంటున్నారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేశామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తోంది. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు దీంతో వడ్డీలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చిన విధంగా పంట రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలి.

Updated Date - 2022-04-25T05:29:44+05:30 IST