టీచర్‌ ఉద్యోగాలెప్పుడు సారూ?

ABN , First Publish Date - 2021-01-25T12:57:07+05:30 IST

పరీక్షాఫలితాలు వచ్చి ఏడేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఉద్యోగం కల్పించని ప్రభుత్వంపై అభ్యర్థులు కన్నెర్ర చేశారు. ఇదిగో అదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న విద్యాశాఖ ...

టీచర్‌ ఉద్యోగాలెప్పుడు సారూ?

గోపిచెట్టిపాళయంలో మంత్రి ఇల్లు ముట్టడికి యత్నం

చెన్నై/ ప్యారీస్ (ఆంధ్రజ్యోతి)‌: పరీక్షాఫలితాలు వచ్చి ఏడేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఉద్యోగం కల్పించని ప్రభుత్వంపై అభ్యర్థులు కన్నెర్ర చేశారు. ఇదిగో అదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న విద్యాశాఖ మంత్రి కేఏ సెంగోట్టయ్యన్‌ తీరుకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నిం చారు. ఈ వ్యవహారం ఈరోడ్డు జిల్లా గోపిచెట్టిపాళయంలో ఉద్రిక్తతకు కారణమైంది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలో అర్హత పరీక్షలను ఆధారం చేసుకొని ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 2013వ సంవత్సరం టీచర్‌ అర్హత పరీక్షల్లో 90 మార్కులతో 4,500 మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. అదే సంవత్సరం వీరి సర్టిఫికెట్ల పరిశీలన కూడా జరిగింది. వీరికి వెయిటేజ్‌ విధానంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు మంత్రి సెంగోట్టయన్‌ ప్రకటించారు. అయితే, కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం రాగా, మిగతా వారు అర్హతను బట్టి తమకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇదిలా ఉండగా, టీచర్‌ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి సర్టిఫికెట్లు ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఆలోపు ఉద్యోగాలు రాకుంటే వారు మళ్లీ అర్హత పరీక్ష రాయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.


ఇందువల్ల నిరాశకు గురైన టీచర్‌ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఆదివారం గోపిచెట్టిపాళయంలో మంత్రి సెంగోట్టయన్‌ను సంప్రదించి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు పురుషులు, మహిళలు బస్సుల్లో గోపిశెట్టిపాళయంకు బయల్దేరి వెళ్లారు. పథకం ప్రకారం మంత్రి ఇంటి ముందు గుమిగూడి తమను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఆ సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు, అనుమతి లేకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొనరాదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీనిపై ఆందోళనకారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేందుకు తాము వెళ్లడం లేదని, గతంలో తమకిచ్చిన హామీని మంత్రి నెరవేర్చలేదని ఆరోపించారు. లాక్‌డౌన్‌ రోజుల్లో ఆర్థిక సమస్యలతో నలుగుతున్న తమ కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని వారు డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు  కొన్ని గంటల్లోనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. 

Updated Date - 2021-01-25T12:57:07+05:30 IST