Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆ రోజు..

twitter-iconwatsapp-iconfb-icon

- స్వాతంత్య్రం వచ్చిన వేళ.. సందడే సందడి
- ఊరూరా సంబరాలు చేసుకున్నాం
- ఉద్యమకారులకు జేజేలు పలికాం
- జెండా వందనాలతో పండగ వాతావరణం
- ‘ఆంధ్రజ్యోతి’తో నాటి అనుభవాలు పంచుకున్న పెద్దలు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ ఇచ్ఛాపురం/ ఎచ్చెర్ల/ గార/ ఆమదాలవలస/ పొందూరు/ పలాస/ హరిపురం)


తెల్లదొరల బానిస చెర నుంచి విముక్తి పొందిన రోజు..
భారతీయులంతా స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు..

1947 ఆగస్టు 15
..............
స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు అవుతోంది. బ్రిటీష్‌ పాలనలో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయులకు స్వాత్రంత్యం వచ్చిన రోజు.. పండగ రోజే. చరిత్రలో నిలిచిపోయే ఆ రోజును భారతీయులు ఎన్నటికీ మరిచిపోలేరు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా.. స్వాతంత్య్రం వచ్చిన వేళ.. అప్పట్లో చిన్నారులు, యువకులుగా ఉన్న ఇప్పటి పెద్దలను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. ఈ సందర్భంగా వారంతా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన సంగతి ఎలా తెలిసింది. అసలు అప్పుడేం జరిగిందన్నది స్వయంగా వెల్లడించారు. తొలి స్వరాజ్య కబురు తెలిసిన క్షణాన.. ఆ సందడే వేరంటూ మురిసి పోయారు. ఊరంతా సంబరాలు చేసుకున్నామని, జెండా వందనాలు చేశామని, పోరాటయోధులకు జేజేలు పలికామని తెలిపారు. ఆ రోజును ఎప్పటికీ మరచిపోలేమని స్పష్టం చేశారు.

సంబరాలు చేసుకున్నాం
స్వాతంత్య్రం వచ్చేనాటికి నా వయస్సు 30 ఏళ్లు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్వాతంత్య్రం వచ్చిందని పెద్దగా కేకలు వినిపించాయి. అందరం ఇళ్ల నుంచి బయటకు వచ్చాం. అంతా ఆనందాలతో కనిపించారు. మిఠాయిలు పంచారు. వీధుల్లో సంబరాలు చేసుకున్నాం. అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు.. ఇంట్లో దీపాల వెలుతురు కూడా బయటకు కనిపించకూడదని ముందుగా ప్రకటించేవారు. యుద్ధం అయినంత వరకు చీకట్లోనే ఉండేవాళ్లం.
- ఉప్పు అమ్మాయమ్మ, దేవరవీధి, ఇచ్ఛాపురం.

సరదాగా వెళ్లాను
ఇచ్ఛాపురంలో పుట్టాను. స్వాతంత్య్రం వచ్చేనాటికి బరంపురంలో నివసిస్తున్నాం. అప్పట్లో నా వయసు 15 ఏళ్లు. నాయకులందరిని చూశాను. వాళ్లంతా వీధుల్లో తిరుగుతుంటే.. సరదాకి వారి వెనుక వెళ్లాను.
 - జనగ పార్వతి, ఇచ్ఛాపురం

ఊరంతా కేకలు
కేశవరావుపేటలో 1934 ఏప్రిల్‌ 10న జన్మించాను. స్వాతంత్య్రం వచ్చిన నాటికి ఎస్‌.ఎం.పురంలో 8వ ఫారం పూర్తిచేశాను మా ఊరులో నాతో పాటు యతిరాజుల అప్పలసూరి, కొమ్ము సింహాచలం ముగ్గురు చిన్ననాటి స్నేహితులం. స్వాతంత్య్రం వచ్చిందన్న విషయం మరుసటి రోజున పత్రికల ద్వారా తెలుసుకున్నాం. ఆ రోజున ముగ్గురు స్నేహితులం సంతోషంగా గడిపాం. అప్పట్లో పిప్పర్‌మెంటు బిళ్లలను తిని ఆనందించాం. గ్రామంలో మిగిలిన కుర్రాళ్లతో కలిసి మనకు స్వాతంత్య్రం వచ్చిందోచ్‌ అంటూ కేకలు వేసుకుంటూ తిరిగాం. అప్పట్లో పెద్దగా తెలియకపోయినా.. ఆ తర్వాత తెలిసింది స్వాతంత్య్రం అంటే ఏమిటో.
- పేడాడ ఆదినారాయణ, కేశవరావుపేట, ఎచ్చెర్ల  

చెప్పలేని ఆనందం...
నా వయసు అప్పుడు 11 ఏళ్లు. మా నాన్న ఉద్యోగరీత్యా నరసన్నపేటలో ఉండేవాళ్లం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున అప్పటితరం పెద్దల్లో ఏదో తెలియని, చెప్పలేని ఆనందాన్ని, సంతోషాన్ని చూశాను. బ్రిటీష్‌ నిరంకుశ పాలన నుంచి భారతీయులందరికీ విముక్తి లభించిందని.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. నాతోటి పిల్లలకు కూడా మా నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అప్పట్లో గాంధీజీ నరసన్నపేట వచ్చిన సందర్భంలో ఆయనను చూశాను.
-తిరుమల పెద్దింటి కూర్మాచార్యులు, ప్రభుత్వ కళాశాల విశ్రాంత సూపరింటెండెంట్‌, శ్రీకూర్మం.


మరువలేం
స్వాతంత్య్రం వచ్చిన రోజుని.. ఎప్పటికీ మరువలేం. అప్పటికి నాకు 16 ఏళ్లు. గ్రామ ప్రజలంతా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటూ సందడిగా వీధుల్లో తిరిగారు. దూసి నుంచి పెద్దాయన(బుగత).. మరికొంతమంది జాతీయ జెండా పట్టుకుని తిరిగారు. గాంధీజీకి, భరతమాతకు జై అంటూ దూసి రైల్వేస్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. క్విట్‌ ఇండియా సమయంలో(1942లో) దూసి రైల్వేస్టేషన్‌కు గాంధీజీ వచ్చినప్పుడు.. నేను ఆయనను చూశాను.
- బుడుమూరు కృష్ణారావు, దూసిపేట, ఆమదాలవలస.

బడి వద్ద జెండా ఎగుర వేశారు
స్వాతంత్య్రం వచ్చిన రోజు.. భరతమాతకు జేజేలు అంటూ నినాదాలు చేశారు. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. నేను కూడా గ్రామపెద్దల వెనుక తిరిగాను. సంబరాల్లో పాల్గొన్నాను. పెద్ద నాయుడు గారి పూరింట్లో బడి నడిపేవారు. అందరూ అక్కడకు చేరుకుని కర్రకు జెండా కట్టి.. ఎగురవేశారు. క్విట్‌ ఇండియా సమయంలో.. దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీజీని నేరుగా చూశాను.  
- బొడ్డేపల్లి వరహానర్సింహులు, కొత్తవలస, ఆమదాలవలస

పండగ వాతావరణం
స్వాతంత్య్రం వచ్చిన నాటికి పదో తరగతి చదువుతున్నాను. నరసన్నపేట సమీపంలోని సత్యవరం అగ్రహారంలో నా మేనమామ రాజమహంతి హనుమంతురావు ఇంట్లో ఉండేవాడిని. స్వాతంత్య్ర ఉద్యమాలు ప్రత్యక్షంగా చూశాను. గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమాల్లో పాల్గొన్నాం. దేశానికి స్వాతంత్య్ర వచ్చినట్టు రేడియో ద్వారా సమాచారం అందింది. దీంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. గ్రామపెద్దలు సభ ఏర్పాటు చేసి.. గాంధీజీ వంటి మహాత్ములకు జేజేలు పలికారు. జాతీయ జెండాలు ఎగురవేశారు.
- కేఎల్‌వీ ప్రసాదరావు, విశ్రాంత గెజిటెడ్‌ హెచ్‌ఎం, పొందూరు

విద్యార్థి దశలోనే జెండా ఎగురవేశాను
నేను 1931 మే 5న జన్మించాను. స్వాతంత్య్ర ఉద్యమంలో యువతతో కలిసి పాల్గొన్నాను. స్వాతంత్య్రం వచ్చేనాటికి టెక్కలిలో ఇంటర్‌ చదువుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిందని తెలిసిన వెంటనే కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులమంతా వేడుకలు చేసుకున్నాం. సభ కూడా నిర్వహించారు. విద్యార్థి దశలోనే జాతీయజెండాను ఎగురవేశాను. అప్పటి నుంచి 74 ఏళ్లుగా జెండాను ఎగురవేస్తూనే ఉన్నాను. నేడు కూడా పలాస-కాశీబుగ్గలోని స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంటాను.
- డాక్టర్‌ కణితి విశ్వనాథం, మాజీ ఎంపీ, పలాస.

ఈలలు.. డప్పులతో తిరిగాం
స్వాతంత్య్రం వచ్చిన నాటికి నాకు 11ఏళ్లు. రెండోతరగతి వరకు చదివి మానేసి ఆవులు కాస్తున్నాను. ఆ రోజు రాజుగారి వద్ద అంచనాకారులుగా పనిచేసే ఇద్దరు వ్యక్తులు వచ్చి గ్రామంలో మనకు స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. దీంతో గ్రామంలో సుమారు 40 మంది ఊరంతా తిరిగారు. హరిపురంలో సమావేశం పెట్టటంతో.. మేమంతా అక్కడికి చేరుకున్నాం. నెహ్రు చేసిన తొలి ప్రసంగం సభలోనే రేడియోద్వారా విన్నాం. అనంతరం సాయంసంధ్యా సమయంలో ఈలలు వేస్తూ.., డప్పులు కొడుతూ ఊరంతా తిరిగాం. రైతుల వద్ద పండిన పంటలు అంచనాకారులు అంచనాలు వేసి రాజులకు భోగం కట్టే కష్టాలు తప్పాయని గ్రామస్థులంతా సంతోషం వ్యక్తం చేసిన దృశ్యాలు నా కంటి ముందు నేటికీ కదులుతున్నాయి.
- బొంగి వెంకయ్య, బాలిగాం, మందస.  

పండగలా ఉత్సవాలు
స్వాతంత్య్రం వచ్చే నాటికి నా వయస్సు ఐదేళ్లు దాటింది. ఆరోజు అందరూ పండగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకొంటున్నారు. అసలేం జరిగిందని మా పెద్దలని అడిగా. మనలని మనమే పరిపాలించుకునే రోజులొచ్చాయని వారు చెప్పారు. ఊరి పెద్దలంతా ‘ఇక రాజ్యం మనదే’ అంటూ నినాదాలు చేశారు.  
-యండ భాస్కరరావు, పొడుగుపాడు, కోటబొమ్మాళి.


రచ్చబండ వద్ద విన్నా :
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రేడియో ద్వారా గ్రామప్రజలకు సమాచారం తెలిసింది. పెద్దలందరూ రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. తెల్లదొరల పాల నుంచి విముక్తి లభించిందని... గ్రామంలో దండోరా వేసి అందరికీ విషయం తెలియజేయాలని పెద్దలందరూ చెప్పుకున్నారు. అలా మనకు స్వాతంత్య్రం వచ్చిందని తెలిసింది. ఆరోజు అంతా పండగ వాతావరణం ఏర్పడింది.  
- వడగ రామ్మూర్తి, పట్టుశాలివీధి, జి.సిగడాం

విజయోత్సవ ర్యాలీలు
దేశం నుంచి తెల్లదొరలను తరిమేయాలని పోరాటం చేస్తున్న రోజులవి. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమే మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. అప్పట్లో గాంధీ గారితో కలిసి ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట గ్రామాల్లో పర్యటించాను. స్వాతంత్య్రం వచ్చిన రోజు గ్రామంలో దండోరా వేసి విషయాన్ని తెలియజేశారు. అప్పటికి నా వయస్సు 27 ఏళ్లు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియగానే జాతీయ జెండాలతో గ్రామపెద్దలతో కలసి విజయోత్సవ ర్యాలీలు జరుపుకొన్నాం.
- దుమ్ము అప్పడు, జగతి గ్రామం, కవిటి మండలం

మా మాస్టారు చెప్పారు..
నాకు అప్పటికి తొమ్మిదేళ్లు. సంచాం పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రేడియో ద్వారా మా మాస్టారుకు తెలిసింది. ఆయన మా బడిలో అందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు.  స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశ నాయకుల గురించి వివరించారు.
- నడుకుదిటి అప్పలకొండ, నడుకుదిటిపాలెం, రణస్థలం

జేజేలు పలికాం :
స్వాతంత్య్రం నాటికి నాకు 12 ఏళ్లు. ఐదో తరగతి చదువుతున్నా. స్వాతంత్య్రం వచ్చిందని బడిలో మాస్టారు  చెప్పారు. అదేరోజున స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు మా ఊరిలోకి వస్తున్నారని తెలిపారు. వారికి ఎదురుగా వెళ్లి జేజేలు పలికాం. అప్పట్లో బిళ్ల(చాక్లెట్‌)లను పంచారు.
- పూజారి నాగయ్య, అబ్బాయిపేట, జలుమూరు

బెల్లం పంచుకున్నాం  
నా వయస్సు అప్పటికి 15 ఏళ్లు. స్వాతంత్య్రం వచ్చిందని తెలిసి అందరం గెంతులు వేశాం. అప్పట్లో బెల్లం పంచుకుని తిన్నాం. మా గ్రామం నుంచి ఇద్దరు ముగ్గురు స్వాతంత్య్ర దినోత్సవ సభలకు వెళ్లారు.  
- కొర్ల పున్నయ్య, సుజిని గ్రామం, మెళియాపుట్టి.

వెంటనే జెండా ఎగురవేశాం :
స్వాతంత్య్రం వచ్చేనాటికి నాకు ఐదేళ్లు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే జెండా ఎగురవేశామని మా టీచర్‌ రామ్మూర్తి, మా నాన్న చెబుతుండేవారు. అప్పట్లో సుమారు 20కిలోమీటర్లకు వరకు ఊరేగింపు చేపట్టారట. గుళ్లాలపాడు చౌదరి.. గ్రామస్థులందరికీ భోజనాలు పెట్టారట.
- పుక్కళ్ల అప్పన్న, డోకులపాడు, వజ్రపుకొత్తూరు మండలం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.