పట్టాలిచ్చేదెప్పుడు?

ABN , First Publish Date - 2022-08-14T06:51:51+05:30 IST

పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలయ్యింది

పట్టాలిచ్చేదెప్పుడు?

 ఎదురుచూస్త్ను పోడురైతులు 

- దరఖాస్తులు స్వీకరించి ఎనిమిది నెలలు 

- ఇప్పటి వరకు అర్హులను గుర్తించని ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలయ్యింది. పట్టాలు జారీచేస్తే రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి  పథకాలు వర్తిస్తాయి. అర్హులను గుర్తించి పట్టాలను జారీ చేయకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. అటవీ భూములను పోడుగా మార్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతరులు ఎన్నోఏళ్లుగా తమకు అటవీ భూముల హక్కుల చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ద్వారా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏఏ జిల్లాల్లో ఎన్ని ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి, ఎంత భూమి కబ్జాకు గురయ్యిందో గుర్తించాలని ఆదేశించారు. 

- 76 వేల ఎకరాల్లో అటవీ భూములు

జిల్లాలో దాదాపు 76 వేల ఎకరాల్లో అటవీ భూములు ఉండగా, వాటిలో 11 మండలాల్లోని 54 గ్రామాల్లో 5074 ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. గత ఏడాది నవంబర్‌ 8వ తేదీ నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అందులో భాగంగా జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌, పెద్దపల్లి, పాలకుర్తి, అంతర్గాం, తదితర మండలాల్లోని 54 గ్రామాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 8,298 ఎకరాల భూములకు గాను 4,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 482 మంది గిరిజనులు 980 ఎకరాల భూముల కోసం, 4,132 మంది గిరిజనేతరులు 7,318 ఎకరాల భూముల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనకు గానూ మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో కూడా కమిటీలను వేస్తామని, త్వరగా వాటిని పరిష్కరించి నెలరోజుల్లోనే పట్టాలను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిచింది. కానీ ఇప్పటి వరకు వాటిని పరిశీలించిన దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం 2005 డిసెంబరు నెలాఖరుకంటే ముందే అటవీ భూములను పోడుగా మార్చుకుని సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ద్వారా పట్టాలు ఇవ్వాల్సి ఉంది. గిరిజనేతరులు 75 ఏళ్ల నుంచి అటవీ భూములను సాగు చేసుకునే వారికి మాత్రమే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అటవీ మధ్యలో భూములను సాగు చేసుకుంటున్న వారికి మరో చోట ప్రభుత్వ భూములను ఇచ్చి సాగు నీరు, విద్యుత్‌, నివాస సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భూములు లేకుంటే అటవీ చివరన సరిహద్దు భూముల్లో పట్టాలు జారీ చేయాలని పేర్కొంది. 

- గిరిజనేతరుల నుంచే అధిక దరఖాస్తులు..

జిల్లాలో గిరిజనేతరుల నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హత కలిగిన వారి సంఖ్య తక్కువే ఉంటుందని అధికారులు అంటున్నారు. పలువురు ఆయా భూముల్లో కబ్జా లేకున్నా కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. గిరిజనులు మాత్రమే అర్హత కలిగి ఉంటారని తెలుస్తున్నది. అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు గుర్తించిన దానికంటే ఎక్కువ భూముల్లో పోడు సాగు చేస్తున్నామని దరఖాస్తులు రావడంతో అధికారులు విస్తుపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా అధికారులు చర్యలు చేపట్టలేదు. అధికారులు దరఖాస్తులను ఎప్పుడు పరిశీస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దరఖాస్తుల పరిశీలన చేసి అర్హులకు పట్టాలు జారీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2022-08-14T06:51:51+05:30 IST