చెక్‌పవర్‌ ఎప్పుడొస్తుందో?

ABN , First Publish Date - 2021-04-22T05:10:40+05:30 IST

సర్పంచ్‌లు చెక్‌పవర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 1,194 పంచాయతీలకు గాను 1,164 పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు అంతా ఈ నెల 3న ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకూ సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వలేదు. దీంతో పంచాయతీల్లో నిధులున్నా పనులు చేయించి బిల్లులు చెల్లించే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు.

చెక్‌పవర్‌ ఎప్పుడొస్తుందో?

సర్పంచ్‌ల ఎదురుచూపు
పారిశుధ్య పనులకు ఇబ్బందులు
ఇచ్ఛాపురం రూరల్‌:
సర్పంచ్‌లు చెక్‌పవర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.  జిల్లాలో 1,194 పంచాయతీలకు గాను  1,164 పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు అంతా ఈ నెల 3న ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకూ సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వలేదు.  దీంతో పంచాయతీల్లో నిధులున్నా పనులు చేయించి బిల్లులు చెల్లించే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రధానంగా వీధి దీపాలు, బోరుల మరమ్మతలు చేయాల్సి ఉంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ పనులు ముమ్మరంగా చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు పంచాయతీల నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. అయితే  నేటికీ చెక్‌ పవర్‌ ఇవ్వకపోవడంతో  పనులు చేయించలేక, సతమతమవుతున్నామని కొందరు సర్పంచ్‌లు చెబుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న సర్పంచ్‌లు సొంత నిధులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. లేనివారు ఇబ్బందిపడుతున్నారు. అటు ప్రజలకు సమాధానం చెప్పలేక, ఇటు పెట్టుబడి పెట్టి పనులు చేయించలేక సతమతమవుతున్నారు. చెక్‌ పవర్‌ ఎప్పుడొస్తుందో తెలియక కొన్ని చోట్ల ఉపసర్పంచ్‌లుగా ఉన్న సూపర్‌ సర్పంచ్‌లు ముందస్తుగా సొమ్ము ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫలితంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చెక్‌పవర్‌ త్వరగా మంజూరు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం
నీటి ఎద్దడి లేకుండా పంచాయతీల్లో బోర్లు మరమ్మతులు చేపడుతున్నాం. దీంతో పాటు పారిశుధ్య పనుల నిర్వహణకు, ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు  సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పంచాయతీల ఖాతాల్లో నిధులు ఉన్నా  అప్పులు చేయాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా చెక్‌ పవర్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
- గుజ్జు ఢిల్లీరావు,  కేశుపురం, సర్పంచ్‌

 వారం రోజుల్లో ఆదేశాలు
 పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ సూచన మేరకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వాలి. మరో వారం రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.
- ఎస్‌.హరిహరరావు, డీఎల్‌పీవో, టెక్కలి

Updated Date - 2021-04-22T05:10:40+05:30 IST