‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2020-07-04T11:23:30+05:30 IST

గ్రామాల్లో నిరుపేదలకు అందజేసే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులు

‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


  గజ్వేల్‌, జూలై 3: గ్రామాల్లో నిరుపేదలకు అందజేసే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. గజ్వేల్‌లోని ఐవోసీలోని సీబ్లాక్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్మాణపురోగతి, లబ్ధిదారుల ఎంపికపై ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల వారీగా చేపడుతున్న పనుల ప్రగతినివేదికను అధికారులు, కాంట్రాక్టర్లు, సర్పంచులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. పనులను వేగవంతం చేయాలని, చివరి దశలో ఉన్న పనులకు అనుమతుల కోసం తనకు వెంటనే వివరాలతో కూడిన దరఖాస్తు పెట్టాలని సూచించారు.


గజ్వేల్‌ మండలం కొడకండ్ల, అహ్మదీపూర్‌, సింగాటం, అక్కారం, మర్కుక్‌ మండలంలోని పాములపర్తి, ములుగు మండలంలోని తిమ్మాపూర్‌, అచ్చాయపల్లి, జగదేవ్‌పూర్‌ మండలంలోని చాట్లపల్లి, కొండపాక మండలంలోని మోదినీపూర్‌, వెలికట్ట, విశ్వనాథపల్లి, దుద్దెడ, నాగిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, సర్పంచులతో సమన్వయం చేసుకుని ఎంపిక ప్రక్రియ చేయాలని సూచించారు.


గ్రామాల్లో అర్హులై ఉండి ఇళ్లు రాని వారికి తదుపరి దశలో ఇస్తామని, గ్రామపంచాయతీల్లో తీర్మానం చేసి అందించాలని సూచించారు. సర్పంచులు గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలను వాడుకలోకి తీసుకురావాలన్నారు. సర్పంచులు కాలువల నిర్మాణంలో శ్రద్ధచూపాలని, ‘‘మీ గ్రామాలకు మీరే సీఎం, మంత్రి, కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ అని.. మీరనుకుంటే గ్రామాలకు సాగునీరొచ్చి రైతులు బాగుపడతారని’’ చెప్పారు. 


 ఎర్రవల్లి, నర్సన్నపేట అభివృద్ధిలో ముందుండాలి

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి భారతదేశపటంలో అభివృద్ధిలో ప్రథమ స్థానం లో నిలపాలని కలెక్టర్‌ కోరారు. మర్కుక్‌ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన వీడిసీ కమిటీలు, గ్రామప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు కోరిన విధంగా, సీఎం ఆదేశాల మేరకు ఎర్రవల్లికి 10 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నర్సన్నపేటకు 25 ఇళ్లను మంజూరీ చేస్తున్నట్లు ప్రకటించారు.


దత్తత గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని నాణ్యతతో, ఆధునిక హంగులతో నిర్మించిన కాంట్రాక్టర్‌ బాపునీయుడుని కలెక్టర్‌ అభినందించారు. గ్రామాల్లో మురుగుకాలువలు, ఆలయాలు, గ్రంథాలయం, మహిళా భవనం, యూత్‌భవనం, మినీఫంక్షన్‌హాల్‌ను మంజూరీ చేస్తామని, సీఎం దృష్టికి తీసుకువెళ్లి అన్ని పనులను చేసుకుందామన్నారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, హర్టికల్చర్‌ డీడీరామలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ డీఈఈ రాంచంద్రం, తహసీల్దార్లు అన్వర్‌, ఆరీఫా, వాణిరెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, రామేశ్వర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-07-04T11:23:30+05:30 IST