వాటికి ఎన్నికలు ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-11-27T05:06:14+05:30 IST

ఒక ప్రజాప్రతినిధి రాజీనామా చేసినా, మృతిచెందినా ఆరునెలల వ్యవధిలో ఉప ఎన్నిక జరగాలి. కానీ స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలో ఒక్క చోట కూడా ఎన్నిక జరగలేదు. ఎమ్మెల్యే స్థానాలకు ఆరునెలల్లోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారు కానీ స్థానిక సంస్థలను మాత్రం విస్మరిస్తున్నారు.

వాటికి ఎన్నికలు ఎప్పుడో?

3 సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ స్థానం ఖాళీ

ఇటీవలే మృతిచెందిన తొగుట జడ్పీటీసీ

జిల్లాలో వార్డు సభ్యులు లేని 34 స్థానాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 26 : దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లి గ్రామ సర్పంచ్‌గా 2019 జనవరి నెలలో రణం జ్యోతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడు నెలలకు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించారు. తన సర్పంచ్‌ పదవికి రాజీనామా చేసి సుమారు 3 సంవత్సరాలు కావొస్తున్నది. అయినప్పటికీ అక్కడ మళ్లీ ఎన్నికలు జరపలేదు. కొత్త సర్పంచ్‌ను ఎన్నుకోలేదు. ఉప సర్పంచ్‌కే బాధ్యతలు ఇచ్చి కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరిన్ని చోట్లా ఉంది. ఒక ప్రజాప్రతినిధి రాజీనామా చేసినా, మృతిచెందినా ఆరునెలల వ్యవధిలో ఉప ఎన్నిక జరగాలి. కానీ స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలో ఒక్క చోట కూడా ఎన్నిక జరగలేదు. ఎమ్మెల్యే స్థానాలకు ఆరునెలల్లోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారు కానీ స్థానిక సంస్థలను మాత్రం విస్మరిస్తున్నారు. 


ఓ జడ్పీటీసీ, ఎంపీటీసీ.. 3 సర్పంచ్‌ స్థానాలు

జిల్లాలో ఓ ఎంపీటీసీ స్థానం, మూడు సర్పంచ్‌ స్థానాలు, 34 వార్డు సభ్యుల స్థానాలకు ఖాళీ ఏర్పడ్డాయి. నెలలు గడుస్తున్నా మళ్లీ ఉపఎన్నిక ఊసెత్తలేదు. తాజాగా జడ్పీటీసీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. తొగుట మండల జడ్పీటీసీ సభ్యుడు గాంధారి ఇంద్రసేనారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. జనరల్‌ రిజర్వేషన్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు. ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇక కొండపాక మండలం కుకునూరుపల్లి ఎంపీటీసీ-2 గీత అనార్యోగంతో మృతిచెందారు. అదే విధంగా కొమురవెల్లి మండలం పోసానిపల్లి గ్రామ సర్పంచ్‌ కొండమ్మ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ అనురాధ కరోనాతో మృతి చెందింది. దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లి సర్పంచ్‌ రణం జ్యోతి జడ్పీటీసీగా ఎన్నిక కావడంతో ఈ పదవికి రాజీనామా చేశారు. 


ప్రశ్నార్థకంగా 34 వార్డులు..

- చేర్యాల మండలం కాశీగుడిశెలు గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు అనారోగ్యంతో చనిపోయాడు.

- మిరుదొడ్డి మండలం కూడవెల్లికి చెందిన రాజు, చెప్యాలకు చెందిన బాల్‌రెడ్డి అనే వార్డు సభ్యులు అనారోగ్యంతో చనిపోయారు.

- కోహెడ మండలం చెంచల్‌చెరువుపల్లి వార్డు సభ్యురాలు ఆవుల రాధమ్మ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులు కావడంతో రాజీనామా చేశారు. అలాగే రామచంద్రాపూర్‌లో వార్డు సభ్యుడు అంజయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్తూ రాజీనామా చేశారు. ఇక సముద్రాల గ్రామంలో వార్డు సభ్యుడు క్రిష్ణారెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. 

- దౌల్తాబాద్‌ మండలం గువ్వలేగి, దౌల్తాబాద్‌, తిర్మలాపూర్‌ గ్రామాల్లో ఒక్కో వార్డు సభ్యుల స్థానం ఖాళీగా ఉంది. వీరు ముగ్గురు అనారోగ్యంతో చనిపోయారు. 

- రాయపోల్‌ మండలం తిమ్మక్కపల్లిలో వార్డు సభ్యురాలిగా ఉన్న ఇప్ప లక్ష్మీ ఎంపీటీసీగా ఎన్నిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఇదే గ్రామంలో మరో వార్డు సభ్యుడు మృతి చెందడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక రాయపోల్‌, చిన్నమాసాన్‌పల్లిలో ఒక్కో వార్డు సభ్యుడి స్థానాలు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. 

- తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో వార్డు సభ్యుడు హబీబొద్దీన్‌ విద్యుత్‌ షాక్‌తో మృతిచెందారు. ఇదే గ్రామంలోని తుక్కాపురం అశోక్‌ అనారోగ్యంతో చనిపోయాడు. ఇక పల్లెపహాడ్‌ గ్రామంలో అజ్మీరా ఈర్యా అనే వార్డు సభ్యుడు కరోనాతో మృతి చెందాడు. 

- కొండపాక మండలం జప్తినాచారం, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో రెండు స్థానాల్లో వార్డు సభ్యులు మృతిచెందడంతో ఖాళీగా ఉన్నాయి. 

- సిద్దిపేట రూరల్‌ మండలం తోర్నాలలో ఒకరు, మాచాపూర్‌లో ఒకరు రాజీనామా చేయడంతో వార్డు స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. ఇక పుల్లూరు, రాంపూర్‌లో ఇద్దరు సభ్యులు అనారోగ్యంతో చనిపోయారు. 

- బెజ్జంకి మండలం తోటపల్లిలో మనోహర్‌ అనే వార్డు సభ్యుడు కరోనాతో మృతిచెందగా, వీరాపూర్‌లో మిట్టపల్లి భారతవ్వ అనారోగ్యంతో చనిపోయింది. ఇక లక్ష్మీపూర్‌లో వరలక్ష్మీ అనే వార్డు సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 

- అక్కన్నపేట మండలం రామవరంలో వార్డు సభ్యుడు లింగాల శ్రీనివాస్‌ ఎంపీటీసీగా గెలవడంతో ఖాళీ ఏర్పడింది. అక్కన్నపేట గ్రామంలో జాగీరు తిరుపతి అనే వార్డు సభ్యుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 

- నంగునూరు మండలం రాంపూర్‌లో ఒకటో వార్డుసభ్యుడు మగ్దుంపూర్‌ ఎంపీటీసీగా గెలవడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. 


Updated Date - 2021-11-27T05:06:14+05:30 IST