చెక్‌పవర్‌ ఇంకెప్పుడు..?

ABN , First Publish Date - 2021-05-17T07:08:21+05:30 IST

ఖాతాల్లో నిధులున్నాయి. కానీ, డ్రా చేయలేరు. పల్లెల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయలేరు. పారిశుధ్య పనులు చేపట్టలేరు. దీనికంతా కారణం సర్పంచులకు చెక్‌ పవర్‌ లేకపోవడమే.

చెక్‌పవర్‌ ఇంకెప్పుడు..?

- గెలిచి మూడు నెలలైనా సర్పంచులకు దక్కని వైనం

- పల్లె ఖాతాల్లో మగ్గుతున్న రూ.120 కోట్లు 

- కరోనా వేళ పారిశుధ్య పనులకు ఇక్కట్లు


చిత్తూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఖాతాల్లో నిధులున్నాయి. కానీ, డ్రా చేయలేరు. పల్లెల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయలేరు. పారిశుధ్య పనులు చేపట్టలేరు. దీనికంతా కారణం సర్పంచులకు చెక్‌ పవర్‌ లేకపోవడమే. 

జిల్లాలో 1412 పంచాయతీలకుగనుఉ 43 మినహా 1369కి ఫిబ్రవరిలో నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్‌ 3న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికీ చెక్‌పవర్‌ ఇవ్వలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన నెలలోనే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం మొదటి విడత అన్‌టైడ్‌ నిధులను మంజూరు చేసింది. జిల్లాకు రూ.80 కోట్లు వచ్చాయి. తాజాగా రెండో విడతగా రూ.40 కోట్ల టైడ్‌ నిధులు రాగా.. పల్లె ఖాతాలకు సర్దుబాటు చేశారు. ఇలా రెండు విడతల్లో రూ.120 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఈ నిధులతో ఎంతో అవసరం ఉంటుంది. పల్లెల్లో పారిశుధ్య పనులు, వీధి దీపాలు, తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నిధులను వెచ్చించాలి. కానీ వాటిని వినియోగించే అధికారం సర్పంచి చేతిలో లేకపోవడంతో సమస్యలు తీరడంలేదు. 


‘పరిషత్తు’లకు 30 శాతం 

గతంలో ఆర్థిక  సంఘం వరకు నిధులు మొత్తం పంచాయతీ ఖాతాలకే జమయ్యేవి. అందులో 30 శాతం నిధులను జిల్లా, మండల పరిషత్తులకు వెనక్కి ఇచ్చేవారు. ఈసారి కేంద్రం నుంచి పంచాయతీలకు 70శాతం, మండల, జిల్లా పరిషత్తులకు 15 శాతం చొప్పున నిధులు విభజించి ఖాతాల్లో వేస్తున్నారు. పరిషత్తులకూ పాలకవర్గాలు లేవు. ఇటీవల ఎన్నికలు జరిగినా.. ఇంకా ఫలితాలు వెలువడలేదు. దీంతో ఆ మొత్తాన్నీ ఖర్చు చేయలేని పరిస్థితి. 


నాలుగైదు రోజుల్లోనే చెక్‌ పవర్‌ 

సర్పంచులకు చెక్‌పవర్‌ ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని ఇదివరకే పంపించాం. ప్రస్తుతం ఎంపీడీవో లాగిన్‌ నుంచి ఆయా సర్పంచులకు చెక్‌పవర్‌ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రక్రియ జరుగుతోంది. సుమారు వెయ్యి పంచాయతీలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పంచాయతీల పని కూడా పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో చెక్‌ పవర్‌ను ఇస్తాం. 

- దశరథరామిరెడ్డి, డీపీవో

Updated Date - 2021-05-17T07:08:21+05:30 IST