పల్లెలకు రాని ప్రగతి చక్రాలు - నేటికీ ఆటోలే శరణ్యం

ABN , First Publish Date - 2022-01-22T05:16:45+05:30 IST

ఎటువంటి లాభాపేక్షాలేకుండా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన పల్లెవెలుగు బస్సులు జాతీయ రహదారులకే పరిమితమం అయ్యాయి. దీంతో పేరుకే పల్లెవెలుగులుగా తప్ప పల్లెల ముఖం కూడా ఆర్టీసీ బస్సులు చూడట్లేదు. దీంతో పల్లె వెలుగుల లక్ష్యం నీరుగారిపోయింది.

పల్లెలకు రాని ప్రగతి చక్రాలు - నేటికీ ఆటోలే శరణ్యం
పరిమితికి మించి ఆటోలో వేలాడుతూ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు

త్రిపురాంతకం, జనవరి 21: ఎటువంటి లాభాపేక్షాలేకుండా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన పల్లెవెలుగు బస్సులు జాతీయ రహదారులకే పరిమితమం అయ్యాయి. దీంతో పేరుకే పల్లెవెలుగులుగా తప్ప పల్లెల ముఖం కూడా ఆర్టీసీ బస్సులు చూడట్లేదు. దీంతో పల్లె వెలుగుల లక్ష్యం నీరుగారిపోయింది. మండలంలో జాతీయ రహదారితోపాటు, నియోజకవర్గ కేంద్రం ఎర్రగొండపాలెంకు వెళ్లే దారిలో ఉన్న గ్రామాలు  మినహా  ఏగ్రామంలోకీ ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి లేదు. కేశినేనిపల్లి, హసానాపురం, నడిగడ్డ, సోమేపల్లి, విశ్వనాథపురం, లేళ్లపల్లి, దువ్వలి, కంకణాలపల్లి, మిరియంపల్లి, గాంధీనగర్‌, ఒడ్డుపాలెం, పాపన్నపాలెం, కొత్తముడివేముల, పాతముడివేముల, గణపవరం, ఎండూరివారిపాలెం, డీవీఎన్‌ కాలనీ, గుట్లపల్లి, వెంగాయపాలెం గ్రామాలతోపాటు అటవీప్రాంతంలో ఉన్న తండా గ్రామాలకూ బస్సు సౌకర్యంలేదు.

ఆటోలే శరణ్యం

 మండలంలో ఒకప్పుడు ఏమారుమూల ప్రాంతం చూసినా  ఆర్టీసీబస్సులు తిరిగేవి . తరువాత ఏటికేడు  తిప్పడం మానేశారు. దీంతో ప్రయాణికులకు ఆటోలే శరణ్యం అయ్యాయి. ఫలితంగా ఆటోవాలాలు ఆర్టీసీ కన్నా అధిక చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతోంది. దీనికితోడు ఆటో నిండేవరకు గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  పైగా కిక్కిరిసేలా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుండటంతో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి ఆటో ఎక్కినా గమ్యం చేరుతామనే ధీమా లేదు. దీనికి తోడు మండలంలోని అన్ని గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో ఆటోల్లో వెళ్లే వారు సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు నమ్మకంలేదు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, పాలకులు ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి

గ్రామానికి వెళ్లాలన్నా, రావాలన్నా కాలినడకనో, సైకిల్‌పైనో, ఆటోలోనో ప్రయాణించాల్సిందే. రహదారి కూడా అధ్వానంగా ఉంది. ఆటోవాలాలు అధిక ధర వసూలు చేస్తున్నారు.  వెంటనే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి.

 - పగడాల బాల వెంకటేశ్వర్లు, టి.చెర్లోపల్లి


ఆటోలే దిక్కు

గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను చాలా సార్లు కోరాం. నేటికీ అధికారులు, పాలకులూ పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలే దిక్కు. ఆటోవాలాలు చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

 - ఈ.వెంకటేశ్వర్లు, లేళ్ళపల్లి


Updated Date - 2022-01-22T05:16:45+05:30 IST