మమ్మల్ని ఆదుకోరూ..

ABN , First Publish Date - 2020-08-06T09:27:04+05:30 IST

భారత వీల్‌చైర్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నిర్మల్‌ సింగ్‌ థిల్లాన్‌ పాలు ...

మమ్మల్ని ఆదుకోరూ..

గంగూలీకి వీల్‌చైర్‌ క్రికెటర్ల వినతి

న్యూఢిల్లీ: భారత వీల్‌చైర్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నిర్మల్‌ సింగ్‌ థిల్లాన్‌ పాలు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఫాస్ట్‌ బౌలర్‌ సంతోష్‌ బైక్‌ మెకానిక్‌గా, మరో బ్యాట్స్‌మన్‌ పోషన్‌ ధ్రువ్‌ వెల్డింగ్‌ షాప్‌లో పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ జోక్యం చేసుకొని తాము మెరుగైన జీవనం గడిపేలా చర్యలు తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు. లోధా సంస్కరణల ప్రకారం..దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికోసం బీసీసీఐ ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కమిటీ విషయమై ఇటీవలే వీల్‌చైర్‌ క్రికెట్‌ ఇండియా సీఈవోతో గంగూలీ చర్చలు జరిపాడు. తదుపరి చర్యలకు మాత్రం అడుగులు పడలేదు. ‘మాకు సాయం చేస్తానని గంగూలీ హామీ ఇచ్చాడు. దేశంలో వీల్‌చైర్‌ క్రికెట్‌ గురించి అతడికి అవగాహన లేదు. మేం చాలా చక్కగా ఆడుతున్నామని తెలిసి సౌరవ్‌ ఆశ్చర్యపోయాడు’ అని భారత వీల్‌చైర్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సోమ్‌జీత్‌ చెప్పాడు. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసినట్టు.. తమ అభివృద్ధికి కూడా బోర్డు చర్యలు తీసుకోవాలని అతడు కోరాడు. 

Updated Date - 2020-08-06T09:27:04+05:30 IST