Whats app డీపీలతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త..

ABN , First Publish Date - 2022-02-07T21:04:39+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజలను దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు..

Whats app డీపీలతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త..

హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజలను దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట లాటరీ గెలుచుకున్నారని, ఏటీఎం కార్డు అప్‌డేట్‌ చేయాలని ఫోన్‌లు చేసి ఖాతా నంబరు, ఏటీఎం కార్డు నంబర్‌, పిన్‌ నంబర్‌ వంటి సమాచారాన్ని సేకరించి ఖాతాలు ఖాళీ చేసేవారు. ఈ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బిహార్‌, గుజరాత్‌ ప్రాంతాలకు చెందిన వారు తప్పుడు ఫోన్‌ నంబర్లు, నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలు, వాట్సాప్‌ డీపీలు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. వారిని పోలీసులు గుర్తించినా పట్టుకురావడం కష్టసాధ్యమవుతోంది. కొత్త తరహాలో ప్రజలను మోసం చేస్తున్నారు.


వీటికి స్పందించొద్దు

- కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ రిజిస్ర్టేషన్‌ చేస్తామని అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ ఆడిగితే చెప్పొద్దు. 

- అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఓటీపీ, యూపీఐ పిన్‌, మరే ఇతర బ్యాంకు ఖాతా వివరాలు ఆడిగితే  చెప్పకండి

- అప్పా యాప్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయకండి, రిజిస్ర్టేషన్‌, ఇంటర్వ్యూ పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. మీకు ఉద్యోగం ఇచ్చేవారు డబ్బులు ఆడుగుతున్నారంటే అది మోసమని గ్రహించండి.

- లోన్‌, పెట్టుబడి ఆధారిత యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి మోసపోవద్దు. 

- కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో లాటరీ వచ్చిందని వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చినా, కాల్‌ వచ్చినా, ఏదైనా లెటర్‌ వచ్చినా మోసమని గ్రహించండి. ఎవరికీ డబ్బులు కట్టి మోసపోవద్దు.

- అమెజాన్‌ గిఫ్ట్‌ ఆఫర్స్‌ పేరుతో ఏదైనా మెసేజ్‌ వచ్చినా, అనుమానాస్పద నీలిరంగు లింకులు వచ్చినా స్పందించొద్దు. 

- బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టండి. మీకు మూడు లేదా నాలుగు రెట్లు లాభం వస్తుంది అని వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో ఎవరైనా చెబితే మోసమని గ్రహించండి.


డయల్‌ 100కు ఫోన్‌ చేయండి..

సైబర్‌ నేరగాళ్ల బారిన పడిన వారు వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు నేరగాళ్ల బ్యాంకు ఖాతా నిలిపివేయిస్తారు. మీ నుంచి కాజేసిన డబ్బులు డ్రా చేయకుండా ఆపగలరు.


సైబర్‌ నేరాలపై ఫిర్యాదుకు.. హోం శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 155260

సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ టోల్‌ ఫ్రీ నెంబరు 155260తో ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ సైబర్‌ క్రైం డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీ్‌సస్టేషన్‌ అధికారులు స్పందిస్తారు. ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే నేరగాళ్లను పట్టుకోవచ్చు.


సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం

సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సామాజిక మాఽధ్యమాలతో చైతన్యపరుస్తున్నాం. సెల్‌ఫోన్‌కు వచ్చే అనవసర లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు. కస్టమర్‌ సర్వీస్‌, మినీ బ్యాంకు పేరిట జరిగే మోసాలు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పేరిట వచ్చే ఫోన్లు, లింక్‌లకు స్పందించొద్దు, ముఖ్యంగా ఓఎల్‌ఎక్స్‌ పేరిట జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి. మోసపోతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుంది. - కె.సుబ్బిరామిరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌, సైదాబాద్‌.

Updated Date - 2022-02-07T21:04:39+05:30 IST