భారతీయులకు భారీ షాకిచ్చిన వాట్సాప్.. 17 లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం

ABN , First Publish Date - 2022-01-03T02:51:39+05:30 IST

భారతీయులకు వాట్సాప్ భారీ షాకిచ్చింది. ఏకంగా 17 లక్షలకు పైగా ఖాతాలపై నిషేధం విధించింది.

భారతీయులకు భారీ షాకిచ్చిన వాట్సాప్.. 17 లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం

న్యూఢిల్లీ: భారతీయులకు వాట్సాప్ భారీ షాకిచ్చింది. ఏకంగా 17 లక్షలకు పైగా ఖాతాలపై నిషేధం విధించింది. గతేడాది నవంబరు నెలకు సంబంధించి విడుదల చేసిన యూజర్ల భద్రతా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.


ఆ నెలలో 17.59 లక్షల ఖాతాలపై వేటు వేసినట్టు ఆ నివేదికలో పేర్కొంది. యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయా ఖాతాలపై నిషేధం విధించింది. అలాగే, యూజర్ల  నుంచి అదే నెలలో 302 వినతులు కూడా వచ్చినట్టు తెలిపింది. వాటిలో 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. కాగా, అక్టోబరులో 2 మిలియన్లకు పైగా ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వాట్సాప్‌కు ఇండియాలో 400 మిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు.


వినియోగదారుల భద్రతను కాపాడేందుకు ఏళ్ల తరబడి తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, అలాగే, డేటా సైంటిస్టులు, నిపుణులు కూడా పనిచేస్తున్నట్టు పేర్కొంది.


సాధారణంగా సేవల దుర్వినియోగాన్ని గుర్తించేందుకు వాట్సాప్‌లో మూడంచెల వ్యవస్థ ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ చేస్తున్న సమయంలో, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లకు స్పందించడం ఆధారంగా ఖాతాలను గుర్తించి నిషేధిస్తుంటుంది. కాగా, భవిష్యత్ నివేదికల్లో మరింత పారదర్శకంగా సమాచారాన్ని అందిస్తామని వాట్సాప్ తెలిపింది.

Updated Date - 2022-01-03T02:51:39+05:30 IST