బీసీలు ‘అటు’ చూస్తే తప్పేమిటి?

ABN , First Publish Date - 2021-02-04T09:32:15+05:30 IST

మ‍నవాళ్ల చమత్కారం మామూలుగా ఉండదు. అందులో కాసింత కడుపుమంట కూడా కలిసిందా, ఘాటెక్కిన గంధకధూమమే. అంతా చేసి...

బీసీలు ‘అటు’ చూస్తే తప్పేమిటి?

మ‍నవాళ్ల చమత్కారం మామూలుగా ఉండదు. అందులో కాసింత కడుపుమంట కూడా కలిసిందా, ఘాటెక్కిన గంధకధూమమే. అంతా చేసి, ఇప్పుడు చెప్పేది సీమటపాకాయ మాత్రమే, నాటుబాంబు కూడా కాదు. వెక్కిరించడం తప్ప ఇంకేమీ చేయలేమని తెలిసినప్పుడు, అక్కసును అట్లా అక్షరాల్లో తీర్చేసుకోవడం, అదో తుత్తి. విజయం అంటే ఏమిట్రా, అన్న ప్రశ్నకు, రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకుని, ఆ రైలును, స్టేషన్‌ను కూడా అమ్ముకునే స్థాయికి ఎదగడమే సక్సెస్ అంటే..అన్నది జవాబు! ఈ ఫేస్‌బుక్‌ మేమ్ ప్రతిపదార్థం చెప్పుకోనక్కరలేదు, అందులోని సృజనాత్మక ఆక్రోశం అందరికీ అర్థమయ్యేదే. బలశాలి శత్రువుని గేలిచేసే వెక్కిరింతను ఆనందించవచ్చును కానీ, వాస్తవంలో అపహాస్యానికి గురిఅయిందీ అవుతున్నదీ వెటకారం తప్ప మరేమీ మిగలని నిస్సహాయతే! మూడు దశాబ్దాల కిందట ‘కమండల్’కు పోటీగా ‘మండల్’ నిలబడింది. భళా, రాముడికి ఎదురుగా శంబూకుడిని నిలబెట్టాములెమ్మని లౌకికవాదులు, సామ్యవాదులు, సామాజికవాదులు జబ్బలు చరుచుకున్నారు. కాలం గడిచి, కనువిప్పు కలిగేసరికి, శంబూకుడే రాముడి పార్టీలో చేరిపోయాడు. ఇది కదా అసలు చమత్కారమంటే!


ఒక భూస్వామ్య వ్యవసాయిక అగ్రకుల శాసనసభ్యుడు, తనను తాను లౌకికవాదిని అని ప్రకటించుకోవాలనుకున్నాడు. భక్తి నుంచి, రామభక్తి నుంచి అయోధ్యను వేరుచేసి చూపే తరహా వ్యాఖ్యలు చేశాడు. అదే శాసనసభ్యుడు, మరో పక్కన దళిత, బహుజన వర్గాల వారందరినీ కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభా సిద్ధాంతం దశాబ్దాల కిందటే పరాజితమయింది. సామాజిక, ఆర్థిక పెట్టుబడులతో పదవులను, ఉద్యోగాలను, ఇతర హోదాలను సంపాదించేవారు, రిజర్వేషన్ల సాయంతో న్యాయమైన స్థానాలను పొందేవారిని ప్రతిభానైపుణ్యాలు లేనివారని వ్యాఖ్యానించడమంత పనికిమాలిన వాదన మరొకటి ఉండదు. అయినా, లౌకికవాదిగా ఉండదలచిన ఈ అగ్రకులస్థుడు, బడుగుల విషయంలో మాత్రం పరమ కులతత్వవాదిగా నిలబడ్డాడు. ఒకనాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లౌకికవాదాన్ని, బడుగులకు సామాజిక న్యాయాన్ని ఒకే సమీకరణంలో నిలిపి, మతతత్వానికి విరుగుడు రచించాననుకున్నాడు. ఇప్పుడు మరి, మతతత్వం విషయంలో ప్రగతిశీలంగా కనిపించాలనుకునే అగ్రకులస్థులు, సామాజిక న్యాయం విషయంలో మరో రకంగా ఉన్నారా? ఈ వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 


ఒక ప్రత్యేక సంఘటనను సాధారణీకరించడం కాదు. ఒక పక్కన రాముడే శంబూకుడిని ఓదార్చి అభయమిస్తుంటే, అటు రాముడినీ కాదని, శంబూకుడినీ చీదరించి- ఈ తరహా రాజకీయవాదులు, వారి నాయకులు ఎటు ప్రయాణిస్తారన్నది ప్రశ్న. హిందూమతానికి శూద్ర నాయకత్వం లభించినప్పుడు, సామాజిక న్యాయానికి భరోసా లభించినప్పుడు, ఇక లౌకికవాదం బడుగులకు ఎందుకు? అన్ని చోట్లా, అన్ని స్థాయిలలో ఒకే తీరుగా ఉన్నదని చెప్పలేము కానీ, స్థూలంగా చూసినప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రస్తుత అధి నాయకత్వం వెనుకబడిన కులం వ్యక్తి చేతిలో ఉన్నది. అతనితో పాటు చంద్రగుప్తునికి చాణక్యుడు ఉన్నట్టు ఒక అగ్రకుల వ్యూహకర్త ఉన్నాడు. అనేక రాష్ట్రాలలో ఇప్పటిదాకా అధికారాన్ని చవిచూడని సామాజిక వర్గాలకు ఊర్థ్వగతిని కలిగించడమూ, సంప్రదాయికంగా కీలకపదవులు లభించని బిసి కులాలను నాయకత్వంలోకి తీసుకురావడం ఆ ఇద్దరూ చేస్తున్నారు. ఆ ఇద్దరూ ఎగదోస్తున్న భావజాలాల సంగతి పక్కన పెట్టండి. అనేక చోట్ల, వారి ప్రతినిధులు నియంతృత్వానికి, పెత్తందారీతనానికి ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. కొత్త సామాజిక సమీకరణలను ఆవిష్కరిస్తున్నారు. ప్రగతిశీల యథాతథవాదులు ఒకవైపు, సంప్రదాయ పరివర్తనవాదులు మరొకవైపు మోహరించినప్పుడు, చిత్రపటం గందరగోళంగా లేదా? 


సామాజిక న్యాయం ఒక సిద్ధాంతంగా, రాజకీయ ఆయుధంగా ఉత్తరాదిన 1960 దశకం నుంచే మొదలయింది, జనతాప్రయోగంతో దానికి ఊతం దొరికింది. ఆ తరువాతి దశాబ్దాలలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఆ పార్టీలు ఎదిగాయి. సంప్రదాయ ప్రాబల్యశక్తులైన బ్రాహ్మణ, బనియా, క్షత్రియ వర్గాలను అదుపు చేయగలిగాయి.. ప్రాంతీయవాదం దక్షిణాదిన మొదట మొదలయింది. తమిళనాడులో సామాజిక న్యాయం, భాషా జాతీయవాదం కలగలసి ఒక కొత్త మేళవింపును ఇచ్చాయి. ప్రాంతీయవాదం అన్నది ప్రాంతీయ ప్రాబల్యశక్తుల కోరలకు మరింత పదునుపెడుతుందని, బలహీనులకు మరింత ప్రమాదం ఏర్పడుతుందని డాక్టర్ అంబేడ్కర్ చేసిన హెచ్చరిక- ఆంధ్ర, తెలంగాణలకు వర్తించినంతగా తమిళనాడుకు అన్వయించదు. తమిళనాడులో ఒకే బడుగుకులం అధికారశ్రేణిలో ప్రాబల్యం పొందలేదు. రామస్వామి నాయకర్ బలిజ వర్తకుడైతే, అన్నాదురై నేత కులస్తుడు, కరుణానిధి నాయీబ్రాహ్మణుడు. డిఎంకె కోవలో ఏర్పడిన అధికార శ్రేణి, అట్టడుగున ఉన్న దళితుల విషయంలో విచక్షణ చూపిందన్న విమర్శలు ఉన్నాయి కానీ, ఒకే కులానికి అధికార సోపానం దక్కలేదు. సామాజికంగా, ఆర్థికంగా వేర్వేరు కులాలు బలంగా ఉండడం, వారికి కూడా వేర్వేరు రూపాలలో రాజకీయ ప్రాతినిధ్యం ఉండడం వేరు. మద్రాస్ నుంచి వేరుపడాలన్న ఆంధ్రజాతీయవాదం బ్రాహ్మణ-..రెడ్డి నాయకత్వంతో ముందుకు సాగింది. బ్రాహ్మణుల ఆధిపత్యం స్వాతంత్ర్యం వచ్చిన కొద్దికాలానికే తొలగి, అధికార చక్రం రెడ్ల చేతికి వెళ్లింది. రెడ్లకు సమాంతరంగా మరో సామాజిక వర్గం ఎదిగి రావడానికి ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత పాతికేళ్లు పట్టింది. ఇప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలు రెండు ప్రాంతీయ పార్టీల రూపంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మోహరించి ఉన్నాయి. పాలక కుటుంబాలకు చెందినవారు తప్ప మరొకరు ఆ పార్టీలకు నాయకులయ్యే అవకాశమే లేదు, ఇక, ఇతర కులస్థులు ఆ పార్టీలలో అగ్రనేతలయ్యే అవకాశం కానీ, ముఖ్యమంత్రులయ్యే ఆస్కారం కానీ లేదు. తెలంగాణలోనూ అంతే కదా, ఉద్యమపార్టీని ఫక్తు రాజకీయపార్టీగా అనగా కుటుంబ పార్టీగా మలచిన తరువాత, ఇక అదే కుటుంబం నాయకత్వంలో కొనసాగుతుంది. అదే కుటుంబం అనగా అదే సామాజికవర్గం కూడా. పెళ్లీ పిల్లలూ లేని మమతాబెనర్జీ మేనల్లుడిని వారసుడిగా తీర్చిదిద్దుతున్నదట. 


తొలినాళ్లలో కాంగ్రెసే నయం. నెహ్రూ అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి నాయకుడయ్యారు. ఆయన కాయస్థుడు. ఆయన అకాల మరణం జరగకపోతే, బహుశా, కాంగ్రెస్‌లో కుటుంబ పాలన ఏర్పడేది కాదేమో? అయితే, అతి త్వరలోనే ఒక బలమైన నాయకత్వం అవతరించి, నియంతృత్వం చెలాయించకపోతే అధికారపీఠాలు కదిలిపోయే అవకాశముండింది కాబట్టి, ఎవరో ఒకరు జనప్రియ నియంతగా ముందుకు రావడం జరిగేది. అది కుటుంబపాలనకు దారితీసేది. ఏ కారణం చేత అయినా, ఇందిర, రాజీవ్‌ల తరువాత ఇతరులకు అవకాశం దొరికింది. మరి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార రాజకీయాలలో చర్చ- అత్యవసర పరిస్థితులలో అధికారం భార్య చేతికా, తల్లి చేతికా, చెల్లి చేతికా అన్న ప్రశ్న చుట్టూ తిరగడం గమనించవచ్చు. కేంద్రంలో వారసత్వ రాజకీయాలున్నా, రాష్ట్రాలలో వాటిని కాంగ్రెస్ పెద్దగా ప్రోత్సహించలేదు. సామాజికవర్గాల విషయంలో కూడా ఒక్కోసారి సాహసాలు చేసేది. లేకపోతే, దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలిరోజులలోనే ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగేవారు? టంగుటూరు అంజయ్యను ఎట్లా ఎంపిక చేసేవారు? ప్రాంతీయ వారసులను ఎంతో కొంత ప్రోత్సహించినా, వారు తిరిగి విధేయతను నిరూపించుకోవలసి వచ్చేది. జగన్మోహనరెడ్డి ఆ విషయంలోనే కాంగ్రెస్‌ను అర్థం చేసుకోలేక భంగపడ్డారు. ప్రాంతీయ పార్టీ పెట్టి లాభపడ్డారు. ఇప్పుడు మరో శక్తి ఏదన్నా రాకపోతే, రెండు కుటుంబపార్టీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిసిలకు, ఎస్సీలకు అధికార ప్రాప్తం లేనట్టే. తెలంగాణలో యాభైశాతం అదే పరిస్థితి. అక్కడ కూడా మరో ప్రాబల్య సామాజికవర్గం ప్రాంతీయ పార్టీ పెట్టి, ప్రత్యామ్నాయంగా మారితే, తెలంగాణలో కూడా బిసిలకు, ఎస్‌సి, ఎస్‌టిల పరిస్థితి శాశ్వత అనుచరత్వమే. ఇంకా అది జరగలేదు కాబట్టి, మైదానం ఆటకు ఇంకా అనువుగానే ఉన్నది. 


భూస్వామిక భావాలను ఆదరిస్తుందని, మతతత్వ మెజారిటేరియనిజాన్ని అనుసరిస్తుందని విమర్శలు ఉన్న భారతీయ జనతాపార్టీ, వారసత్వ రాజకీయాలను నిరంతరం విమర్శిస్తుంది. దానితో పాటు, బడుగు వర్గాలకు నాయకత్వం అప్పగించే చొరవ కూడా చూపుతున్నది. ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రాబల్య సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో రాష్ట్ర నాయకత్వాన్ని బిసి చేతిలో పెట్టి, దాని వల్ల కలుగుతున్న ఫలితాలను కళ్లారా చూస్తున్నది. ప్రాబల్య సామాజిక వర్గాలు తెలంగాణ బిజెపిలో ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో సామాజిక వైవిధ్యం ఉన్నది కానీ, అధిష్ఠానానికి ఏ ధైర్యమూ లేదు. ఎవరో ఒక రెడ్డిని నాయకత్వానికి ఎంపిక చేసే సంసిద్ధతే లేదు, ఇక బిసిని, ఎస్‌సిని వారు నియమిస్తారా? నాయకులతో కిటకిటలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఏ మేరకు కోమా నుంచి మేలుకుంటుందో తెలియదు కానీ, ఈ లోగా, బిసి నాయకత్వంలో బిజెపి పరుగులు తీస్తోంది. 


అగ్రకులాల సెక్యులరిస్టు పార్టీలలో తమకు ఏ భవిష్యత్తూ లేనప్పుడు, పైగా వారి అంతరంగాల్లో కులతత్వమే ఉన్నప్పుడు, బిసిలు కానీ, మరే బడుగు శ్రేణి కానీ, మతతత్వం వైపు మళ్లితే ఎట్లా తప్పు పట్టగలం? ఆయా పార్టీల అగ్రనేతలు ఆలోచించవలసిన విషయం ఇది. వారే కాదు. అగ్రకుల నాయకత్వంలోని కుటుంబ, ప్రాంతీయ పార్టీలలో క్రియాశీలంగా, అంకితభావంతో పనిచేస్తున్న వెనుకబడిన కులాల నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఎంతకాలం కంచిగరుడ సేవలు? ఆచితూచి అడుగు వేయాలి నిజమే కానీ, కాగల కార్యం గంధర్వులే పూర్తిచేసే ప్రమాదం ఉన్నది. ప్రగతిశీల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు- అన్నిటిలో ముందున్నా ఫలితం మాత్రం శూన్యం. నాయకులు చొరవ తీసుకోకపోవడం వల్లనే కదా, వారి వెంట ఉన్నశ్రేణులు మరోవైపు చూడడం? నాయకత్వాన్ని కొన్ని కుటుంబాలకు వదిలిపెట్టి పరాధీనులుగా మెలగితే, ఎదగాలన్న ఆకాంక్ష ఉన్న శ్రేణులు, ఏ విచక్షణా లేకుండా తోచిన దారిన ప్రయాణిస్తాయి మరి! ఆరోగ్యకరమైన, ప్రజాహితమైన రాజకీయాలు కావాలి. ఆ ఖాళీ సిద్ధంగా ఉన్నది. ఏ మతతత్వ, వారసత్వ, కుటుంబ రాజకీయ సంస్థలకూ అవసరం లేని ఖాళీ అది. భర్తీ చేసేవారుంటే వారిదే భవిష్యత్తు!


కె. శ్రీనివాస్

Updated Date - 2021-02-04T09:32:15+05:30 IST