బైక్‌పై ముగ్గురు వెళ్తే తప్పేంటి? ఎస్‌బీఎస్పీ చీఫ్

ABN , First Publish Date - 2022-02-09T22:55:33+05:30 IST

ఒక రైలు కోచ్‌లో 70 సీట్లు ఉంటాయి. కానీ 300 మంది ప్రయాణిస్తారు. మరిక్కడ చలాన్లు వేయరు. అదే బైక్‌పై ముగ్గురు వెళ్తే చలాన్లు వేస్తారు. ఇదెక్కడి న్యాయం? మా ప్రభుత్వం అధికారంలోకి..

బైక్‌పై ముగ్గురు వెళ్తే తప్పేంటి? ఎస్‌బీఎస్పీ చీఫ్

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం బైక్‌పై ముగ్గురు అంతకు మించి ప్రయాణిస్తే నేరం. ఇలా కనిపించిన వారికి చలాన్లు వేయడం, చట్టా ప్రకారం శిక్ష విధించడం తెలిసిందే. అయితే రైలులో 300 మంది వెళ్లినప్పుడు బైక్‌పై ముగ్గురు వెళ్తే తప్పేంటని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ ప్రశ్నించారు. అంతే కాదు.. ఒకవేళ బైక్‌పై ముగ్గురు వెళ్లారని జరిమానా విధిస్తే.. రైలులో ప్రయాణించే వారికి కూడా జరిమానా విధించాలని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘‘ఒక రైలు కోచ్‌లో 70 సీట్లు ఉంటాయి. కానీ 300 మంది ప్రయాణిస్తారు. మరిక్కడ చలాన్లు వేయరు. అదే బైక్‌పై ముగ్గురు వెళ్తే చలాన్లు వేస్తారు. ఇదెక్కడి న్యాయం? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బైక్‌పై ముగ్గురు వెళ్లడానికి అనుమతి ఇస్తాం. లేదంటే రైలు, బస్సులో పరిమితికి మించి ప్రయాణించినా చలాన్లు విధిస్తాం’’ అని అన్నారు.


సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఎస్‌బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. ఎస్పీ-ఆర్‌ఎల్డీ-ఎస్‌బీఎస్సీ కలిసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10న ప్రారంభమై మార్చి 7 వరకు ఏడు విడతల్లో జరగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి.

Updated Date - 2022-02-09T22:55:33+05:30 IST