ఖాళీ నేతలతో ఒరిగేదేమిటి?

ABN , First Publish Date - 2022-09-18T05:38:01+05:30 IST

‘‘చంద్రబాబు కట్టని, కట్టలేని రాజధాని అమరావతిని నన్ను కట్టమంటే ఎలా? డబ్బులు లేవు గానీ.. చేతిలో డబ్బులు ఉండి ఉంటే అమరావతిని కట్టేవాడినే!’’ ..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ఇది...

ఖాళీ నేతలతో ఒరిగేదేమిటి?

‘‘చంద్రబాబు కట్టని, కట్టలేని రాజధాని అమరావతిని నన్ను కట్టమంటే ఎలా? డబ్బులు లేవు గానీ.. చేతిలో డబ్బులు ఉండి ఉంటే అమరావతిని కట్టేవాడినే!’’ ..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ఇది. జగన్‌ నోటి వెంట ఇంత బేలతనంతో కూడిన మాటలు రావడం ఆశ్చర్యంగా ఉంది. మంత్రులు, శాసనసభ్యులు చేస్తున్న భజన చూస్తుంటే జగన్‌కు ఏదైనా సాధ్యమే అన్న భావన ఏర్పడింది. వీరుడు, శూరుడు, పులివెందుల పులి అని కీర్తించబడిన ముఖ్యమంత్రికి లక్ష కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యం కాదా? బటన్‌ నొక్కడం ద్వారా మూడేళ్లలో లక్షా 65 వేల కోట్ల రూపాయలు పంచిపెట్టినట్టు స్వయంగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రికి లక్ష కోట్లు ఒక లెక్కా? ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటి చేత్తో 151 సీట్లు గెలుచుకున్న జగన్‌రెడ్డి అమరావతిని నిర్మించలేరంటే నమ్మగలమా? శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నమశక్యంగా లేవు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అయిదంటే అయిదేళ్లలోనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జగన్‌రెడ్డి ఇప్పుడు తానే ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజధానిని కట్టలేనని చెబితే ఎవరైనా నమ్ముతారా? పద్దెనిమిది సంవత్సరాలు వెనక్కి వెళితే జగన్‌ శక్తి సామర్థ్యాలు ఏపాటివో తెలుస్తుంది. 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్మోహన్‌ రెడ్డి సామాన్యుడు మాత్రమే. చేసిన వ్యాపారాలు కూడా పెద్దగా లేవు. బడా కాంట్రాక్ట్‌ కంపెనీల వద్ద కోటి నుంచి ఐదు కోట్ల రూపాయల విలువైన పనులను సబ్‌ కాంట్రాక్టుకు చేసేవారు. అప్పుడే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో సండూర్‌ పవర్‌ కంపెనీ ఏర్పాటుకు జగన్‌కు అవకాశం లభించింది. అయితే చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో రాజశేఖర రెడ్డి నివాసం ఉన్న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2 లోని ఇంటిని తాకట్టుపెట్టి అప్పు ఇవ్వవలసిందిగా తెలిసిన వారందరి చుట్టూ తిరిగారు. అయితే తండ్రి చేతిలో అధికారం ఉండటంతో అప్పు చేసే అవసరమే లేకుండా కంపెనీల మీద కంపెనీలు ఏర్పాటు చేయడం ఎలాగో జగన్‌కు తెలిసిపోయింది.


అంతే, జగన్మోహన్‌ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం మర్రిచెట్టులా విస్తరించింది. అప్పటి వరకు జగన్‌ను పట్టించుకోని బడా కంపెనీలకు చెందినవారు ఆయన కంపెనీలలో ఉచితంగా ఎడాపెడా పెట్టుబడులు పెట్టడానికి బారులు తీరారు. దీంతో సొంత డబ్బు లేకుండానే, అప్పు చేయకుండానే అనేక కంపెనీలను జగన్మోహన్‌ రెడ్డి శరవేగంగా ఏర్పాటు చేశారు. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. జగన్‌ సారథ్యంలో ప్రారంభమైన నీలి మీడియాలో ఆయన జేబు నుంచి ఎంత పెట్టుబడి పెట్టారో తెలియదు. సీబీఐ కేసులలో ఇరుక్కున్న అనేక కంపెనీలు జగన్‌ మీడియాలో పెట్టుబడులు పెట్టాయి. అప్పటివరకు దేశంలో ప్రారంభమైన ఏ మీడియా సంస్థలో కూడా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ బారులు తీరలేదు. మీడియా వ్యాపారం నష్టాలతో కూడుకున్నదని పారిశ్రామికవేత్తలు ఎవరూ ఆ రంగం వైపు చూసేవారు కాదు. అంతెందుకు 2000 సంవత్సరంలో మూతపడిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి అప్పుడు అధికారంలో ఉన్నవారు కోరినా కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రాజశేఖర రెడ్డి అధికారంలో లేరు గనుక జగన్మోహన్‌ రెడ్డి కూడా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను తీసుకోవడానికి ముందుకు రాలేదు. తండ్రి చేతికి అధికారం రాగానే ఆయనలోని వ్యాపారవేత్త జడలు విప్పి నాట్యం చేయడం మొదలుపెట్టారు. 2004లో అధికారంలోకి వచ్చి ఉండకపోతే రాజశేఖర రెడ్డి దివాలా తీసి ఉండేవారన్న విషయం ఆ కుటుంబం గురించి తెలిసినవారందరికీ ఎరుకే. రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి జగన్మోహన్‌ రెడ్డి డజన్ల సంఖ్యలో కంపెనీలు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో రాజప్రాసాదాలు నిర్మించుకున్నారు. అప్పటివరకు కొన్నిచోట్ల అద్దె భవనాల్లో ఉన్న జగన్‌ మీడియా సంస్థలను సొంత భవనాల్లోకి మార్చారు. సండూరు పవర్‌ కంపెనీ కోసం తాకట్టు పెట్టాలనుకున్న ఇంటి స్థానంలో భారీ భవనాన్ని నిర్మించారు. నెలనెలా కోట్ల రూపాయల అద్దెలు తెచ్చిపెట్టే భవనాలు నిర్మించుకున్నారు. భారీ పెట్టుబడితో భారతీ సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీకి కేటాయించుకున్న సున్నపురాయి నిక్షేపాల పుణ్యమా అని భారతీ సిమెంట్‌ కంపెనీలో కొంత వాటాను భారీ ప్రీమియంకు అమ్ముకోగలిగారు. ఇలా ఐదంటే ఐదేళ్లలో జగన్‌ వ్యాపార సామ్రాజ్యం నలుదిశలా విస్తరించింది. అది చూసి వ్యాపార దిగ్గజాలు నోరెళ్లబెట్టారు. ఇంతలో హెలికాప్టర్‌ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణించారు. దీంతో అధికారం చేతిలో ఉంటే ఎంతలా అభివృద్ధి చెందవచ్చో అమలు చేసి చూపించిన జగన్‌రెడ్డికి తానే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? అన్న ఆలోచన వచ్చింది. తన కోరిక తీర్చడానికి కాంగ్రెస్‌ పార్టీ నిరాకరించడంతో సొంతంగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఐదేళ్లలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగిన జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అమరావతిని నిర్మించలేరా? అది కూడా రైతులు అప్పనంగా ఇచ్చిన 35 వేల ఎకరాలు చేతిలో పెట్టుకొని లక్ష కోట్లతో నిర్మాణాలు చేపట్టలేరా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చల్లని దీవెనలతో ఎడాపెడా అప్పులు చేస్తూ బటన్లు నొక్కుతున్న జగన్‌, ఆ చేత్తోనే అమరావతి కోసం అప్పు చేయలేరా?


అబ్బే.. ఆయనకు అసాధ్యమా?

ప్రధాని మోదీకి జగన్‌రెడ్డి దత్తపుత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుల్లోనే ఒకరైన నరేంద్ర మోదీ అండదండలు పుష్కలంగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డికి అసాధ్యం అంటూ ఉంటుందా? అసాధ్యాలను సుసాధ్యం చేయడం జగన్‌కే సాధ్యమని ఆయన పార్టీ వాళ్లు నిత్యం చిడతలు కొడుతూ ఉంటారు కదా! ఎవరో చెబితేగానీ ఆంజనేయుడికి తన శక్తి ఏమిటో తెలియదట. జగన్‌కు కూడా తన శక్తి ఏమిటో ఎవరైనా చెబితేగానీ తెలియదేమో! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, సొంత పెట్టుబడి అవసరం లేకుండా వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్న జగన్‌, నాటి రోజులను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే అమరావతి నిర్మాణానికి నిధులు రాబట్టలేరా? అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని శుక్రవారంనాడు శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రికి ఇంకా ఇబ్బందేమిటి? జంధ్యాల సినిమా ఒకదానిలో నటుడు కోట శ్రీనివాసరావు ఎవరు ఏమడిగినా ‘..నాకేంటి?’ అంటుంటాడు. అలాగే రాజధాని నిర్మిస్తే నాకేంటి? అని జగన్మోహన్‌ రెడ్డి ఆలోచిస్తున్నారేమో తెలియదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈ కోణంలో ఆలోచిస్తే జగన్మోహన్‌ రెడ్డిలోని శక్తిసామర్థ్యాలు బయటికొస్తాయేమో! తాకట్టు పెట్టడానికి ఆస్తులు లేకపోయినా పరుల సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్న జగన్‌, వేల ఎకరాలు అందుబాటులో ఉన్నా అప్పు పుట్టించలేరంటే ఎవరైనా నమ్ముతారా? అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట వింత నాటకం ఆడుతున్న జగన్‌కు చేతగాక కాదు– ఉద్దేశపూర్వకంగానే అమరావతిని చంపేశారని అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడేళ్లయినా రాజధానిని నిర్మించలేదని చంద్రబాబును విమర్శించిన జగన్‌, తాను అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండమైన రాజధానిని కడతానని చెప్పలేదా? రాజధాని అంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఎక్కడ ఉంటుందో అదే రాజధాని అని చెప్పలేదా? ఐదారేళ్లుగా ఈ మూడూ ఒకేచోట ఉన్న అమరావతిని ఇప్పుడు రాజధాని కాదు అంటే ఎలా? గురు, శుక్రవారాల్లో శాసనసభలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనలు వినే వారికి కంపరం కలిగించాయి. జగన్‌ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని అందరూ అంటుంటే, జగన్‌రెడ్డి మాత్రం కొన్ని మీడియా సంస్థల వల్ల రాష్ట్రం నాశనం అయిందని అంటున్నారు. ఒకే రాజధాని అనే నినాదం కుట్రపూరితమైనదని కూడా ఆయన అంటున్నారు. అదే నిజం అనుకుందాం. మూడున్నరేళ్లయినా ఆయన చెబుతున్న మూడు రాజధానులు ముందుకు కదలకపోడానికి కారణం ఏమిటో చెప్పాలి కదా? అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమే గానీ రాష్ట్రంలో అభివృద్ధే లేనప్పుడు వికేంద్రీకరణకు తావుంటుందా? జగన్మోహన్‌ రెడ్డి తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నమ్మాల్సిందే. తనపై నమోదైన అవినీతి కేసులలో పుష్కర కాలం దాటినా విచారణ జరగకుండా అడ్డుకుంటున్న జగన్‌కు అసాధ్యం ఉంటుందా? గాలి జనార్దన్‌ రెడ్డి కేసులలో పన్నెండేళ్లవుతున్నా విచారణ ప్రారంభం కాకపోవడం ఏమిటి? అని సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తంచేసింది. జగన్‌ కేసులలో కూడా అదే దుస్థితి ఏర్పడిందని సుప్రీంకోర్టుకు తెలియదేమో! అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ఏడాదిలోగా తేలిపోవాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టంచేసినా జగన్మోహన్‌ రెడ్డి మాత్రం చిద్విలాసంగా ఉండగలుగుతున్నారంటే ఆయన శక్తిసామర్థ్యాలు ఏపాటివో తెలియడం లేదా? వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయినా ఫైనల్‌ చార్జిషీటు దాఖలు చేయకుండా, అసలు నిందితులను అరెస్టు చేయకుండా అడ్డుకోగలుగుతున్న జగన్‌కు అసాధ్యం అంటూ ఉంటుందా? అక్కడిదాకా ఎందుకు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించకూడదని కోరుతూ లేఖ రాసిన ఇదే జగన్మోహన్‌ రెడ్డి, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాగానే స్వాగత సత్కారాలు ఏర్పాటుచేసి సతీసమేతంగా వెళ్లి మరీ మంతనాలు జరపగలిగారే! జగన్‌ ఘటనాఘటన సమర్థుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? జగన్‌ మాటల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. జీడీపీ వృద్ధిరేటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో ఉంది. ఇప్పటివరకు చెప్పుకొన్న అంశాలు అన్నింటినీ గమనిస్తే జగన్‌ విషయంలో ఒకటి స్పష్టమవుతోంది. ఆయనకు అపారమైన తెలివితేటలు ఉన్నాయి. శక్తిసామర్థ్యాలకు కొదవ లేదు. అయితే అవేమీ జనబాహుళ్యానికి ఉపయోగపడటం లేదు. రాజకీయంగా, ఆర్థికంగా తాను అభివృద్ధి చెందడానికి మాత్రమే జగన్‌ తన శక్తిసామర్థ్యాలు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. తన అధికారం, పలుకుబడి, డబ్బు.. అన్నీ సొంత అవసరాలకే వినియోగిస్తారు. మనసంతా కపటమే కనుక అమరావతిలో ఒకే కులం కనబడుతోంది. రాష్ర్టానికి రాజధాని లేకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా ఆయనకు ఏ చీకూ చింతా ఉండదు. తన వ్యాపారాలు, తన కుటుంబం మాత్రమే బాగుండాలి. తల్లీ చెల్లీ ఏమైపోయినా ఫర్వాలేదు. ఆర్థికంగా మరింత ఎదగడానికి అధికారం కావాలి కనుక సంక్షేమం పేరిట అప్పు చేసి మరీ పంపకాలు చేస్తున్నారు. విధి వికటించి అధికారం పోతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయన నివసించకపోవచ్చు. హైదరాబాద్‌, బెంగళూరులో ఆయనకు రాజప్రాసాదాలు ఉన్నాయి. ఆ నగరాల్లోనే వేల కోట్ల ఆస్తులూ ఉన్నాయి. అందుకే ఆయనకు ఏ దిగులూ ఉండదు. కష్టం వస్తే ఆదుకోవడానికి పైన ప్రధానమంత్రి మోదీ ఎలాగూ ఉన్నారు. ఓట్లు వేసి అధికారం కట్టబెట్టడానికి అమాయక ప్రజలు ఉన్నారు. బాధ్యత తెలియని రాజకీయ నాయకుడు ఎవరికైనా ఇంతకంటే ఏం కావాలి? రాజధాని అమరావతి నిర్మించకపోయినా ఫర్వాలేదు. రాసిపెట్టి ఉంటే ఎవరో ఒకరు నిర్మిస్తారు. అడిగిందే తడవుగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలను అవమానించే అధికారం ముఖ్యమంత్రికి, మంత్రులకు, వారి వందిమాగధులకు ఎక్కడిది? ఎవరు ఎవరికి పుట్టారన్నది చర్చించడానికా అసెంబ్లీ ఉన్నది? తన భార్యను వివాదాల్లోకి లాగడంపై మనసు కష్టపెట్టుకున్న జగన్మోహన్‌ రెడ్డి ఇతరుల మనోభావాలు కూడా అదే విధంగా గాయపడతాయని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యర్థుల ఆర్తనాదాలు ప్రస్తుతం జగన్మోహన్‌ రెడ్డికి శ్రవణానందంగా ఉండవచ్చును గానీ భవిష్యత్తులో తనకు కూడా అదే దుర్గతి పట్టవచ్చునని గ్రహిస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్‌ సమాజంలో ప్రస్తుతానికి జడత్వం ఏర్పడి ఉండవచ్చు. పరిస్థితులు ఇలాగే ఉండవు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట జగన్‌ చేసిన ప్రకటనపై మేధావులుగా చెప్పుకొంటున్న వారు స్పందించకపోవచ్చును గానీ ప్రజలు మాత్రం అందరినీ గమనిస్తారు. సరైన సమయంలో స్పందిస్తారు. అప్పటివరకు జగన్‌ వంటి వారి వదరుబోతుతనం కూడా చెల్లుబాటు అవుతుంది.


కేసీఆర్‌ జాతీయ ఆశలు!

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు వద్దాం. జాతీయ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ పనిలో బిజీగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు. తన నాయకత్వం కోసం దేశమంతా ఎదురుచూస్తోందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రైతులు, రైతు నాయకుల పేరిట ఆ మధ్య ఉత్తరాదికి చెందిన కొంతమందిని సొంత ఖర్చులతో రప్పించుకొని అతిథి మర్యాదలు చేసి వారంతా తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రకటించారు. ఇప్పుడు స్వరాష్ర్టాలలో కాలం చెల్లిన మాజీ ముఖ్యమంత్రులను విమానాలు పంపి పిలిపించుకొని తనను నాయకత్వం వహించవలసిందిగా వారంతా కోరుతున్నట్టుగా ప్రకటనలు జారీ చేయిస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సిన్హ్‌ వాఘేలా ప్రస్తుతానికి ఈ జాబితాలో ఉన్నారు. కర్ణాటకలో కుమారస్వామి నానాటికీ బలహీనపడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొద్దికాలం పనిచేసిన శంకర్‌ సిన్హ్‌ వాఘేలాను ఆ రాష్ట్ర ప్రజలే మరచిపోయారు. ఇలాంటి వారందరినీ పోగేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌ను చూసి అనేక మంది జాలిపడుతున్నారు. ఆ మధ్య అట్టహాసంగా బిహార్‌ వెళ్లొచ్చారు. ఆ వెంటనే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ జాతీయ రాజకీయాల్లో తానే చక్రం తిప్పుతానని ప్రకటించారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరించే విషయం అటుంచి తన నాయకత్వంలో ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఆయన ప్రయత్నాలు మొదలెట్టారు. అయినా పట్టువదలని విక్రమార్కుడి వలె తప్ప తాలును పోగేసే పనిలో కేసీఆర్‌ ఉన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని, త్వరలోనే కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పడుతుందని నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అంటే తాను దేశానికి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రస్తుతానికి కమ్యూనిస్టులను చేరదీసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడం కోసం విజయవాడ వెళ్లడానికి కూడా సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కమ్యూనిస్టులు బలహీనపడిన విషయం తెలిసిందే. ఒకప్పుడు కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉన్న పశ్చిమబెంగాల్లో ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్‌కు ఎంతో మంది ఆప్తులు దూరమయ్యారు. దీంతో ఇప్పటివరకు తాను దూరం పెట్టిన కమ్యూనిస్టులను అక్కున చేర్చుకుంటున్నారు. కేసీఆర్‌ రాజకీయాలు అలాగే ఉంటాయి. అందుకే జాతీయ స్థాయిలో ఆయనకు విశ్వసనీయత తక్కువ. శంకర్‌ సిన్హ్‌ వాఘేలా, కుమారస్వామి వంటి ఖాళీగా ఉన్నవారే ఆయన పిలవగానే వాలిపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పోల్చితే ప్రతిపక్షాలన్నీ ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంఖ్యాపరంగా తాను బలహీనమైనప్పటికీ తన వద్ద ఉన్న ధన బలంతో వివిధ రాష్ర్టాల్లోని చిన్నా చితకా పార్టీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఉచిత విద్యుత్‌, ఉచిత మంచినీరు వంటి నినాదాలతో దేశ ప్రజలు అందరినీ తన వైపు తిప్పుకోగలనని కేసీఆర్‌ నమ్ముతున్నారట. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని తాను చేసిన ప్రకటనకు విశేష స్పందన వస్తున్నదని ఆంగ్ల పత్రికలలో, ప్రాంతీయ పత్రికలలో కథనాలు రాయించుకొని అదే నిజమని నమ్ముతూ కేసీఆర్‌ మురిసిపోతున్నారు. నరేంద్ర మోదీ వంటి నియంత పాలన పోవాలని కేసీఆర్‌ పిలుపునిస్తున్నారు. ప్రధాని మోదీ అనేక విషయాల్లో నియంతలా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ అంతకు మించి నియంతలా వ్యవహరించడం నిజం కాదా? కర్తవ్యం సినిమాలో విలన్‌ పాత్రధారి పుండరీకాక్షయ్య తాను హత్యచేయాలనుకున్న వారిని ఉద్దేశించి, ‘నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది’ అని అంటుంటారు. కేసీఆర్‌ భౌతికంగా హత్యలకు పాల్పడకపోయినా గిట్టని వారిని రాజకీయంగా, ఆర్థికంగా మట్టుబెడుతున్నారు. ఈటల రాజేందర్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాత ఈటలను ఆర్థికంగా నిలదొక్కుకోలేని విధంగా కేసీఆర్‌ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అమ్ముకుందామనుకున్నా ఆయన ఆస్తులను ఎవరూ కొనకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రజా బలంతో హుజూరాబాద్‌లో గెలిచినప్పటికీ శాసనసభలో రాజేందర్‌ ముఖం చూడ్డానికి కూడా కేసీఆర్‌ ఇష్టపడటం లేదు. స్పీకర్‌ను ఉద్దేశించి వాడిన ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని తాజాగా సభ నుంచి ఈటలను సస్పెండ్‌ చేశారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించి ప్రత్యర్థులను ప్రధాని మోదీ భయపెడుతున్నారని నిందిస్తున్న కేసీఆర్‌ చేస్తున్నది ఏమిటి? తనను ధిక్కరించే రాజకీయ ప్రత్యర్థులను కేసీఆర్‌ ముప్పుతిప్పలు పెట్టడం లేదా? ప్రజాస్వామ్య వాసన గిట్టని కేసీఆర్‌కు, ఇతరులను నియంతలుగా నిందించే అర్హత ఉంటుందా? కేవలం ధన బలంతోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పవచ్చునని కేసీఆర్‌ భావిస్తే అంతకంటే అవివేకం ఉండదు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా అలాగే పోతుంది. చేతిలో డబ్బు పడనిదే జిందాబాద్‌లు కొట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాని రోజులివి. అలాంటిది కేసీఆర్‌ నాయకత్వం కోసం నిజంగా కలవరిస్తే వారు కేసీఆర్‌ వద్ద ఉన్న డబ్బును ఆశించినట్టుగానే భావించాలి. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని ప్రకటించగానే కొంతమంది చిల్లరగాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని కేసీఆర్‌ బాధపడుతున్నారు గానీ, భవిష్యత్తులో ఆయనకే తత్వం బోధపడుతుంది. గుజరాత్‌, కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. తాను ప్రకటించనున్న జాతీయ పార్టీ అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవడానికి కేసీఆర్‌ ముందుగా ప్రయత్నిస్తే జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలిసివచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్య ఓట్ల చీలిక జరగకపోతే జాతీయ రాజకీయాల మాట అటుంచి తెలంగాణలోనే కేసీఆర్‌ పాలనకు ముగింపు పలకడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా, కొత్త భవనాలకు ఎవరి పేర్లు పెట్టినా తెలంగాణ ప్రజలు ఆయనను విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. బహుశా తెలంగాణ ప్రజల మనసు తెలిసిందేమో. అందుకే జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్‌ కలవరిస్తున్నట్టుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంటా బయటా పరాభవం ఎదురుకాకుండా చూసుకోగలిగితే అదే కేసీఆర్‌ సక్సెస్‌గా చెప్పుకోవచ్చు. ఆల్‌ ద బెస్ట్‌ కేసీఆర్‌!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-09-18T05:38:01+05:30 IST