ఉరితీతకు తొందరెందుకు

ABN , First Publish Date - 2020-02-19T06:10:52+05:30 IST

నిర్భయ నిందితులు నలుగుర్నీ ఒకేసారి ఉరితీయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ అప్పీలును వెంటనే వినాల్సినంత అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఓవైపు నిందితులు ఉరికంబమెక్కకుండా న్యాయప్రక్రియలో లొసుగుల్ని...

ఉరితీతకు తొందరెందుకు

ఉరిశిక్ష పడిన నిందితుడు ఒక వ్యక్తిగా బతికే హక్కు కోసం చివరి క్షణం వరకూ ‘బతుకు పోరాటం’ చేయవచ్చనీ న్యాయ శాస్ర్తం ప్రవచిస్తున్నది. చావుబతుకుల సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న దురదృష్టవంతుణ్ని చూసి జాలి పడాల్సింది పోయి, వెంటనే వాడి ఉసురు తీసేయాలని డిమాండు చేయడం నాగరిక లక్షణం కాదు. ‘రూల్‌ ఆఫ్‌ లా’ను పాలకులే కాదు, పాలితులూ పాటించాల్సిందే!


నిర్భయ నిందితులు నలుగుర్నీ ఒకేసారి ఉరితీయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ అప్పీలును వెంటనే వినాల్సినంత అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఓవైపు నిందితులు ఉరికంబమెక్కకుండా న్యాయప్రక్రియలో లొసుగుల్ని అడ్డం పెట్టుకుని తాత్సారం చేస్తున్నారని నిర్భయ తల్లి వాపోతుండగా, మరోవైపు అత్యాచార దోషుల్ని అప్పీలుకు కూడా అవకాశమివ్వకుండా తక్షణమే చంపేయాలని సమాజంలో కొందరు వాదిస్తున్నారు. మృగాళ్ళ అణచివేతకు ఆటవిక న్యాయం అమలు చేయాలని సమాజం కోరుతున్నది! ఇదే జరిగితే, రాజ్యాంగం హమీ పడిన ‘స్వచ్ఛ విచారణ’ (ఫెయిర్‌ ట్రయల్‌) సూత్రానికి గండి కొట్టడమే అవుతుంది కదా? ప్రస్తుత చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాకపోయినా, ప్రజాభిప్రాయానికి తలొగ్గి చట్టం చేసే ప్రయత్నాలు జరిగితే అవి రాజ్యాంగ మూలధర్మమైన ‘బ్రతికే హక్కు’ను హరించటమేకదా? 


అసలు ఇలాంటి డిమాండ్లు పుట్టుకు రావడానికి కారణమెవరు?

మెడకు ఉరి బిగించి మరణ శిక్ష అమలు చేయటం అమానవీయమని పరమేశ్వరన్‌ నంబూద్రి అనే స్వాతంత్ర్య సమరయోధుడు సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. అయితే ‘ఉరి శిక్ష’ సుఖమైన చావును ప్రసాదిస్తుందని, ఈ రకమైన శిక్ష సబబేనని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది కూడా. ఇండియన్‌ పీనల్ కోడ్‌లో, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో, జైలు మాన్యువల్‌లోనూ ఉరితీతనే అమలు చేసేందుకు అవకాశాలుండగా, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సంబంధించిన సైనిక చట్టాలలో మాత్రం, కోర్టు మార్షల్‌ విచక్షణ మేరకు, ఉరి ద్వారా కాకుండా, తుపాకీతో కాల్చి చంపటానికి కూడా అవకాశముంది.


ఇదిలావుండగా అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే మరణ దండన విధించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకూ ‘అత్యంత అరుదైన సందర్భాలు’ అంటే ఏమిటో విశదీకరించే విధి విధానాలను రూపొందించలేదు. దీంతో జడ్జీల ఇష్టాయిష్టాల మేరకు మరణ శిక్ష విధించటం సంప్రదాయంగా మారింది. ఇది రూల్‌ ఆఫ్‌ లాను పటిష్ఠంగా అమలు చేసేందుకు దోహడం చేయదు. శిక్ష విధింపులో కోర్టుకున్న ‘విచక్షణ’ను వమ్ము చేసే ప్రయత్నాలను గతంలో కోర్టులు తూర్పారపట్టాయి. జీవితఖైదు అనుభవించే వ్యక్తి హత్యానేరానికి పాల్పడితే మరణ దండన విధించాలన్న ఐపిసి లోని సెక్షను 303ను కోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించటమే ఇందుకు ఉదాహరణ. అలాగే ఆయుధాల చట్టంలో సెక్షను 27(3) తరహా నేరాలకు మరణశిక్ష తప్పని సరికాదని దల్బిర్‌సింగ్‌ కేసు (2012)లో కోర్టు స్పష్టం చేసింది. నేరమూ శిక్షా ప్రక్రియలో కోర్టు విచక్షణకు ఉన్న ప్రాధాన్యతను ఈ తీర్పులు వెల్లడిస్తాయి.


ఇక ఉరి అమలు కోసం శతృఘ్న చౌహాన్‌ (2014) కేసులో సుప్రీం ధర్మాసనం కొన్ని మార్గ దర్శకాలు జారీ చేసింది. ఉరి భాయమైన నేరస్థుడికి ఉచిత న్యాయసహాయాలు ఏర్పాటు చేయాలి. అప్పీలు నుండి రాష్ట్రపతి క్షమాభిక్ష అర్జీ వరకూ... అంతెందుకు ఉరికంబం ఎక్కే చివరి క్షణందాకా అతనికి న్యాయ సహాయం అందుతూనే వుండాలి. భాయమైన ఉరితీతకు 14 రోజుల ముందే అతనికి ఉరి తేదీ తెలియజేయాలి ఈ గడువులో అతను బంధుమిత్రులతోనూ, న్యాయవాదితోనూ సంప్రదించటానికి అవకాశాలివ్వాలి. మానసికంగా మరణాన్ని ఆహ్వానించేందుకు అతడు సంసిద్ధుడవ్వాలి. అతని మానసిక, దైహిక ఆరోగ్య స్థితిలో తేడాలుంటే ఉరిని వాయిదావేయాలి. తీవ్రమైన నేరాలకు విధించే చివరి శిక్ష మరణమే కానీ, ఉరి తీసేదాకా నిందితుడి మానవ హక్కులను కాపుగాయటం రాజ్యాంగ వ్యవస్థ బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. నేరస్థునికి అనాయాస మరణం ప్రసాదించేందుకు చట్టంలో విధివిధానాలు రూపొందాయి. మనం నిజంగానే ‘రూల్‌ఆఫ్‌లా’ను పాటిస్తామని ప్రపంచానికి తెలియజేయటమే ఈ విధివిధానాల ఉద్దేశమా? నిజంగా వీటిని మనం పాటించక్కరేదా?  ఏళ్ళపాటు సాగుతున్న తీవ్రనేరాల విచారణ ప్రక్రియనూ, రూల్‌ఆఫ్‌లా అమలుకు మోకాలడ్డు పెట్టేందుకూ సంబంధమేమిటి?


ఢిల్లీ యూనివర్సిటీ ‘లా’ విభాగం మరణ శిక్ష తీరుతెన్నులపై జరిపిన అధ్యయనం ప్రకారం 2014లో దేశంలో 270మంది నేరస్థులు ఉరితీత ఘడియకోసం రోజులు లెక్కిస్తున్నారు. 2017చివరకు ఈ సంఖ్య 371కి పెరిగింది. గత 13 ఏళ్ళల్లో మన వ్యవస్థ ఉరి తీసింది. కేవలం నలుగురిని మాత్రమే. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులూ, ఒకరు మైనరు బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి. మరణ దండనల విధింపు నానాటికీ పెరుగుతోందని జాతీయ నేరవిభాగం లెక్కలు కోడైకూస్తున్నాయి.


2019లో ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గోగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 27మరణశిక్ష అప్పీళ్ళను ప్రాధాన్యత క్రమంలో విచారించి, మూడు అప్పీళ్ళలో పదిమంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. పేలవమైన నేర పరిశోధన, నిరాసక్త ప్రాసిక్యూషన్‌ నిర్వహణలే ఇందుకు కారణాలుగా ఎత్తి చూపింది. మరో 17మందికి మరణ శిక్షను యావజ్జీవజైలుగా మార్చింది. వీరిలో నలుగుర్ని మరణపర్యంతం జైల్లోనే కాలం గడిపేయాలని ఆదేశించింది. ఒక్కకేసులో మాత్రం పునర్విచారణ జరిపి 13రోజుల్లో తీర్పునివ్వాలని సెషన్సు కోర్టును కోరింది.


నిర్భయ, దిశ, సమత... దుర్ఘటనలు వెలుగులోకి వచ్చిన అనంతరం కొన్నాళ్ళు ఆందోళన జరిపి తర్వాత నిశబ్దంగా వుండటం మనం చూస్తున్నాం. దిశ నిందితులను కోర్టు తీర్పులే కాకుండా శిక్ష విధించిన రక్షక భటులకు మిఠాయిలు తినిపించి, హిరోల్లా కీర్తించి, జనం పండుగ చేసుకోవటం కూడా చూశాం. నిర్భయ నిందితులు న్యాయప్రక్రియతో ఆడుకుంటూ తమ ఉరి శిక్ష అమలును వాయిదా వేసుకుంటున్నారని ‘న్యాయవ్యవస్థ’ నిష్క్రియా పరత్వాన్ని బహిరంగంగా విమర్శలు వెలువడడాన్ని విన్నాం.


శిక్ష విధించిన సెషన్సు కోర్టు మొదటగా రాష్ట్రపతి క్షమాభిక్ష, దాని తిరస్కరణపై సుప్రీం కోర్టులో న్యాయ సమీక్ష, క్యురేటివ్‌ దరఖాస్తు... ఇలా అనేక అవకాశాలను చట్టం, రాజ్యాంగం నేరస్థులకు అందించగా, ఆ అవకాశాలను వినియోగించుకొనే నేరస్థులనూ, అందుకు అనుమతించే న్యాయ వ్యవస్థనూ తూర్పారపట్టటం బాధ్యతా రాహిత్యం, రాజ్యాంగాన్ని వెక్కిరించటమే. దీనికి తోడు జరిగిన రోజు నుండి నెలలోపే విచారణ మొత్తం ముగిసిపోవాలని ‘తొందరపాటు’ విచారణల వల్ల అప్పటికీ మీడియా హడావిడితో నిందితుడి పాత్రపై సమాజం ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉండటాన, కోర్టు న్యాయ ధర్మ విచక్షణాశీలతపై ప్రభావం చూపే ప్రమాదముంది. ‘ఫ్యాస్ట్‌ట్రాక్‌’ విచారణ అంటే నిందితుడికి చట్ట సమ్మతి గల అవకాశాలను తిరస్కరించటం కాదని గమనించాలి. 


అప్పీళ్లూ తబ్సీళ్లతో నిందితులు చట్టంతో దోబూచులాడుకుంటున్నారని, దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సరైన శాసనం కావాలనీ భారత లా కమిషన్‌ 2015లో సిఫార్సు చేసింది. అయితే, వేగవంత విచారణ పేరిట ‘ఫెయిర్‌ ట్రయల్‌’ సూత్రాన్ని విస్మరించరాదనీ కమిషన్‌ను హెచ్చరించింది. ఖైదీలు సగటున 16 ఏళ్ల విచారణ పర్వంతో పాటు మరో పదేళ్ల విచారణానంతరం వేచి ఉండే కాలాన్ని ఎదుర్కొంటున్నారని సెంటర్‌ ఆన్‌ డెత్‌ పెనాల్టీ కేంద్రం తన అధ్యయన పత్రంలో వెల్లడించింది. వ్యక్తిగా నిందితుడు బతికే హక్కు కోసం చివరి క్షణం వరకూ ‘బతుకు పోరాటం’ చేయవచ్చనీ న్యాయ శాస్ర్తం ప్రవచిస్తున్నది. చావుబతుకుల సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న దురదృష్టవంతుణ్ని చూసి జాలి పడాల్సింది పోయి, వెంటనే వాడి ఉసురు తీసేయాలని డిమాండు చేయడం నాగరిక లక్షణం కాదు. ‘రూల్‌ ఆఫ్‌ లా’ను పాలకులే కాదు, పాలితులూ పాటించాల్సిందే!


వేదాంతం సీతారామావధాని 

(సుప్రీం కోర్టు మాజీ సెక్రెటరీ జనరల్‌)

Updated Date - 2020-02-19T06:10:52+05:30 IST