దోమల కారణంగా ఏటా 10 లక్షల ప్రాణాలు పోతుంటే.. వాటి రక్షణకు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-01-31T16:35:23+05:30 IST

వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం తెలిపిన వివరాల ప్రకారం..

దోమల కారణంగా ఏటా 10 లక్షల ప్రాణాలు పోతుంటే.. వాటి రక్షణకు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే..

వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 700 కోట్ల మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో 10 లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధులు ప్రభలడానికి దోమలు కారణమవుతున్నాయి. అయినప్పటికీ  శాస్త్రవేత్తలు దోమలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. దోమ అనేక జీవులకు ఆహారమని, అవి అంతరించిపోతే ఆ జీవులకు కొత్త సంక్షోభం తలెత్తుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. శాస్త్రవేత్తలు దోమల వల్ల మనుషులకు హాని కలగకుండా, రోగాలు రాని విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆడ దోమలు వ్యాధులను వ్యాప్తి చేయడం, కుట్టడం లాంటి పనులు చేస్తాయి. మగ దోమలు పువ్వుల రసంతో వాటి కడుపు నింపుకుంటాయి. ఆడ దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రయోగాలు సాగిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్  యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు డెంగ్యూను నిర్మూలించడానికి అటువంటి దోమ జాతిని ఎంపిక చేశారు. వీటిలో వోల్బాచియా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా డెంగ్యూ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ల్యాబ్‌లో ఈ దోమలను పెంచడం ద్వారా శాస్త్రవేత్తలు వందలాది దోమలను సిద్ధం చేశారు. ప్రాథమిక దశలో ఇలాంటి దోమలను ల్యాబ్‌లో తయారు చేసి.. పర్యావరణంలోకి వదిలేస్తే వాటి సంతానోత్పత్తి ద్వారా ఆ రకమైన దోమల సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా డెంగ్యూ తరహా వ్యాధులు వ్యాపించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


ఈ ప్రక్రియ కొంతకాలం సాగితే దీర్ఘకాలిక వ్యాధులను వ్యాప్తి చేసే దోమల సంఖ్య తగ్గుతుందని తేలింది. ఈ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇదేవిధంగా ఆడ దోమలకు సంతానం కలగకుండా చేయడంపై లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. ఆడ దోమల జన్యువుల్లో సంతానోత్పత్తిని క్షీణింపజేసే విధంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. యూఎస్ఏ టుడే నివేదిక ప్రకారం, ప్రపంచంలో 3,500 కంటే ఎక్కువ రకాల దోమలు ఉన్నాయి. సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటిమాలజిస్ట్ కామెరాన్ వెబ్ తెలిపిన వివరాల ప్రకారం దోమలు అంతరించిపోతే చేపలు, పక్షులు, బల్లులు, కప్పలు తదితర జీవులకు ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే అవి ఆహారం కోసం దోమలు, కీటకాలపైనే ఆధారపడతాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా దోమలను తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం ద్వారా ప్రతి సంవత్సరం మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల కారణంగా నమోదవుతున్న మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. దోమలను పూర్తిగా నిర్మూలించే విషయంలో శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటి సంఖ్య తగ్గితే జీవావరణ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతింటుందని వారంటున్నారు. 



Updated Date - 2022-01-31T16:35:23+05:30 IST