టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడికి దిగితే పోలీసులు ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2022-01-17T08:04:27+05:30 IST

టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడికి దిగితే పోలీసులు ఏం చేస్తున్నారు?

టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడికి దిగితే పోలీసులు ఏం చేస్తున్నారు?

అంబులెన్సుపైనా దాడికి దిగడం అరాచకం

అరవింద్‌బాబుపై దాడి దుర్మార్గం: చంద్రబాబు

‘చదలవాడ’ను చంపే ప్రయత్నం చేశారు: ఎమ్మెల్యే డోలా


అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ శ్రేణులపై వైసీపీ వారు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా?’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్‌బాబుపై దాడిని  తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక  పార్టీ నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవింద్‌బాబు, ఇతర నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్స్‌ పైనా దాడికి దిగటం వైసీపీ అరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. పండుగ పూట కూడా రాష్ట్రంలో అరాచక శక్తు లు చెలరేగిపోతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్నెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులను ప్రశ్నిస్తే, ప్రాణాలు తీస్తారా? అని మండిపడ్డారు. 


బూటు కాలితో తన్నమని ఏ చట్టం చెప్తోంది?: వర్ల

వైసీపీ నేతలు చెప్పిందే చట్టం అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపీ సవాంగ్‌ వచ్చిన తర్వాతే పోలీసు వ్యవస్థకు ఈ గతి పట్టిందని ఆరోపించారు. ‘‘ఎవరిని సంతృప్తిపర్చడానికి టీడీపీ ఇన్‌చార్జి అరవిందబాబును పోలీసు అధికారి బూటు కాలితో తన్నాడు? నిరసన తెలిపితే బూటు కాలుతో తన్నాలని ఏ చట్టం చెప్తోంది? దీన్ని డీజీపీ ఏ విధంగా సమర్థించుకుంటారు? పోలీసుల దాడిలో స్పృహ తప్పి పడిపోయిన అరవిందబాబును ఆస్పత్రికి తీసుకెళ్లే అంబులెన్స్‌పై వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం సిగ్గుచేటు. అరవిందబాబును బూటు కాలుతో తన్నిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలి’’ అని వర్ల డిమాండ్‌ చేశారు.  


రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం: డోలా

రాష్ట్రంలో పోలీసులు దోషులకు రక్షణ కల్పిస్తూ, అమాయకులను బాధ్యుల్ని చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. జొన్నలగడ్డలో వైఎస్‌ విగ్రహం కూల్చి 24 గంటలైనా నిందితుల్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.  నరసరావుపేటలో అరవిందబాబుపై దాడి చేసి, చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో తాలీబన్ల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు.



రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు

‘‘మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి, జగన్‌ సర్కార్‌ రైతు వర్గాన్నే అవమానించింది. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజున రైతు నరేంద్రను జైల్లో పెట్టడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. నరేంద్రను వెంటనే విడుదల చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన జారీ చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ సస్పెండ్‌ అయ్యారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని, వెంటనే రైతు నరేంద్రను విడుదల చేయాలి. వేధింపులకు గురి చేసినందుకు అతని కుటుంబానికి పరిహారం చెల్లించాలి. పండగ పూట ఓ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ఈ ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదు’’ అని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2022-01-17T08:04:27+05:30 IST