Abn logo
Sep 29 2021 @ 03:03AM

Huzurabad ఉప ఎన్నికపై ఉత్కంఠ.. బీజేపీ గెలిస్తే జరిగేది అదే.. కాంగ్రెస్ గెలిస్తే సీన్ రివర్స్..!

హుజూరాబాద్‌షా ఎవరు?

షెడ్యూలు విడుదలతో రసవత్తరంగా రాజకీయం

ఇప్పటికే ముమ్మరంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారం

ఇంకా అభ్యర్థి వేటలోనే కాంగ్రెస్‌.. ప్రచారంలో వెనక

అసెంబ్లీ ఎన్నికలపై హుజూరాబాద్‌ ప్రభావం

అందుకే మూడు పార్టీలకూ ఉప ఎన్నిక ప్రతిష్థాత్మకం

నిరుద్యోగులతో నామినేషన్లు వేయించనున్న షర్మిల


హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హుజూర్‌నగర్‌లో కారు జోరు! ఆ తర్వాత దుబ్బాకలో విరిసిన కమలం! నాగార్జున సాగర్‌లో గుబాళించిన గులాబీ! రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగో ఉప ఎన్నిక హుజూరాబాద్‌లో జరగబోతోంది! ఇక్కడి ఓటర్లు ఎవరికి హుజూర్‌ అంటారన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఫలితంగా, ముక్కోణపు పోటీతో రసవత్తర రాజకీయానికి హుజూరాబాద్‌ వేదిక కానుంది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్‌ను ప్రకటించింది. ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, బీజేపీ అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగనున్నారు. ఇటు టీఆర్‌ఎస్‌, అటు బీజేపీ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి కూడా. కానీ, కాంగ్రెస్సే ఇప్పటి వరకూ అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోయింది. ఇందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయమై ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం కరువైంది. దాంతో, మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే ప్రచారంలోనూ ఆ పార్టీ ప్రస్తుతానికి వెనకబడే ఉంది.


అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం దాదాపు రెండేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. ఆ పార్టీలో ఆత్మ విశ్వాసం మరింత పెరగనుంది. నాలుగు ఉప ఎన్నికల్లో మూడింట గెలిచి సగర్వంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనుంది. అదే సమయంలో, బీజేపీ గెలిస్తే.. తెలంగాణలో కమల వికాసానికి దారులు పరిచినట్లే! దుబ్బాక, హుజూరాబాద్‌ విజయాలతోపాటు జీహెచ్‌ఎంసీలో సాధించిన మంచి ఫలితాలతో ఆ పార్టీలో ఉత్సాహం మరింత పెరగనుంది. ప్రత్యామ్నాయ శక్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనుంది. ఒకవేళ, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధిస్తే.. రాష్ట్రంలో అనూహ్య రాజకీయాలకు తెరలేచినట్లే! ఇప్పటి వరకూ ఏ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రె్‌సది ఓటమి బాటే! ప్రభావం చూపిస్తుందని భావించిన నాగార్జున సాగర్‌లోనూ ఆ పార్టీ గెలుపు తీరాన్ని చేరలేదు. కానీ, రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి జోష్‌ వచ్చింది. కార్యకర్తలూ క్రియాశీలంగా మారారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కనక గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీ మరోసారి ప్రత్యామ్నాయ శక్తిగా తెరపైకి వచ్చినట్లే. ఆ జోష్‌తో అసెంబ్లీ ఎన్నికలకూ ఆ పార్టీ మరిన్ని అస్త్రాలతో సిద్ధం కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే, ఇక్కడ గెలిచేందుకు అన్ని పార్టీలూ సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. 


టీఆర్‌ఎస్‌, బీజేపీ.. ప్రచారం ముమ్మరం

ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన తర్వాత.. గడిచిన నాలుగైదు నెలలుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంపైనే పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. అది చాలా చిన్న ఎన్నిక అని పైకి చెబుతున్నా.. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఆలోచనలు హుజూరాబాద్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో దళిత ఓటర్లు అత్యధికంగా 40 వేలకుపైగా ఉండడంతో వారి ఓట్లపై దృష్టి సారించింది. వార్షిక బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించిన ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం’ను ‘దళిత బంధు’గా మార్చింది. ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయడానికి హుజూరాబాద్‌నే ఎంపిక చేసింది. అంతేనా, ఇక్కడ సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేయాలని కూడా సంకల్పం తీసుకుంది. ఇక, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు రెక్కలొచ్చాయి. పలు సంక్షేమ కార్యక్రమాలు పరుగు అందుకున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు నాలుగైదు నెలలుగా అక్కడ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మండలాలు, గ్రామాల వారీగా వారు పని విభజన చేసుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నేతలు, కుల, వృత్తి సంఘాలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందరికంటే ముందుగా స్థానికుడు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించి, వెంటనే ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇక టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయి. కానీ, ఉప ఎన్నికకు వచ్చేసరికి బీజేపీ కంటే కాంగ్రెస్‌ వెనకబడినట్లు కనిపిస్తోంది. 


కమలనాథులు ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ పోటీ చేయడం లాంఛనమే! ఆయన తన సొంత ఇమేజ్‌తోపాటు పార్టీ అండతో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే (జూన్‌ 12) నియోజకవర్గంలో ప్రచారానికి ఈటల శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక విడత పాదయాత్ర చేశారు. నియోజకవర్గంలోని 119 గ్రామాలకు గాను 70 గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. అస్వస్థత కారణంగా అర్ధాంతరంగా నిలిపివేసిన ఆ యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించనున్నారు. మరోవైపు, ఆయన సతీమణి జమున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈటలకు బీజేపీ అగ్ర నాయకత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. మండలాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగిస్తున్న పాదయాత్ర ఫోక్‌సను హుజూరాబాద్‌ వైపు మళ్లించాలని నిర్ణయించారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ వ్యక్తిగతంగానే కాకుండా తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఈ ఉప ఎన్నికను చావో రేవుగా భావిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించి ప్రచార రంగంలోకి కాంగ్రెస్‌ ఇంకా అడుగు పెట్టాల్సి ఉంది. అభ్యర్థిని త్వరలోనే ఖరారు చేయడానికి ఆ పార్టీ ముఖ్యులు కసరత్తు చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్‌ పుంజుకుందనే వాదనల నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. మరోవైపు, కొత్తగా వైఎ్‌సఆర్‌టీపీని స్థాపించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నిరుద్యోగులను పెద్దఎత్తున బరిలో దించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల నడుమ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావటంతో రాష్ట్రంలో రాజకీయ కాక మరింతగా పెరిగింది.


బీజేపీకి ప్రతిష్ఠాత్మకం!

హుజూరాబాద్‌ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పాదయాత్రలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటి ప్రచారం ముమ్మరం చేసింది. ప్రచారం చివరి అంకంలో అమిత్‌ షా, జేపీ నడ్డాతోపాటు పలువురు జాతీయ నాయకులు రానున్నారు. ఇప్పటికే గౌడ, కురవ యాదవులు, పెరిక, విశ్వకర్మల సమ్మేళనాలు పూర్తికాగా, మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్‌ తదితర సమ్మేళనాలు త్వరలో నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించినా, ఒత్తిడి చేసినా ప్రజల మనసులు మాత్రం ఈటలవైపే ఉన్నాయని నియోజకవర్గ ఇన్‌చార్జి జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పోటీలో కాంగ్రెస్‌ లేదనే తాము భావిస్తున్నామని, టీఆర్‌ఎస్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ చెప్పారు. ఇక, ఈ సెగ్మెంట్‌ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉండడంతో బండి సంజయ్‌ కూడా ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. ఈటలను గెలిపించుకునేందుకు ఇప్పటికే ‘ఆపరేషన్‌ హుజూరాబాద్‌’ చేపట్టారని పార్టీవర్గాలు తెలిపాయి. ప్రతి పోలింగ్‌ బూత్‌ వారీగా ప్రతిరోజూ పార్టీ శ్రేణుల పనితీరును సమీక్షించడంతోపాటు ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని ఎదుర్కొనేందుకు దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.


ప్రతి ఓటరును కలవాలి!

ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి

శ్రేణులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

నియోజకవర్గంలో ప్రతి ఓటరునూ కలవాలని, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బాధ్యతల్లో ఉన్న పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం రాత్రి హుజూరాబాద్‌ బాధ్యతల్లో ఉన్న మంత్రులు, నాయకులతో మాట్లాడారు. గ్రామ, మండల పార్టీ నాయకులతో చర్చించారు. ఒక్కో గ్రామంలో పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చనే అంశంపై ఆరా తీశారు. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీజేపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు.