ఏం సాధించారని.. బస్సుయాత్ర

ABN , First Publish Date - 2022-05-20T05:14:44+05:30 IST

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు బస్సుయాత్రతో ప్రజలను కలుస్తామని ప్రకటించడం సిగ్గుచేటని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఏమి సాధించారని మంత్రులు బస్సుయాత్ర చేస్తారని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం తోటపాలెం రోడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి మినీ మహానాడు కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు.

ఏం సాధించారని.. బస్సుయాత్ర
మాట్లాడుతున్న కిమిడి కళావెంకటరావు

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు
- సందడిగా మినీ మహానాడు
ఎచ్చెర్ల, మే 19:
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు బస్సుయాత్రతో ప్రజలను కలుస్తామని ప్రకటించడం సిగ్గుచేటని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఏమి సాధించారని మంత్రులు బస్సుయాత్ర చేస్తారని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం తోటపాలెం రోడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి మినీ మహానాడు కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ అమరవీరుల ఆత్మశాంతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం కళా వెంకటరావు మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అభివృద్ధి శూన్యం. పాదయాత్ర సమయంలో ప్రతిపక్షనేతగా జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదు సరికదా.. ప్రజలను మరింత ఇబ్బందులు పెడుతున్నారు. అధికారంలోకి వస్తే 2.5లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. కానీ, ఇప్పుడు కనీసం జాబ్‌ క్యాలెండర్‌ కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సిద్ధం చేశాం. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అతీగతీ లేకుండా పోయింది. గిట్టుబాటు ధరలేక, పండిన పంటకు సకాలంలో డబ్బులు చెల్లించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలన సక్రమంగా లేకపోగా.. మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది’ అని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని యాత్రలు చేసినా.. ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. పలుకుబడి.. పరపతి లేనివారికి, బూతులు తిట్టేవారికి, దగాకోరులకు మంత్రి పదవులు కట్టబెడితే సామాజిక న్యాయమవుతుందా? అని కళా ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. అనంతరం ఒంగోలులో ఈ నెల 27,28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడులో ప్రవేశపెట్టేందుకు పలు తీర్మానాలు చేశారు. జి.సిగడాం, రణస్థలం మండలాలకు చెందిన పలువుర్ని టీడీపీ కండువా వేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల టీడీపీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌, లంక శ్యామ్‌, కుమరాపు రవి, మాజీ ఎంపీపీలు బీవీ రమణారెడ్డి, గొర్లె విజయకుమార్‌, డీజీఎం ఆనందరావు, మాజీ జడ్పీటీసీ గొర్లె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

లోకేష్‌ పర్యటనను విజయవంతం చేయాలి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌ పర్యటనను విజయవంతం చేయాలని కళా వెంకటరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘శుక్రవారం విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి లోకేష్‌ రానున్నారు.  చిలకపాలెం మీదుగా రాజాం చేరుకుంటారు. చిలకపాలెం వద్ద మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయనకు ఘన  స్వాగతం పలకాలి’ అని కళా వెంకటరావు సూచించారు. 

Updated Date - 2022-05-20T05:14:44+05:30 IST