ఏం తిని బతకాలి?

ABN , First Publish Date - 2022-01-12T04:59:44+05:30 IST

నిత్యావసరాల ధరల పెరుగుదలపై టీడీపీ శ్రేణులు పోరుబాట పట్టాయి. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ర్యాలీలు... ధర్నాలతో హోరెత్తించాయి. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తంచేశాయి.

ఏం తిని బతకాలి?
నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

నిత్యావసరాల ధరలపై టీడీపీ పోరు

జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు

నిత్యావసరాల ధరల పెరుగుదలపై టీడీపీ శ్రేణులు పోరుబాట పట్టాయి. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ర్యాలీలు... ధర్నాలతో హోరెత్తించాయి. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తంచేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బతుకు భారమవుతోందని... వారు ఏం తిని బతకాలని ప్రశ్నించాయి. టీడీపీ నేతల ధర్నాలు...నిరసనలకు అక్కడక్కడా పోలీసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. 


కాంతి లేని సంక్రాంతి: గుమ్మిడి సంధ్యారాణి 

సాలూరు/ నెల్లిమర్ల, జనవరి 11: వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని సంక్రాంతి పండుగ వేళలో సైతం ప్రజల ఇళ్లలో కాంతులు లేవని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ప్రభుత్వం తీరుపై తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆమె మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేద్దామంటే పని లేదని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక  ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంట అమ్మిన వారు కూడా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తితో రోజువారీ జీవనం గడపటమే కష్టసాధ్యంగా మారిందన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎస్‌డీటీ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పిన్నింటి ప్రసాద్‌, పరమేష్‌, హరి తదితరులు పాల్గొన్నారు. 


ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం: పతివాడ

ఆకాశాన్ని అంటిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గ ఇనచార్జి పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు. నెల్లిమర్లలో మంగళవారం నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ  భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేసి మోసపూరిత విధానాలతో ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఆందోళనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సువ్వాడ రవిశేఖర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో నాయకులంతా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు,  మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నాయకులు మహంతి చిన్నంనాయుడు, పతివాడ తమ్మినాయుడు, కంది చంద్రశే ఖర్‌, పతివాడ రమానాయుడు, గేదెల రాజారావు, బైరెడ్డి లీలావతి, లెంక అప్పలనాయుడు, కర్రోతు సత్యనారాయణ, పిఅప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-12T04:59:44+05:30 IST