5జీపై ఏం చేద్దాం?

ABN , First Publish Date - 2020-07-02T07:52:05+05:30 IST

టెలికం రంగంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా వినిపిస్తున్న తారక మంత్రం.. 5జీ. కానీ, దానిపై ఆధిపత్యం ప్రస్తుతానికి చైనా కంపెనీలకే ఉంది. నోకియా

5జీపై ఏం చేద్దాం?

‘వావే’కు అనుమతులపై సర్కారు మల్లగుల్లాలు.. గత ఏడాది డిసెంబరులో అనుమతి

తాజా పరిణామాలతో పునరాలోచన

వావేకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ చెక్‌

మనదేశంలో వావే పెట్టుబడి ఇది. భారత్‌లో ఆ సంస్థకు 7500 మంది ఉద్యోగులున్నారు. అందులో 96 శాతం

భారతీయులే. చైనా తర్వాత.. వావే కంపెనీకి చెందిన రెండో అతిపెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రం భారత్‌లోనే ఉంది. 


టెలికం రంగంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా వినిపిస్తున్న తారక మంత్రం.. 5జీ. కానీ, దానిపై ఆధిపత్యం ప్రస్తుతానికి చైనా కంపెనీలకే ఉంది. నోకియా, ఎరిక్‌సన్‌, సామ్‌సంగ్‌ వంటి కంపెనీలు కూడా 5జీ టెక్నాలజీని అందిస్తున్నా ఎక్కువ దేశాలు చైనాకు చెందిన వావే, జెడ్‌టీఈ కంపెనీల సేవలనే వినియోగించుకుంటున్నాయి. ప్రపంచ 5జీ మార్కెట్‌లో ఒక్క వావే వాటానే 29 శాతం! ఆ కంపెనీ ఉత్పత్తులు, సేవలు అన్నీ చౌకగా లభించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే మనదేశం కూడా.. 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌లో పాలుపంచుకునేందుకు వావే కంపెనీకి గత ఏడాది డిసెంబరులో అనుమతులిచ్చింది. కానీ, సరిహద్దుల్లో చైనా వైఖరితో.. ఆ అనుమతులపై పునరాలోచిస్తోంది. నిజానికి ఆ కంపెనీపై చాలాకాలం క్రితమే అమెరికా ఆంక్షలు విధించింది.


చైనాకు చెందిన వావే, జెడ్‌టీఈ కంపెనీలు తమ దేశ భద్రతకు ముప్పు అని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాలు కూడా ఆ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌ పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను వాడొద్దని ఒత్తిడి తెస్తోంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం వావే కంపెనీకి మన 5జీ ట్రయల్స్‌లో అనుమతిచ్చింది. కానీ, సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరితో కేంద్రం ఆలోచనా ధోరణి మారింది. 4జీ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి చైనా టెలికం ఉత్పత్తులను వాడొద్దని.. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంటీఎన్‌ఎల్‌)కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం (డీవోటీ)  సూచించింది. ఆయా కంపెనీల సేవలను, ఉత్పత్తులను క్రమక్రమంగా తగ్గించుకోవాల్సిందిగా ప్రైవేటు ఆపరేటర్లకు కూడా భారత సర్కారు సూచించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధానికి సంబంధించి జరిగిన మంత్రుల ఉన్నతస్థాయి సమావేశంలో వావే 5జీ సేవల నిలిపివేతపై చర్చించినట్టు తెలుస్తోంది. అసలు మనదేశంలో 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులే ఇంతవరకూ జరగలేదు. ఈ ఏడాది చివర్లో 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరపనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ సేవలు వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి మరో ఏడాదిపైగానే పడుతుందని అంచనా. అయితే.. చౌకగా పరికరాలను అందించే వావే, జెడ్‌టీఈలను కేంద్రం నిషేధిస్తే 5జీ ఉపకరణాల ఖర్చు 10 నుంచి 15 శాతం దాకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


స్వావలంబన సాధ్యమేనా?

అంతరిక్ష రంగంలో అగ్రదేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వకపోతే.. మన ఇస్రో శాస్త్రజ్ఞులే పలు పరిజ్ఞానాలను దేశీయంగా అభివృద్ధి చేశారు. దీంతో ఇస్రో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. అదే పద్ధతిలో 5జీ టెక్నాలజీని కూడా మనదేశం సొంతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, అందుకు కొంత సమయం పడుతుందంటున్నారు. ఏ దేశమైనా సాంకేతికంగా ఎదగాలంటే అందుకు ఏకైక మార్గం ఆర్‌ అండ్‌ డీనే. ఆ విషయంలో భారత్‌ చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వం దీన్ని అవకాశంగా మలుచుకుని పరిశోధన, అభివృద్దికి విస్తృతంగా నిధులిస్తే భారతదేశ సాంకేతిక పురోగతి ఖాయమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 


వావేపై అమెరికా అభ్యంతరాలివీ..

వావే కంపెనీ 5జీ నెట్‌వర్క్స్‌పై నిషేధం విధించాలని దాదాపు ఏడాదిన్నరగా అమెరికా ప్రపంచంలోని పలు దేశాలను కోరుతోంది. ఆ నెట్‌వర్క్‌ సాయంతో చైనా ఆయా దేశాల్లోని విదేశీయులపై నిఘా వేస్తోందన్నది అమెరికా ఆరోపణ. అమెరికా సూచనలను ఆస్ట్రేలియా, జపాన్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలు పాటించగా, యూకే తదితర యూరోపియన్‌ దేశాలు మాత్రం ఇంకా ఆయా సంస్థలకు అవకాశం ఇస్తున్నాయి.


5జీతో అద్భుతాలెన్నో..

ప్రస్తుతానికి ప్రయోగాల దశలో ఉన్న స్వయం చోదక వాహనాలకు 5జీ టెక్నాలజీయే ప్రాణం. ఇప్పుడు శైశవ దశలో ఉన్న ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌.. 5జీ విప్లవంతో మున్ముందు ఇంటింటా అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి, ట్రాఫిక్‌ నిర్వహణకు.. తెలివైన రవాణా వ్యవస్థల నిర్మాణానికి, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, తెలివైన డ్రోన్లు.. ఇలా భవిష్యత్తు ముఖచిత్రమే మారిపోతుంది. 


ఇప్పటికే 5జీ ఉన్న దేశాలు

దక్షిణ కొరియా, అమెరికా, చైనా లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే.. అదీ ఆయా దేశాల్లోని కొన్ని నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో.. దక్షిణ కొరియా మిగతా అన్ని దేశాల క న్నా ముందంజలో ఉంది. అక్కడ ఈ ఏడాది జనవరి నాటికే 85 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2026 నాటికి దక్షిణ కొరియాలోని మొబైల్‌ వినియోగదారుల్లో 90 శాతం మందికి 5జీ సేవలు అందుతాయని అంచనా. దక్షిణ కొరియా తర్వాత.. చైనాలో అత్యధికంగా 57 నగరాల్లో 5జీ సేవలు అందుతున్నాయి. అమెరికాలో.. ఏటీ అండ్‌ టీ, స్ర్పింట్‌, వెరిజాన్‌, టి మొబైల్‌ వంటి మొబైల్‌ సేవల సంస్థలు 2019 నుంచే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మనకన్నా చిన్నదేశాలైన స్వీడన్‌, ఎస్తోనియా కూడా 2018 డిసెంబర్‌ నుంచే 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్నాయి. ఇక, జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకోమో సంస్థ.. 2010 నుంచే 5జీ పరిజ్ఞానంపై ప్రయోగాలు చేస్తోంది. 


‘వీబో’కు మోదీ గుడ్‌బై

చైనాకు చెందిన 59 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ‘వీబో’ ఖాతాకు గుడ్‌బై చెప్పారు. దీంతో బుధవారం ఆయన ఖాతా ఖాళీగా దర్శనమిచ్చింది. చైనాలో అతిపెద్ద మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ గా ఉన్న వీబోలో మోదీ ప్రొఫైల్‌ ఫొటోతోపాటు  పోస్ట్‌లు, కామెంట్లను తొలగించారు. వీబోలో ప్రధాని చేసిన 115 పోస్ట్‌లున్నట్టు సమాచారం. వీఐపీ ఖాతాలకు సంబంధించి క్లిష్టమైన ప్రక్రియ ఉండటం వల్ల వీటిని మాన్యువల్‌గా తొలగించాల్సి వచ్చినట్టు తెలిసింది. 2015లో చైనా పర్యటనకు ముందు వీబోలో మోదీ చేరారు. 

-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-07-02T07:52:05+05:30 IST