జాకెట్ సరిగా కుట్టలేదంటూ భర్తపై మండిపడిన భార్య.. అయితే నువ్వే కుట్టుకో అని భర్త అన్నందుకు.. ఎంత పని చేసింది..

ABN , First Publish Date - 2021-12-06T02:20:16+05:30 IST

చిన్నచిన్న కారణాలతో మహిళలు నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వారి సమస్యకు కారణాలు పరిశీలిస్తే.. చాలా సిల్లీగా ఉంటాయి. హైదరాబాద్‌లోని గోల్నాకలో ఓ మహిళ కూడా ఇలాగే చేసింది..

జాకెట్ సరిగా కుట్టలేదంటూ భర్తపై మండిపడిన భార్య.. అయితే నువ్వే కుట్టుకో అని భర్త అన్నందుకు.. ఎంత పని చేసింది..
విజయలక్ష్మి (ఫైల్)

క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలే ముందుంటారు. ఇక సున్నిత హృదయం కలిగిన మహిళలైతే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీదు. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననో.. ఇలా చిన్నచిన్న కారణాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వారి సమస్యకు కారణాలు పరిశీలిస్తే.. చాలా సిల్లీగా ఉంటాయి.  హైదరాబాద్‌లోని గోల్నాకలో ఓ మహిళ కూడా ఇలాగే చేసింది.. వివరాల్లోకి వెళితే..


హైదరాబాద్‌లోని గోల్నాక తిరుమలనగర్‌లో శ్రీనివాసులు, విజయలక్ష్మి(35) దంపతులు.. ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ చీరలు, జాకెట్లు విక్రయిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తుంటాడు. బైక్‌పై సరుకు వేసుకుని పొద్దున వెళ్లి.. రాత్రికి ఇంటికి చేరుకుంటాడు. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఓరోజు బ్లౌజ్ కుట్టమని తన భర్తను కోరింది. భార్య కోరిక మేరకు అతను జాకెట్‌‌ను తనకు నచ్చిన రీతిలో కుట్టి ఇచ్చాడు. అయితే అది చూసిన ఆమె.. ఇదేంటి, సైజు సరిగా కుట్టలేదు.. నాకు అసలు నచ్చలేదంటూ.. భర్తతో గొడవపడింది. అయితే నీకు నచ్చినట్లుగా నువ్వే కుట్టుకో.. అంటూ భర్త కోపంతో బయటికి వెళ్లిపోయాడు.


భర్త అన్న ఆ చిన్న మాటకే ఆమె తీవ్ర ఆందోళన చెందింది. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన భర్తకు తలుపులు వేసి కనిపించాయి. ఎంత పిలిచినా తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన భార్యను చూసి షాక్ అయ్యాడు. అతడి అరుపులతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబర్‌పేట పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి మృతదేహం వద్ద ఉన్న పిల్లలను చూసి.. స్థానికులు అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Updated Date - 2021-12-06T02:20:16+05:30 IST