Supreme Court : జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంకోర్టు ఏమందంటే..

ABN , First Publish Date - 2022-05-13T18:20:21+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో సర్వేను తక్షణమే

Supreme Court : జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంకోర్టు ఏమందంటే..

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి (Gyanvapi) మసీదులో సర్వేను తక్షణమే నిలిపేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో ఉన్న ఈ మసీదులో సర్వే నిర్వహించాలని వారణాసి (Varanasi) కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 


ఈ మసీదులో హిందూ (Hindu) దేవతల (Deities) విగ్రహాలు ఉన్నాయని, వాటిని ప్రతి రోజూ అర్చించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై వారణాసి కోర్టు విచారణ జరుపుతోంది. కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో ఈ మసీదులో సర్వే చేసి, వీడియో చిత్రీకరణ చేసి, నివేదికను ఐదు రోజుల్లోగా (మే 17) సమర్పించాలని గురువారం ఆదేశించింది. 


అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ తరపున సీనియర్ అడ్వకేట్ హుజెఫా అహ్మది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం సమక్షంలో వాదనలు వినిపించారు. వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని, యథాతథ పరిస్థితిని కొనసాగించాలని  కోరారు. వారణాసిలోని మసీదులో సర్వే చేయాలని కోర్టు ఆదేశించిందని, ఇది ప్రార్థనా స్థలాల చట్టం క్రిందకు వస్తుందని తెలిపారు. ఇది చాలా పురాతన మసీదు అని చెప్పారు. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించాలని కోరారు. 


దీనిపై సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ, తాము పత్రాలను చూడలేదని, ఈ సమస్య ఏమిటో తమకు తెలియదని, తనకు ఏ విషయం తెలియదని, తాను ఎలా ఆర్డర్ ఇవ్వగలనని అన్నారు. తాను పత్రాలను చదివిన తర్వాత ఆర్డర్స్ ఇస్తానని చెప్పారు. 


ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్లపై వారణాసి కోర్టు విచారణ జరిపి, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలని  గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా ద్వారా ఈ మసీదులో తనిఖీ నిర్వహించాలని తెలిపింది. ఈ ఆదేశాలను ఏప్రిల్ 28న అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. అజయ్ మిశ్రాను మార్చాలని మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ చేసిన వాదనను వారణాసి కోర్టు అంగీకరించలేదు. అజయ్ మిశ్రాను అడ్వకేట్ కమిషనర్‌గా కొనసాగిస్తూ, విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్‌ అనే ఇద్దరు న్యాయవాదులను అదనంగా నియమించింది. 


మసీదు ప్రాంగణంలోని పశ్చిమ గోడ వెనుక ఉన్న దేవాలయంలో ఏడాది పొడవునా పూజలు చేసేందుకు అనుమతించాలని పిటిషనర్లు కోరారు. ప్రస్తుతం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే పూజలు చేసేందుకు అనుమతిస్తున్నారు. పాత దేవాలయం ప్రాంగణంలోని దేవతలను కూడా పూజించేందుకు అనుమతించాలని ఈ మహిళలు కోరారు. 




Read more